Womens Team India: యో యో టెస్టు పెడితే.. 15లో 12 మంది కష్టమే: ఎడుల్జీ

మహిళల టీ20 ప్రపంచకప్‌లో (Womens T20 World Cup 2023) భారత్‌కు సెమీస్‌లోనే చుక్కెదురైంది. ఆసీస్‌ చేతిలో కేవలం ఐదు పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. 

Published : 25 Feb 2023 01:43 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మహిళల టీ20 ప్రపంచ కప్‌ సెమీస్‌లో (Womens t20 World cup 2023) భారత్‌ ఓటమికి బ్యాటింగ్‌ వైఫల్యం, హర్మన్‌ రనౌట్‌ కారణమని బాధపడుతున్నారు. అయితే అవేమీ కాదని, అసలైన కారణం మరొకటి ఉందని 33 నెలలపాటు బీసీసీఐ పాలకమండలిలో కీలక పాత్ర పోషించిన మాజీ క్రికెటర్‌ డయానా ఎడుల్జీ (Diana Edulji) కీలక వ్యాఖ్యలు చేసింది. ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో (IND w Vs AUS w) ఫీల్డింగ్ వైఫల్యం కొట్టొచ్చినట్లు పేర్కొంది. సీనియర్‌ మహిళల జట్టుతో పోలిస్తే అండర్ - 19 టీమ్‌ ఫీల్డింగ్‌ అద్భుతంగా ఉందని కొనియాడింది. సీనియర్లలో చాలా మంది ఫీల్డింగ్‌లో తెగ ఇబ్బంది పడిపోయారని తెలిపారు. ఈ క్రమంలో పలు కీలక సూచనలు చేసింది. 

‘‘వికెట్ల మధ్య సరిగ్గా పరిగెత్తలేకపోవడం, అధ్వాన్నమైన ఫీల్డింగ్‌కు కారణం సరైన ఫిట్‌నెస్‌లేకపోవడమే. సీనియర్‌ క్రికెటర్ల కంటే అండర్‌ -19 జట్టులోని ప్లేయర్లు ఫిట్‌నెస్‌తో ఉండటం గమనించా. వారు ఫైనల్‌లోనూ బెదరలేదు. కానీ, 2017 నుంచి 2023 వరకు సీనియర్ల జట్టు మాత్రం కీలకమైన నాకౌట్‌లో ఓటములను చవిచూస్తోంది. అందుకే, బీసీసీఐ తప్పకుండా ప్లేయర్ల ఫిట్‌నెస్‌ను అంచనా వేయాలి. యో యో టెస్టు మహిళలకు కాస్త కష్టమని నాకు తెలుసు. ఇప్పుడున్న 15 మందిలో 12 మంది విఫలం కావడం తథ్యం. అందుకే ఫిట్‌నెస్‌ ప్రమాణాలను అంచనా వేయడానికి మరొక విధానం తీసుకోవాలి. ఇప్పటి వరకు ఫిట్‌నెస్‌పై జవాబుదారీతనం లేకుండాపోయింది’’

‘‘ప్రపంచకప్‌ ఓటమి తర్వాత బీసీసీఐ పరిస్థితిని అంచనా వేసి.. తదుపరి సిరీస్‌ కోసం పక్కాగా ప్రణాళికలు, సన్నద్ధతపై దృష్టిపెట్టాలి. అందులో మొదటిగా ఫిట్‌నెస్‌పై దృష్టిసారించండి. ఫీల్డింగ్‌, క్యాచ్‌లను పట్టడం, వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తడం తదితర అంశాల్లో మెరుగయ్యేలా చూడాలి. బీసీసీఐ తప్పకుండా కొరడా ఝుళిపించాలి. భారత క్రికెట్‌ ఉన్నత స్థాయికి చేరాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ప్రతిసారి గెలవాల్సిన మ్యాచ్‌లను ఓడిపోవడం అలవాటుగా మారింది. భవిష్యత్తులో జట్టు సరైన మార్గంలో నడవాలంటే ఉత్తమ స్ట్రాటజీతో ముందుకు సాగాలి’’ అని ఎడుల్జీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని