బౌలర్లకు అనుకూలంగా కొత్త చట్టం తీసుకురావాలి: సచిన్

యాషెస్‌ టెస్టు సిరీస్‌లో భాగంగా సిడ్నీలో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లాండ్‌ ఆటగాడు బెన్‌ స్టోక్స్‌ అనూహ్య రీతిలో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోవడంపై.. భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్...

Published : 08 Jan 2022 01:27 IST

ఇంటర్నెట్ డెస్క్‌: యాషెస్‌ టెస్టు సిరీస్‌లో భాగంగా సిడ్నీలో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లాండ్‌ ఆటగాడు బెన్‌ స్టోక్స్‌ అనూహ్య రీతిలో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోవడంపై.. భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌ స్పందించాడు. బౌలర్లకు అనుకూలంగా కొత్త చట్టం తీసుకురావాలని ట్వీట్‌ చేశాడు. ‘బంతి వికెట్లను తాకినా బెయిల్స్‌ కింద పడకుంటే.. అది ఔటా.? కాదా.? అనే విషయాన్ని తెలిపేందుకు ‘హిట్టింగ్‌ ది వికెట్స్‌’ అనే కొత్త చట్టాన్ని ప్రవేశ పెట్టాలి. మీరేమంటారు గాయ్స్.?’ అని ఆసీస్ స్పిన్‌ దిగ్గజం షేన్‌వార్న్‌ని ట్యాగ్ చేశాడు. 

సచిన్ ట్వీట్‌పై స్పందించిన షేన్‌ వార్న్‌.. ఈ విషయంపై చర్చ జరగాల్సిన అవసరముందని పేర్కొన్నాడు. ‘ఇది చాలా ఆసక్తికర విషయం. దీనిపై చర్చించాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్. క్రికెట్‌ కమిటీతో చర్చించిన తర్వాత నీకు సమాధానమిస్తాను. ఇలాంటి ఘటన ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదు. కామెరూన్‌ గ్రీన్‌ 142 కి.మీ. వేగంతో బంతిని సంధించాడు. అయినా బెయిల్స్‌ కింద పడకపోవడం ఆశ్చర్యం’ అని షేన్ వార్న్‌ సమాధానిచ్చాడు. ఈ విషయంపై ఆస్ట్రేలియా మరో మాజీ ఆటగాడు రికీ పాంటింగ్‌ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘నేనింత వరకు ఇలాంటి బంతిని చూడలేదు. వాస్తవానికి బంతి వికెట్‌ను తాకి పక్కకు వెళ్లిపోయింది. అందుకే బెయిల్స్‌ కింద పడకుండా అలాగే ఉండిపోయాయి’ అని రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. సచిన్‌ ట్వీట్‌పై క్రికెట్ అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు సచిన్ అభిప్రాయంతో ఏకీభవిస్తే.. మరికొందరు చట్టం అందరినీ సమానంగా చూడాలని పేర్కొంటున్నారు.

బెన్‌ స్టోక్స్‌ ఎలా బతికి పోయాడంటే..

నాలుగో టెస్టు మూడో రోజు ఆటలో భాగంగా.. ఆస్ట్రేలియా బౌలర్‌ కామెరూన్ గ్రీన్ వేసిన 31వ ఓవర్‌ తొలి బంతికి స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న బెన్‌ స్టోక్స్ ఎల్బీడబ్ల్యూ అయినట్లు తొలుత ఫీల్డ్‌ అంపైర్ ప్రకటించాడు. దీంతో స్టోక్స్ వెంటనే రివ్యూ కోరాడు. సమీక్షలో బంతి ప్యాడ్లకు దూరంగా వెళ్లినట్లు తేలింది. ఇక్కడే మరో అద్భుతం జరిగింది. ఆ బంతి ఆఫ్‌ స్టంప్‌ని తాకినా.. బెయిల్స్‌ కిందపడలేదు. దీంతో బెన్‌ స్టోక్స్‌ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ అనూహ్య పరిణామాన్ని నమ్మలేనట్లుగా స్టోక్స్‌ నవ్వుతూ ఉండిపోయాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాత్రం అంపైర్ నిర్ణయంతో ఆశ్చర్యానికి గురయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని