T20 Worldcup 2022: సెమీస్‌ ఆశలు నిలబెట్టుకున్న ఆసీస్‌..

టీ20 ప్రపంచకప్‌ సూపర్‌ 12లో భాగంగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా.. ఐర్లాండ్‌పై ఘన విజయం సాధించింది. దీంతో 5 పాయింట్లతో సెమీస్‌ అవకాశాలను నిలబెట్టుకుంది.

Published : 31 Oct 2022 19:32 IST

బ్రిస్బేన్‌: టీ20 ప్రపంచకప్‌ మెగా సమరంలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా సెమీఫైనల్‌ ఆశలను నిలబెట్టుకుంది. గ్రూప్‌-ఏలో సూపర్‌ 12 పోరులో భాగంగా సోమవారం ఐర్లాండ్‌పై 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఐర్లాండ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ జట్టు.. ఐర్లాండ్‌ బౌలర్లకు చుక్కలు చూపించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 179 పరుగులు సాధించింది. ఆరోన్‌ ఫించ్‌(63) అద్భుత అర్ధశతకానికి తోడు స్టోయినిస్‌(35) మెరుపులతో ఐర్లాండ్‌కు ఆసీస్‌ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఆ తర్వాత ఛేదనకు దిగిన ఐర్లాండ్‌ను ఆసీస్‌ బౌలర్లు ఆది నుంచే కట్టడిచేశారు. 25 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఆ జట్టును లార్కన్‌ టకర్‌ ఆదుకునే ప్రయత్నం చేశాడు. 71* పరుగులతో ఒంటరి పోరాటం చేసినా ఇతర బ్యాట్స్‌మెన్‌ ఎవరూ అతడికి సహరించకపోవడంతో ఐర్లాండ్‌ జట్టు 18.1 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో 42 పరుగుల తేడాతో ఆసీస్‌ ఘన విజయం సాధించింది.

సూపర్‌ 12లో ఆసీస్‌ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి 5 పాయింట్ల (రెండు గెలుపు, ఒక ఓటమి, ఒక మ్యాచ్‌ రద్దు)తో రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతానికి ఆసీస్‌కు సెమీస్‌ అవకాశాలు ఇంకా ఉన్నాయి. ఇంగ్లాండ్‌ మ్యాచ్‌ ఫలితాలపై ఆసీస్‌ సెమీ ఫైనల్‌ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని