IPL: ఆటగాళ్లు ఇంటికెళ్లడం చిన్న విషయం 

భారత్‌లో కరోనా కేసులు పెరుతున్న నేపథ్యంలో ఐపీఎల్‌లో ఆడుతున్న విదేశీ క్రికెటర్లు తిరిగి ఇంటికి వెళ్లడమనేది చాలా చిన్న విషయమని దిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌కోచ్‌ రికీపాంటింగ్ పేర్కొన్నాడు...

Updated : 29 Apr 2021 11:20 IST

ఆస్ట్రేలియా క్రికెటర్ల ఆందోళనపై రికీ పాంటింగ్‌..

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో కరోనా కేసులు పెరుతున్న నేపథ్యంలో ఐపీఎల్‌లో ఆడుతున్న విదేశీ క్రికెటర్లు తిరిగి ఇంటికి వెళ్లడమనేది చాలా చిన్న విషయమని దిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌కోచ్‌ రికీపాంటింగ్ పేర్కొన్నాడు. బయోబబుల్‌ బయట పరిస్థితులతో పోలిస్తే తాము క్షేమంగా ఉన్నామన్నాడు. బెంగళూరుతో మ్యాచ్‌ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న సందర్భంగా అతడీ వ్యాఖ్యలు చేశాడు. ‘భారత్‌లో ఐపీఎల్‌ ఆడుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్లకు సంబంధించి, వారు తిరిగి స్వదేశానికి చేరుకునే విషయంపై ప్రభుత్వం నుంచి పలు వ్యాఖ్యలు వినిపించాయి. అందులో కొన్ని ఇబ్బందులున్నా అది చాలా చిన్న విషయం. రోజూ బయట ఏం జరుగుతుందనే విషయంపై మాకు స్పష్టమైన అవగాహన ఉంది. అలాగే మేం ఎలాంటి సురక్షితమైన పరిస్థితుల్లో ఆడుతున్నామనే విషయంలోనూ అదృష్టంగా భావిస్తున్నాం’ అని పాంటింగ్‌ చెప్పుకొచ్చాడు.

అలాగే ఐపీఎల్‌ను వీక్షిస్తూ భారత్‌లో ఎంతో మంది క్రికెట్‌ అభిమానులు సంతోషంగా ఉన్నారని పాంటింగ్‌ ఆశాభావం వ్యక్తంచేశాడు. అయితే, తమ జట్టు మాత్రం అయోమయ పరిస్థితుల్లో ఉందన్నాడు. బయట ఏం జరుగుతుందనే విషయంపై పూర్తి అవగాహనతో ఉన్నామని, ఈ దేశంలో కొవిడ్‌ బారిన పడిన ప్రతి ఒక్కరి గురించి తాము చింతిస్తున్నామని దిల్లీ కోచ్‌ విచారం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే ప్రస్తుత పరిస్థితుల్లో తమ కీలక స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కుటుంబంతో ఉండడానికి టోర్నీ నుంచి తప్పుకున్నాడని చెప్పాడు. ఇదిలా ఉండగా, ఇటీవల ఐపీఎల్‌ నుంచి ఇద్దరు ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆర్సీబీని వీడి స్వదేశం చేరుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ముంబయి ఇండియన్స్‌ బ్యాట్స్‌మన్‌ క్రిస్‌లిన్‌ ఆసీస్‌ ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా ఛార్టెడ్‌ ఫ్లైట్‌ ఏర్పాటు చేయాలని క్రికెట్‌ ఆస్ట్రేలియా బోర్డుకు విజ్ఞప్తి చేశాడు. కాగా, ఐపీఎల్‌ పూర్తయ్యాక విదేశీ ఆటగాళ్లు క్షేమంగా తమ స్వదేశాలకు చేరుకునేలా అన్ని ఏర్పాట్లూ చేస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే పాంటింగ్‌ ఆ విషయంపై స్పందించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని