Shane Warne: ఇంగ్లాండ్‌ ఆటగాళ్ల కోసం షేన్‌వార్న్‌ ఐదంకెల బిల్‌ కట్టాడు: గిల్‌క్రిస్ట్‌

ఆస్ట్రేలియా స్పిన్‌ దిగ్గజం, దివంగత క్రికెటర్‌ షేన్‌వార్న్‌ది మంచి మనసని, అతని గురించి తెలియని వాళ్లు తప్పుగా అర్థం చేసుకుంటారని మాజీ వికెట్‌ కీపర్‌ ఆడం గిల్‌క్రిస్ట్‌ అన్నాడు....

Published : 07 Mar 2022 11:28 IST

సహచర ఆటగాడిని స్మరించుకున్న మాజీ కీపర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా స్పిన్‌ దిగ్గజం, దివంగత క్రికెటర్‌ షేన్‌వార్న్‌ మనసు చాలా గొప్పదని, అతని గురించి తెలియని వాళ్లు తప్పుగా అర్థం చేసుకుంటారని మాజీ వికెట్‌ కీపర్‌ ఆడం గిల్‌క్రిస్ట్‌ అన్నాడు. ఈ స్పిన్‌ దిగ్గజం గత శుక్రవారం థాయ్‌లాండ్‌లోని ఓ ప్రైవేటు రిసార్ట్‌లో అకాలమరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతనికి నివాళులర్పిస్తూ గిల్‌క్రిస్ట్‌ ‘ది టెలిగ్రాఫ్‌’ పత్రికకు ఓ వ్యాసం రాశాడు. అందులో షేన్‌వార్న్‌తో తనకున్న అనుబంధంతో పాటు అతని మంచి మనసు గురించి చెప్పుకొచ్చాడు.

‘ఒకసారి పలువురు ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు మెల్‌బోర్న్‌ అవతల ఉన్న ఓ ప్రత్యేకమైన గోల్ఫ్‌ క్లబ్‌కు వెళ్లేందుకు షేన్‌వార్న్‌ హెలికాఫ్టర్‌ సదుపాయాలు కల్పించాడు. అందుకు బదులుగా వాళ్లు వార్న్‌కు ఓ బహుమతి ఇచ్చారని కూడా నాకు తెలుసు. కానీ, అలా వారికి హెలికాఫ్టర్‌ సదుపాయాలు కల్పించినందుకు గానూ ఐదంకెల పెద్ద మొత్తంలో బిల్‌ వచ్చింది. అయినా, అతడు ఏమాత్రం ఆలోచించకుండా చాలా తేలిగ్గా చెల్లింపులు చేశాడు. ఆ విషయంలో ఎలాంటి ఫిర్యాదులు చేయడం కానీ, వార్న్‌ బాధ పడటం కానీ నేను చూడలేదు. అలా చేయడం అతడికే చెల్లింది. చాలా మంచి మనసున్న వ్యక్తి’ అని గిల్‌క్రిస్ట్‌ వివరించాడు. అలాగే 1997లో తాను ఫస్ట్‌క్లాస్‌ క్రికెటలో నిలదొక్కుకునేందుకు కూడా వార్న్‌ సహాయం చేశాడని చెప్పాడు. ఇది తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని మాజీ కీపర్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని