MS Dhoni - Raina : లార్డ్స్‌ వేదికగా.. అపూర్వ సోదరులు మళ్లీ కలిశారు!

ఎంఎస్ ధోనీ, సురేశ్‌ రైనా అభిమానులకు పండుగలాంటి వార్త.. భారత టీ20 లీగ్‌ 2021 సీజన్‌ వరకు చెన్నై జట్టుకు సురేశ్‌ రైనా ప్రాతినిధ్యం వహించిన విషయం..

Published : 15 Jul 2022 13:59 IST

సోషల్‌ మీడియాలో ధోనీ-రైనా  హల్‌చల్‌

(ఫొటో సోర్స్‌: చెన్నై ట్విటర్‌)

ఇంటర్నెట్ డెస్క్‌: ఎంఎస్ ధోనీ, సురేశ్‌ రైనా అభిమానులకు పండుగలాంటి వార్త.. భారత టీ20 లీగ్‌ 2021 సీజన్‌ వరకు చెన్నై జట్టుకు సురేశ్‌ రైనా ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. అయితే కెప్టెన్‌ ఎంఎస్ ధోనీకి రైనాకు మధ్య పొసగకపోవడంతో యూఏఈ వేదికగా జరిగిన సీజన్‌ మధ్యలోనే రైనా బయటకొచ్చాడనే వార్తలు అప్పట్లో సంచలనం రేపాయి. ఆ తర్వాత సురేశ్‌ రైనాను చెన్నై వదిలేసుకుంది. మరోవైపు మెగా వేలంలోనూ ఎవరూ కొనుగోలు చేయలేదు. ఆఖరికి బేస్‌ప్రైస్‌కైనా చెన్నై కొనుగోలు చేస్తుందేమోనని భావించినా సఫలం కాకపోవడంతో ధోనీ-రైనా మధ్య వివాదం నిజమేనని క్రికెట్ ప్రేమికులు భావించారు. అయితే వీటన్నింటిని పటాపంచలు చేస్తూ తాజాగా ఎంఎస్ ధోనీ, సురేశ్‌ రైనా కలిసి ఇంగ్లాండ్‌తో టీమ్‌ఇండియా ఆడిన రెండో వన్డే మ్యాచ్‌ను వీక్షించడం అభిమానులను సంతోషపెట్టింది. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం కావడంతో వైరల్‌గా మారాయి. ఈ మ్యాచ్‌ను చూసేందుకు సౌరభ్‌ గంగూలీ, సచిన్‌ తెందూల్కర్, హర్భజన్‌ సింగ్‌ కూడా హాజరయ్యారు.

‘తలా’.. ‘చిన్న తలా’గా ధోనీ, రైనాలను చెన్నై అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. చాలా రోజుల తర్వాత వీరిద్దరూ పక్కపక్కన ఉండటంతో అభిమానుల ఆనందానికి అంతేలేదు. లార్డ్స్‌ వేదికగా జరిగిన భారత్‌ - ఇంగ్లాండ్‌ మ్యాచ్‌కు వీరిద్దరూ ఒకే కారులో రావడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోను, కలిసి ఉన్న ఫొటోలను చెన్నై తన ట్విటర్‌లో పోస్టు చేసింది. ‘‘మళ్లీ కలిసిన బ్రదర్స్‌.. తలా.. చిన్న తలా’’ అని కామెంట్‌ జోడించింది. మరి వీరిద్దరూ కలిశారంటే వచ్చే సీజన్‌లో మళ్లీ సురేశ్‌ రైనాను చెన్నై జెర్సీలో చూడొచ్చేమో.. ఆలోపు వారిద్దరూ ఉన్న వీడియోను, ఫొటోలను మీరూ చూసేయండి..



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని