NZ vs BAN: బంగ్లా ఆటగాళ్ల మిస్‌ ఫీల్డింగ్‌.. ఒక్క బంతికే 7 పరుగులు

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆ జట్టు ఆటగాళ్లు మిస్‌ఫీల్డింగ్‌ చేయడంతో న్యూజిలాండ్‌ ఒక్క బంతికే ఏడు పరుగులు సాధించింది. ఈ వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది...

Published : 10 Jan 2022 01:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆ జట్టు ఆటగాళ్లు మిస్‌ఫీల్డింగ్‌ చేయడంతో న్యూజిలాండ్‌ ఒక్క బంతికే ఏడు పరుగులు సాధించింది. ఈ వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. అది చూసిన నెటిజన్లు సరదాగా నవ్వుకుంటున్నారు. క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా హాగ్లే ఓవల్‌ మైదానంలో ఆదివారం ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. ఈ సందర్భంగా టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌ బౌలింగ్‌ ఎంచుకోగా న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌కు దిగింది. టామ్‌ లాథమ్‌, విల్‌యంగ్‌ ఓపెనర్లుగా వచ్చి తొలి సెషన్‌లో 92 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే భోజన విరామం అనంతరం ఎబాడత్‌ హుస్సేన్‌ వేసిన తొలి ఓవర్‌ చివరి బంతికి ఈ సరదా సంఘటన చోటుచేసుకుంది.

విల్‌యంగ్‌(55) ఆడిన ఆ బంతి నేరుగా తొలి స్లిప్‌లోని ఫీల్డర్‌ వైపు వెళ్తుండగా రెండో స్లిప్‌లో ఉన్న మరో ఫీల్డర్‌ క్యాచ్‌ అందుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే అతడు ఎడమచేతి వైపు డైవ్‌చేస్తూ క్యాచ్‌ పడదామనుకున్నాడు. కానీ, ఆ బంతి చేజారి ఫైన్‌ లెగ్‌ దిశగా బౌండరీ వైపు పరుగులు తీసింది. దాంతో అటువైపు ఫీల్డింగ్‌ చేస్తున్న ఆటగాడు చివరి క్షణాల్లో ఆ బంతిని నిలువరించి కీపర్‌కు విసిరాడు. ఆ సమయంలో కివీస్‌ ఓపెనర్లు మూడో పరుగు తీస్తుండగా.. బంగ్లా కీపర్‌ బంతిని నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌లో వికెట్లకేసి కొట్టాడు. దీంతో ఆ బంతి మరోసారి అటువైపు ఉన్న ఫీల్డర్లను దాటుకొంటూ బౌండరీకి చేరింది. దాని వెనకాలే పరుగెత్తుకుంటూ వచ్చిన ఫీల్డర్‌ ఎంత ప్రయత్నించినా చవరికి బంతి బౌండరీని తాకింది. దీంతో న్యూజిలాండ్‌ ఓపెనర్‌ విల్‌యంగ్‌ ఒకే బంతికి ఏడు పరుగులు సాధించాడు. కాగా, ఇప్పటికే తొలి టెస్టు కైవసం చేసుకున్న బంగ్లాదేశ్‌ ఈసారి రెండో టెస్టును కూడా సొంతం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు న్యూజిలాండ్‌ తొలి టెస్టు పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని