AUS vs PAK: ప్లేయర్‌ క్యాప్‌ను తాకిన బంతి.. పెనాల్టీ పరుగులు ఇవ్వలేదెందుకంటే?

ఆసీస్‌తో జరుగుతున్న ఆఖరి టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్‌ (AUS vs PAK) ఇబ్బందుల్లో పడింది. మూడో మ్యాచ్‌లోనూ ఓటమి దిశగా సాగుతోంది. 

Updated : 05 Jan 2024 14:28 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ (AUS vs PAK) మధ్య జరుగుతున్న చివరి టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. అయితే, ఇవాళ ఆట సందర్భంగా చోటు చేసుకున్న సంఘటన నెట్టింట వైరల్‌గా మారింది. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ సందర్భంగా ఫీల్డింగ్‌ చేస్తున్న పాక్‌ ఆటగాడు జారిపడ్డాడు. అయితే, అతడికేమీ ప్రమాదం జరగలేదు. కానీ, అయూబ్‌ క్యాప్‌లోకి బంతి వెళ్లిపోయింది. దీంతో ఆసీస్‌కు పెనాల్టీ రూపంలో ఐదు పరుగులు ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ, అంపైర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో నెట్టింట చర్చ మొదలైంది. దీనికి క్రికెట్ ఆస్ట్రేలియానే వివరణ ఇవ్వడం గమనార్హం. 

‘‘ఐదు పరుగుల పెనాల్టీ ఇవ్వాల్సిన అవసరం లేదు. బాల్‌, క్యాప్‌ అనుకోకుండా అలా తాకాయి. అంతేకానీ, క్యాప్‌ను మైదానంలో ఉంచినప్పుడు జరగలేదు. హెల్మెట్‌, క్యాప్‌ ఇలా ఏదైనా మైదానంలో ఉంచిన సమయంలో బంతి తాకితే.. పెనాల్టీ రూపంలో ప్రత్యర్థి జట్టుకు ఐదు పరుగులు ఇవ్వాల్సిందే’’ అని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. ఎంసీసీ చట్టం 28.3లోని పలు సెక్షన్ల ప్రకారం పెనాల్టీ విధిస్తారు.

కష్టాల్లో పాకిస్థాన్‌

ఆసీస్‌తో మూడో టెస్టులోనూ పాకిస్థాన్‌కు కష్టాలు తప్పలేదు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాక్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. క్రీజ్‌లో రిజ్వాన్‌ (6*), ఆమిర్‌ జమాల్ ఉన్నారు. ప్రస్తుతం 82 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. హేజిల్‌వుడ్‌ (4/9) ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసి పాక్‌ను దెబ్బకొట్టాడు. నాథన్‌ లైయన్, ట్రావిస్‌ హెడ్, స్టార్క్ తలో వికెట్‌ పడగొట్టారు. అంతకుముందు పాకిస్థాన్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 313 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా 299 పరుగులకు ఆలౌటైంది. వార్నర్‌ ఆడుతున్న చివరి టెస్టులోనూ విజయం సాధించి అద్భుత వీడ్కోలు పలకాలని ఆసీస్‌ భావిస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని