Ajaz Patel: లేటు వయసులో అదరగొట్టే ఘనత.. పుట్టిన గడ్డమీదే అరుదైన రికార్డు

ఇదే గడ్డ మీద పుట్టాడు.. ఇక్కడే అద్భుతం సృష్టించాడు.. అయితే ఆడింది మాత్రం...

Published : 05 Dec 2021 02:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇదే గడ్డ మీద పుట్టాడు.. ఇక్కడే అద్భుతం సృష్టించాడు.. అయితే ఆడింది వేరే దేశం తరఫున అయినా.. ఘనత సాధించింది మాత్రం టీమ్‌ఇండియా మీదనే.. ఇప్పటికే అర్థమై ఉంటుందిగా అతడెవరో..! న్యూజిలాండ్‌ సంచలన స్పిన్‌ బౌలర్‌ అజాజ్‌ యూనస్‌ పటేల్‌. భారత్‌, కివీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు సందర్భంగా పది వికెట్ల ప్రదర్శన చేసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. లేటు వయసులోనైనా తనదైన ముద్ర వేశాడు. అంతర్జాతీయంగా మూడో బౌలర్‌గా, కివీస్‌ తరఫున తొలి ఆటగాడిగా రికార్డు సాధించాడు. ఇంతకీ అజాజ్‌ ఎక్కడివాడు.. ఎక్కడికి వెళ్లాడు.. అతడి క్రికెట్‌ కెరీర్‌ గురించి వివరాలు మీ కోసం..

అవును అజాజ్‌ పటేల్‌ జన్మించింది ముంబయిలోనే మరి. 1988 అక్టోబర్‌ 21న పుట్టిన అజాజ్‌ చిన్నతనంలోనే అతడి కుటుంబం న్యూజిలాండ్‌కు షిఫ్ట్‌ అయిపోయింది. ఆక్లాండ్‌లో 2012వ సంవత్సరాన ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ కెరీర్‌లోకి అడుగుపెట్టాడు. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత 2018లో టెస్టు, టీ20ల్లోకి అరంగేట్రం చేశాడు. ఎడమ చేతి వాటం బ్యాటింగ్‌, బౌలింగ్ చేసే అజాజ్‌ 30 ఏళ్ల వయసులో ఆ దేశ జాతీయ జట్టులోకి వచ్చాడు. అజాజ్‌ ఇప్పటివరకు 11 టెస్టులు మాత్రమే ఆడాడు. 39 వికెట్లు పడగొట్టాడు. అత్యత్తమ బౌలింగ్‌ గణాంకాలు 10/119. అంతర్జాతీయంగా ఏడు టీ20లను ఆడిన అజాజ్‌ 4/16 ఉత్తమ బౌలింగ్‌తో 11 వికెట్లు తీశాడు. మూడేళ్ల కిందట జట్టులోకి వచ్చిన అజాజ్‌కు మిచెల్‌ సాట్నర్, సోధి, రచిన్‌ రవీంద్ర నుంచి విపరీతమైన పోటీ నెలకొంది. అయితే లేటు వయసులో వచ్చిన అవకాశాన్ని చేజేతులా సద్వినియోగం చేసుకున్నాడు. భారత్‌తో తొలి టెస్టులో పెద్దగా రాణించని అజాజ్‌.. రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఒంటి చేత్తో వికెట్లను పడగొట్టేశాడు.

అరంగేట్రంలోనే మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌

భారత్‌ తరఫున కివీస్‌తో సిరీస్‌ సందర్భంగా అరంగేట్రం చేసిన శ్రేయస్‌ అయ్యర్‌ (105, 65) ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ఎలా అయితే అందుకున్నాడో.. అజాజ్‌ కూడా పాకిస్థాన్‌తో జరిగిన  మ్యాచ్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ సొంతం చేసుకోవడం విశేషం. 2018లో మిచెల్‌ శాట్నర్‌ గైర్హాజరీలో అజాజ్‌కు అవకాశం దక్కింది. తొలి టెస్టులోనే ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీసిన అజాజ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టి కివీస్‌ను గెలిపించాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఆ మ్యాచ్‌లో తొలుత న్యూజిలాండ్‌ 153 పరుగులకే ఆలౌటైంది. అయితే పాక్‌ 227 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో పాక్‌కు 74 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 249 పరుగులు చేసి 175 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. అజార్‌ అలీ (65), అసద్‌ షఫీక్ (45) రాణించడంతో పాక్‌ గెలుస్తుందని భావించినా.. అజాజ్‌ పటేల్ (5/59), సోధి (2/37), నీల్ వాగ్నెర్ (2/27) దెబ్బకు 171 పరుగులకే కుప్పకూలి నాలుగు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఏడు వికెట్లు పడగొట్టిన అజాజ్‌ ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. టెస్టులు, టీ20లను ఆడిన అజాజ్‌ ఇప్పటి వరకు వన్డే మ్యాచ్‌లను మాత్రం ఆడలేకపోయాడు. 2018లోనే వన్డే జట్టుకు ఎంపికైనప్పటికీ తుది జట్టులో మాత్రం స్థానం దొరకలేదు. 

ఒకరు అలా.. మరొకరు ఇలా

ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన ఘనత ముగ్గురికే సొంతం. అంతా స్పిన్నర్లే కావడం విశేషం. ఇంగ్లాండ్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ జిమ్‌లేకర్‌ (1956లో) ఆసీస్‌పై పదికి పది తీశాడు. కేవలం 53 పరుగులే ఇచ్చి అన్ని వికెట్లు పడగొట్టడం విశేషం. ఇప్పటికీ ఇదే రికార్డు. లేకర్‌ తర్వాత దాదాపు 43 ఏళ్లకు (1999) ఈ అద్భుతాన్ని సృష్టించింది మన అనిల్ కుంబ్లే. పాక్ మీద 10/74 ప్రదర్శనతో చెలరేగాడు. మళ్లీ 22 ఏళ్లకు అజాజ్‌ పటేల్‌ (10/119) సాధించాడు. అయితే ఇక్కడ ఆనందపడాల్సిన విషయం వీరిద్దరూ భారతీయ సంతతికి చెందిన వారే. కాకపోతే ఒకరు టీమ్‌ఇండియాకే ఆడితే.. మరొకరు భారత్‌పైనే రికార్డు నెలకొల్పడం గమనార్హం.

అజాజ్‌ ఏమన్నాడంటే..

‘‘ఇప్పటికే చాలాసార్లు కుంబ్లే సాధించిన ఫీట్‌ (ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీయడం)ను వీక్షించా. తప్పనిసరిగా ప్రతి ఒక్కరికీ ఆ రికార్డు గుర్తు ఉంటుంది. కుంబ్లే పంపిన సందేశం చూశా. నేను కూడా పది వికెట్ల క్లబ్‌లో చేరడం ఎంతో ఆనందంగా ఉంది’’ అని అజాజ్‌ పటేల్‌ పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని