NED vs AFG: నెదర్లాండ్స్‌పై విజయం.. అఫ్గానిస్థాన్‌ సెమీస్‌ ఆశలు సజీవం..

లఖ్‌నవూ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ విజయం సాధించింది.

Updated : 03 Nov 2023 20:50 IST

లఖ్‌నవూ: క్రికెట్‌ వన్డే ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. లఖ్‌నవూ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సెమీస్‌ అవకాశాలు నిలబెట్టుకుంటూ.. పాయింట్ల పట్టికలో ఏడో స్థానం నుంచి ఐదో స్థానానికి ఎగబాకింది. తొలుత నెదర్లాండ్స్‌ను 46.3 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌట్‌ చేసిన అఫ్గాన్‌ జట్టు..  31.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్‌ (10), ఇబ్రహీం జర్దాన్‌ (20) తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరినా, తర్వాత వచ్చిన రహ్మత్‌ షా (52; 54 బంతుల్లో 8 ఫోర్లు), షాహిది (56; 64 బంతుల్లో 6 ఫోర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. అజ్మతుల్లా (31*) నాటౌట్‌గా నిలిచాడు.

లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గాన్‌కు ఆదిలోనే ఇబ్బంది ఎదురైంది. వాన్‌ బీక్‌ వేసిన 5.3వ బంతికి ఎడ్వర్డ్స్‌కి క్యాచ్‌ ఇచ్చి ఓపెనర్ రహ్మనుల్లా (10) ఔటయ్యాడు. అక్కడికి నాలుగు ఓవర్ల వ్యవధిలోనే వాన్‌ డెర్‌ బౌలింగ్‌లో మరో ఓపెనర్‌  ఇబ్రహీం జర్దాన్‌ (20) బౌల్డయ్యాడు. అయితే, స్కోరు తక్కువగా ఉండటంతో అఫ్గాన్‌ జట్టు పెద్దగా శ్రమించాల్సిన అవసరం రాలేదు. తొలి డౌన్‌లో వచ్చిన రహ్మత్‌ షా క్రీజులో నిలదొక్కుకొని ఇన్నింగ్స్‌ నిర్మించాడు. జట్టు స్కోరు 129 పరుగుల వద్ద రహ్మత్‌ షా ఔటైనప్పటికీ.. షాహిది, అజ్మతుల్లా లక్ష్యాన్ని పూర్తి చేశారు.

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన నెదర్లాండ్స్‌ను అఫ్గాన్‌ బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. తొలి ఓవర్లోనే కీలక బ్రెస్సి వికెట్‌ పడగొట్టి.. ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశారు. ముజీబ్‌ వేసిన తొలి ఓవర్ చివరి బంతికి బ్రెస్సీ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్‌ మ్యాక్స్ (42) క్రీజులో నిలదొక్కుకుంటూ ఇన్నింగ్స్‌ నిర్మించే ప్రయత్నం చేశాడు. తొలి డౌన్‌లో వచ్చిన అకెర్‌మన్‌ (29) నిరాశ కలిగించినా.. రెండో డౌన్‌లో వచ్చిన సైబ్రాండ్‌ (58) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఓవైపు వికెట్లు పడిపోతున్నా.. పట్టువిడువకుండా పరుగులు రాబట్టాడు. అయితే.. జట్టు స్కోరు 152 పరుగుల వద్ద రనౌట్‌గా వెనుదిరగడం జట్టుకు శరాఘాతంగా మారింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లెవరూ పెద్దగా ప్రదర్శన చేయకపోవడంతో.. నెదర్లాండ్స్ 179 పరుగులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అఫ్గాన్‌ బౌలర్లలో నబి  3 వికెట్లు పడగొట్టగా.. నూర్‌ ఆహ్మద్‌ 2, ముజీబ్‌ ఒక వికెట్‌ తీశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని