Ishan Kishan: 300 కొట్టేవాణ్నే..: ఇషాన్‌ కిషన్‌

ఔట్‌ కాకపోయి ఉంటే తాను కచ్చితంగా త్రిశతకం సాధించేవాడినని టీమిండియా (Team India) యువ ఓపెనర్‌ ఇషాన్‌ కిషాన్‌ (Ishan Kishan) అన్నాడు. బంగ్లాదేశ్‌లో జరిగిన మూడో వన్డేలో ఈ యువ ఓపెనర్‌ అద్భుత ద్విశతకం సాధించాడు.

Updated : 11 Jul 2023 17:15 IST

ఇంటర్నెట్ డెస్క్‌: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో వన్డే (IND vs BAN)లో టీమిండియా (Team India) యువ ఓపెనర్ ఇషాన్ కిషన్‌ (Ishan Kishan) చెలరేగిపోయాడు. వన్డే క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత వేగంగా డబుల్‌ సెంచరీ (double century) బాదేశాడు. అయితే ఔట్‌ కాకపోయి ఉంటే తాను కచ్చితంగా త్రిశతకం నమోదు చేసేవాడినని ఇషాన్‌ చెప్పాడు. ఈ ఫార్మాట్‌లో తొలి త్రిశతకం చేసే అవకాశాన్ని కోల్పోయినందుకు కాస్త అసంతృప్తిగా ఉందన్నాడు.

తన కెరీర్‌లో 10వ వన్డే మ్యాచ్‌ ఆడిన 24 ఏళ్ల ఇషాన్‌ కిషన్‌.. శనివారం నాటి మ్యాచ్‌లో అద్భుతంగా రాణించాడు. కేవలం 126 బంతుల్లోనే ద్విశతకం సాధించి.. ఇప్పటి వరకు క్రిస్‌ గేల్‌ (138 బంతుల్లో) పేరిట ఉన్న రికార్డును తుడిచిపెట్టేశాడు. ఈ మ్యాచ్‌లో 210 (134 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్స్‌లు) పరుగులు చేసిన ఇషాన్‌.. ఇన్నింగ్స్‌ 36వ ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔట్‌ అయ్యాడు. ఇన్నింగ్స్‌ బ్రేక్‌ మధ్యలో మీడియా ఛానల్‌తో మాట్లాడిన అతడు.. ‘‘ఇంకా 15 ఓవర్లు మిగిలి ఉండగానే నేను ఔటయ్యాను. లేదంటే కచ్చితంగా 300 చేసి ఉండేవాణ్ని’’ అని తెలిపాడు.

ఇలా భారత్ తరఫున ద్విశతకం బాదిన నాలుగో బ్యాటర్‌ ఇషాన్ కిషన్ కావడం విశేషం. ఇప్పటివరకు రోహిత్‌ శర్మ (264, 209, 208*)  మూడు సార్లు డబుల్‌ సెంచరీ సాధించగా.. వీరేంద్ర సెహ్వాగ్‌ (219), సచిన్‌ తెందూల్కర్‌ (200*) ఈ జాబితాలో ముందున్నారు. దీని గురించి ఇషాన్‌ మాట్లాడుతూ.. ‘‘అంతటి లెజెండ్స్‌ మధ్య నా పేరు ఉండటం గర్వంగా ఉంది. బ్యాటింగ్‌ చేసేందుకు పిచ్‌ బాగా సహకరించింది. నా ఆలోచన ఒక్కటే.. బంతి కనిపిస్తే షాట్‌ కొట్టాల్సిందే’’ అని చెప్పాడు.

కోహ్లీ అదే చెప్పాడు..

ఇక కోహ్లీతో భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ.. ‘‘విరాట్ భాయ్‌ అండతోనే నేను ఈ రికార్డు సాధించగలిగాను. ఏయే బౌలర్లను టార్గెట్‌ చేయాలో అతడే సూచించాడు. నేను 95 పరుగుల వద్ద ఉన్నప్పుడు సిక్స్‌ కొట్టి సెంచరీ చేయాలని అనుకున్నా. కానీ కోహ్లీ నన్ను శాంతపర్చాడు. ఇది నీ తొలి సెంచరీ.. సింగిల్స్‌తో సాధించు. అదే నాకు కలిసొచ్చింది’’ అని ఇషాన్‌ వివరించాడు. ఈ మ్యాచ్‌లో తాను పెద్దగా ఒత్తిడికి గురవ్వలేదని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నానని యువ ఓపెనర్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని