Covid 19: ఆసీస్‌ క్రికెటర్‌కు కరోనా

అంతర్జాతీయ క్రికెటర్లు ఒక్కొక్కరుగా కరోనా వైరస్‌ బారిన పడుతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా వెటరన్‌ బ్యాట్స్‌మన్‌ పీటర్‌ హాండ్స్‌కాంబ్‌కు పాజిటివ్‌ వచ్చింది. ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్‌ ఆడుతుండగా అతడికి వైరస్‌ సోకడం గమనార్హం....

Published : 12 Jul 2021 13:37 IST

కౌంటీ ఆడుతున్న హాండ్స్‌కాంబ్‌కు పాజిటివ్‌

మెల్‌బోర్న్‌: అంతర్జాతీయ క్రికెటర్లు ఒక్కొక్కరుగా కరోనా వైరస్‌ బారిన పడుతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా వెటరన్‌ బ్యాట్స్‌మన్‌ పీటర్‌ హాండ్స్‌కాంబ్‌కు పాజిటివ్‌ వచ్చింది. ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్‌ ఆడుతుండగా అతడికి వైరస్‌ సోకడం గమనార్హం.

ఇప్పటికే ఇంగ్లాండ్‌ క్రికెటర్లలో ముగ్గురు కొవిడ్‌తో బాధపడుతున్నారు. వారితో పాటు మరో నలుగురు సహాయ సిబ్బందికీ వైరస్‌ సోకింది. వీరితో ఆడిన శ్రీలంక క్రికెటర్లు స్వదేశానికి వెళ్లగానే క్వారంటైన్‌ అయ్యారు. బ్యాటింగ్‌ కోచ్‌ గ్రాంట్‌ ఫ్లవర్‌, డేటా అనలిస్టు జీటీ నిరోషన్‌కు పాజిటివ్‌ వచ్చింది. అక్కడే మరో శిబిరంలో ఉన్న వేరే ఆటగాడికి వైరస్‌  సోకింది. ప్రస్తుతం అదే ఇంగ్లాండ్‌లో ఆడుతున్న హాండ్స్‌కాబ్‌కు వైరస్‌ సోకడం ఆందోళనకు గురి చేస్తోంది.

కౌంటీ క్రికెట్లో మిడిలెక్స్‌కు హాండ్స్‌కాంబ్‌ సారథ్యం వహిస్తున్నాడు. పాజిటివ్‌ అని తేలడంతో ఛాంపియన్‌షిప్‌ రెండో గ్రూప్‌ మ్యాచుకు దూరమయ్యాడు. ఫలితం రాగానే ఐసోలేషన్‌కు వెళ్లిపోయాడు. ‘పీటర్‌ హాండ్స్‌కాంబ్‌ స్థానంలో ఐరిష్‌ ఆటగాడు టిమ్‌ ముర్తగ్‌ సారథిగా ఎంపికయ్యాడు. లీసెస్టర్‌షైర్‌తో పోరుకు అతడే నాయకుడిగా ఉంటాడు’ అని జట్టు యాజమాన్యం తెలిపింది.

హాండ్స్‌కాంబ్‌ కొన్నాళ్లుగా ఫామ్‌లో లేడు. మిడిలెక్స్‌ తరఫున అతడు అర్ధశతకం చేసి 13 ఇన్నింగ్స్‌లు ముగిశాయి. ఆస్ట్రేలియా తరఫునా అతడిని ఎంపిక చేయడం లేదు. 2019, జనవరిలో టీమ్‌ఇండియాతో చివరి టెస్టు ఆడాడు. 2019, ఫిబ్రవరిలో కోహ్లీసేనతో చివరి టీ20 ఆడాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని