Ind vs SA: సఫారీలపై విజయం.. గెలుపోటములపై కెప్టెన్ల స్పందన ఇదీ!

మరో మ్యాచ్‌కు ముందే టీమ్‌ఇండియా సిరీస్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్‌ ఓడినా సఫారీల పోరాటం ఆట్టుకుంది. ఈ నేపథ్యంలో గెలుపోటములపై ఇరు టీమ్‌ల కెప్టెన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

Published : 04 Oct 2022 01:09 IST

గువాహటి: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమ్‌ఇండియా దంచికొట్టింది. 16 పరుగుల తేడాతో గెలుపొంది మరో మ్యాచ్‌కు ముందే సిరీస్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్‌ ఓడినా సఫారీల పోరాటం ఆట్టుకుంది. ఈ నేపథ్యంలో గెలుపోటములపై ఇరు టీమ్‌ల కెప్టెన్లు, ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు గెలిచిన కేఎల్‌ రాహుల్‌ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 


‘‘ఈ మ్యాచ్‌ గెలవడం సంతోషంగా అనిపించింది. బ్యాటింగ్‌ పరంగా కొంత మిశ్రమ ఫలితాలనే అందుకున్నా, భవిష్యత్తులో మరింత మెరుగవుతాం. గతంలో ఆటగాడు మైదానంలోకి రావడం, తన పని పూర్తి చేసి వెళ్లడం అన్నట్లుగా ఉండేది. ఈ మ్యాచ్‌తో మేం ఆ పద్ధతిని మార్చాం. డెత్‌ ఓవర్లలో సమస్యలు ఉన్న మాట వాస్తవం. అది మాకు సవాలుగా మారింది. పైగా మాపై  అంచనాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అయినా మమ్మల్ని మేము మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. సూర్య ఫామ్‌ ఇలాగే కొనసాగాలి అంటే 23వ తేదీ వరకు అతన్ని ఆడనివ్వకపోవడమే మంచిది (నవ్వుతూ)’’

- రోహిత్‌ శర్మ, టీమ్‌ఇండియా కెప్టెన్‌


‘‘బౌలింగ్‌ పరంగా మేం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయాం. పరిస్థితులకు తగినట్టుగా ఆడటంలో విఫలమయ్యాం. మా ప్రణాళికలను సమర్థంగా అమలుచేయలేకపోయాం. 220 లక్ష్యాన్ని నిర్దేశిస్తే ఆట సులువయ్యేది. కానీ 240 ఛేదించడం కష్టతరమైంది. మిల్లర్‌ బ్యాటింగ్‌ తీరు జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. మేము బంతిని ముందుగానే స్వింగ్‌ చేయడానికి ప్రయత్నించాము. కానీ స్వింగ్‌ నెమ్మదిస్తే వికెట్‌ బ్యాటింగ్‌ ఎంత సులువో తెలిసొచ్చింది’’

-టెంబా బవుమా, దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్‌


‘‘ఆరోజు మ్యాచ్‌కు ఏది కీలకమో ఓపెనర్‌ బ్యాటర్‌ తెలుసుకోవాల్సి ఉంటుంది. భిన్నమైన పరిస్థితుల్లో ఎలా ఆడగలమో పరీక్షించుకోవాలి. ఆ విషయంలో నేను సంతృప్తి చెందాను. మొదటి రెండు మూడు ఓవర్ల తర్వాత 180-190ల మధ్య లక్ష్యాన్ని నిర్దేశిస్తే బాగుంటుందని నేను, రోహిత్‌ చర్చించుకున్నాం. ఓపెనర్‌ బ్యాటర్‌గా మా పని చాలా కష్టంగా ఉంటుందని అంతా అనుకుంటారు. కానీ మిడిల్‌ ఓవర్లలో సూర్యలా బ్యాటింగ్‌ చేయడమే చాలా కష్టం. అతడు చాలా అద్భుతంగా ఆడాడు. తనకు బదులుగా నాకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కడం ఆశ్చర్యంగా అనిపించింది. విరాట్‌, దినేశ్‌లు సైతం మెరుపులు మెరిపించారు. భారత్‌లో స్టేడియం ఎప్పుడూ నిండుగా ఉంటుంది. ఇంత మంది ప్రేక్షకుల సందడి మధ్య ఆడటం చాలా బాగుంది’’ 
                                                                                                                                                   

-రాహుల్‌, మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ విజేత


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని