ZIM vs IND: భారత్‌ 26 ఓవర్లలోనే ఛేదించింది.. అదే మా టీమ్‌ 50 ఓవర్లు ఆడేది!

జింబాబ్వేపై మూడు వన్డేల సిరీస్‌ను భారత్ మరొక మ్యాచ్‌  మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో అలవోకగా పది వికెట్ల తేడాతో...

Published : 22 Aug 2022 02:15 IST

పాకిస్థాన్‌ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా వ్యాఖ్యలు

ఇంటర్నెట్ డెస్క్‌: జింబాబ్వేపై మూడు వన్డేల సిరీస్‌ను భారత్ మరొక మ్యాచ్‌  మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో అలవోకగా పది వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమ్ఇండియా.. రెండో వన్డేలో మాత్రం కాస్త ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే 26 ఓవర్లలోపే 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఈ క్రమంలో జింబాబ్వేపై స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ ఐదు వికెట్లను కోల్పోవడంపై పాక్‌ అభిమానులు తమ సోషల్‌ మీడియాలో అక్కసు వెళ్లగక్కారు. అయితే ఆ జట్టుకే చెందిన మాజీ ఆటగాడు డానిష్ కనేరియా మాత్రం టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ ప్రణాళికను అభినందించాడు. అదే క్రమంలో పాకిస్థాన్‌ అయితే మరింత శ్రమించాల్సి వచ్చేదని అభిప్రాయపడ్డాడు.

‘‘చాలా మంది పాకిస్థాన్ అభిమానులు భారత్ ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించడంపై కామెంట్లు చేస్తున్నారు. ఇక్కడ వికెట్లు  నష్టపోయినప్పటికీ.. టీమ్‌ఇండియా దూకుడుగా బ్యాటింగ్‌ చేసిందనే విషయాన్ని మరిచిపోకూడదు. ఎందుకంటే కేవలం 26 ఓవర్లలోపే 162 పరుగులను ఛేదించింది. ఇదే పరిస్థితి పాకిస్థాన్‌కు వస్తే మాత్రం.. 50 ఓవర్లను తీసుకునేది. ఇక ఆసియా కప్‌కు షహీన్ షా అఫ్రిది దూరం కావడానికి పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డే బాధ్యత వహించాలి. అన్ని ఫార్మాట్లలో అతడిని ఆడించవద్దని గతంలోనే చెప్పా. శ్రీలంకతో సిరీస్‌కు ఎంపిక చేయకుండా ఉండాల్సింది. ఏదోఒక రోజు ఇలాంటి పరిస్థితి వస్తుందని గ్రహించా. కానీ, మెగా టోర్నీ ముందు ఇలా జరగడం బాధాకరం’’ అని డానిష్ కనేరియా తెలిపాడు. ఆసియా కప్‌లో ఆగస్ట్‌ 28న భారత్, పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని