Arjun Tendulkar: మన్కడింగ్‌ను సమర్థిస్తా.. కానీ నేను చేయను: అర్జున్‌ తెందూల్కర్‌

క్రికెట్‌లో మన్కడింగ్‌ రనౌట్‌ చేసిన ప్రతిసారీ చర్చనీయాంశం అవుతుంది. మన్కడింగ్‌పై సచిన్‌ తనయుడు అర్జున్‌ తెందూల్కర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను మన్కడింగ్‌ చేయడానికి ప్రయత్నించనని చెప్పాడు.

Published : 19 Jan 2023 01:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను మన్కడింగ్‌ రనౌట్‌ను సమర్థిస్తానని భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ కుమారుడు అర్జున్ తెందూల్కర్‌ అన్నాడు. మన్కడింగ్‌ రనౌట్‌ క్రికెట్‌ స్ఫూర్తికి విరుద్ధం అని భావించడం సరైనదికాదని పేర్కొన్నాడు. కానీ తాను మాత్రం మన్కడింగ్‌ చేయడానికి ప్రయత్నించనన్నాడు.

క్రికెట్‌లో మన్కడింగ్‌ ఘటనలు ఎప్పుడు జరిగినా ప్రపంచ వ్యాప్తంగా చర్చలు మొదలవుతాయి. మన్కడింగ్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని కొందరు భావిస్తారు. ప్రస్తుతం గోవా తరఫున రంజీ ట్రోఫీలో ఆడుతున్న అర్జున్‌ తెందూల్కర్‌ మన్కడింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘‘మన్కడింగ్‌కు నేను అనుకూలమే. అది న్యాయబద్ధమే. అది క్రికెట్‌ స్ఫూర్తికి విరుద్ధం అని భావించే వారితో నేను ఏకీభవించను. కానీ నేను మాత్రం మన్కడింగ్‌ రనౌట్‌ చేయను. ఎవరైనా మన్కడింగ్‌ చేస్తే మాత్రం సమర్థిస్తా’’ అని అర్జున్‌ పేర్కొన్నాడు. గతంలో మన్కడింగ్ ఘటనలపై సచిన్‌ తెందూల్కర్‌ భారత ఆటగాళ్లకు మద్ధతుగా నిలిచాడు. మన్కడింగ్‌ క్రీడా నియమాల్లో భాగమేనని, అది క్రికెట్‌ స్పూర్తికి భంగం కలిగించదని సచిన్‌ స్పష్టం చేసిన విషయం విదితమే.

ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ తొలి మ్యాచ్‌లో.. నాన్‌స్ట్రైకర్‌గా ఉన్న శ్రీలంక కెప్టెన్‌ డాసున్‌ శనకను భారత పేసర్‌ మహమ్మద్‌ షమీ మన్కడింగ్‌ రనౌట్‌ చేశాడు. శనకను ఆవిధంగా ఔట్‌ చేయడం ఇష్టంలేని రోహిత్‌ శర్మ రనౌట్‌ అప్పీలును వెనక్కి తీసుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని