IPL 2021: హైదరాబాద్‌ మోస్తరు స్కోరు.. ఆడుతూ పాడుతూ దిల్లీ ఛేదన

హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం సాధించింది. 

Updated : 23 Sep 2021 00:30 IST

దుబాయ్‌: ఇద్దరు అగ్రశ్రేణి బ్యాటర్లు విఫలమైతే ఫలితం ఎలా ఉంటుందో దిల్లీ, హైదరాబాద్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచే ఉదాహరణగా నిలుస్తుంది. డేవిడ్‌ వార్నర్‌ (0), విలియమ్సన్ (18) ఘోర ప్రదర్శనతో ఐపీఎల్‌ 14వ సీజన్‌ రెండో ఎడిషన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఓటమితో ప్రారంభించింది.ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి దిల్లీ క్యాపిటల్స్‌ అలవోకగా ఛేదించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. అనంతరం దిల్లీ కేవలం రెండు వికెట్లను కోల్పోయి 17.5 ఓవర్లలో 139 పరుగులు చేసి విజయం సాధించింది. శిఖర్ ధావన్‌ (42), శ్రేయస్‌ అయ్యర్ (47*), కెప్టెన్ రిషభ్‌ పంత్ (35*) రాణించారు. దీంతో దిల్లీ ఆడుతూ పాడుతూ ఛేదించింది. స్వల్ప స్కోరును కాపాడేందుకు హైదరాబాద్‌ బౌలర్లు కష్టపడినా ఫలితం దక్కలేదు. ఖలీల్‌ అహ్మద్‌, రషీద్‌ ఖాన్‌ చెరో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో దిల్లీ క్యాపిటల్స్‌ (14) అగ్రస్థానానికి చేరుకుంది. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ను ఆన్రిచ్ నోర్జే (2/12) అందుకున్నాడు.

ఖాతా తెరవని వార్నర్.. విఫలమైన విలియమ్సన్

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ అంటేనే వార్నర్, విలియమ్సన్. వీరిద్దరిలో ఒక్కరు నిలదొక్కుకున్నా మిగతా బ్యాటర్లు ఆత్మవిశ్వాసంతో ఆడతారు. ఇవాళ వారు విఫలం కావడంతో హైదరాబాద్‌ తక్కువ స్కోరుకే పరిమితం కావాల్సి వచ్చింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌కు తొలి ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఖాతా తెరవకుండానే వార్నర్‌ ఔటయ్యాడు. కెప్టెన్ విలియమ్సన్ (18), ఓపెనర్ సాహా (18), మనీశ్‌ పాండే (17), కేదార్‌ (3), హోల్డర్‌ (10) విఫలమయ్యారు. ఆఖర్లో అబ్దుల్‌ సమద్‌ (28), రషీద్‌ ఖాన్‌ (22) బ్యాట్‌ ఝళిపించడంతో హైదరాబాద్‌ (134/9) కాస్త గౌరవప్రదమైన స్కోరును సాధించగలిగింది. దిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లలో రబాడ 3, అక్షర్‌ 2, నోర్జే 2 వికెట్లు పడగొట్టారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని