IND vs ENG: బుమ్రా బౌలింగ్‌పై మేం వర్కౌట్‌ చేయాల్సిందే: బ్రెండన్ మెక్‌కల్లమ్‌

ఇంగ్లాండ్ బ్యాటర్లకు కొరకరాని కొయ్యగా భారత బౌలర్‌ బుమ్రా తయారయ్యాడు. స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌లపైనా తన పేస్‌తో వికెట్లు రాబట్టడం విశేషం.

Updated : 08 Feb 2024 11:55 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో (IND vs ENG) తొమ్మిది వికెట్లు తీసి భారత విజయంలో జస్‌ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించాడు. విశాఖపట్నం పిచ్‌ పేసర్లకు పెద్దగా సహకరించకపోయినా తన నైపుణ్యంతో రాణించాడు. మిగిలిన మూడు టెస్టుల్లోనూ బుమ్రాను (Bumrah) ఎదుర్కోవడానికి తమ బ్యాటర్లు మరింత సిద్ధం కావాల్సి ఉంటుందని ఇంగ్లాండ్‌ కోచ్‌ బ్రెండన్ మెక్‌కల్లమ్‌ వ్యాఖ్యానించాడు. 

‘‘ఒక బౌలర్‌ను ఎదుర్కోవాలంటే అతడిపై క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. అతడు ఎలా బంతులు వేస్తున్నాడనేది పుస్తకాల్లో, వీడియోల్లో చూస్తేనే సరిపోదు. అందుకే, మేం థియరీని విశ్వసించం. బుమ్రా బౌలింగ్‌ను ఎలా ఆడాలనేది కేవలం మాట్లాడుకుంటేనే సరిపోదు. దానిపై కఠిన సాధన చేయాలి. మా ఆటగాళ్లకు ఈ విషయంపై స్పష్టత ఉంది. వారు నాకంటే చాలా మెరుగ్గానే ఉన్నారు. అతడి బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి వివిధ మార్గాలున్నాయి. రానున్న టెస్టుల్లో బుమ్రా బౌలింగ్‌ వ్యూహాలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. రెండో టెస్టులో అతడి ప్రదర్శన బాగుంది. పరిస్థితులకు అనుగుణంగా భారత బౌలర్లు నైపుణ్యం ప్రదర్శించారు. బంతి స్వింగ్‌ అయితే మాత్రం అతడు చాలా ప్రమాదకారి. మేం గత ఏడాదిన్నర నుంచి అత్యుత్తమ బౌలింగ్‌ దళాలను ఎదుర్కొంటున్నాం. వారికి సరైన కౌంటర్‌ ఇవ్వడానికి ఎల్లవేళలా ప్రయత్నిస్తుంటాం. మూడో టెస్టుకు లభించిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మా ఆటగాళ్లు అబుదాబికి వెళ్లారు. భారత ఆటగాళ్లు కొందరు ఇంటికి వెళ్లారని ద్రవిడ్‌ చెప్పాడు. మాకు స్వదేశం చాలా దూరం కాబట్టి.. అబుదాబి వెళ్లి సాధన చేయాలని ముందే అనుకున్నాం. కుటుంబ సభ్యులతో అక్కడ గడుపుతాం. రాజ్‌కోట్‌ టెస్టుకు నేరుగా వచ్చేస్తాం’’ అని మెక్‌కల్లమ్‌ వ్యాఖ్యానించాడు.

నంబర్‌ వన్‌ ర్యాంకు రావడంపై బుమ్రా పోస్టు వైరల్‌..

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బుమ్రా నంబర్‌వన్‌ బౌలర్‌గా మారాడు. ఈ స్థానం దక్కించుకున్న తొలి భారత పేసర్‌గా రికార్డు సృష్టించాడు. తాజాగా అతడి సోషల్‌ మీడియా పోస్టు వైరల్‌గా మారింది. ‘‘మద్దతు వర్సెస్‌ శుభాకాంక్షలు’ అని రెండు ఫొటోలను కలిపి పోస్టు చేశాడు. మద్దతు ఇచ్చేవాళ్లు తక్కువనే అర్థంలో స్టేడియంలో ఒక్కరే కూర్చున్న ఫొటోను ఉంచాడు. ఇక ఏదైనా సాధించిన తర్వాత కంగ్రాట్స్‌ చెప్పేవాళ్లు మాత్రం చాలా మంది ఉంటారనే కోణంలో స్టేడియం కిక్కిరిసిన చిత్రాన్ని షేర్‌ చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని