World Cup 2023: అఫ్గానిస్థాన్‌పై ఓటమి.. ప్రపంచకప్‌ చరిత్రలో ఇంగ్లాండ్‌ చెత్త రికార్డు

ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ (England)కు పసికూన అఫ్గానిస్థాన్‌ (Afghanistan) గట్టి షాక్ ఇచ్చింది. ఈ ఓటమితో ఇంగ్లాండ్ ప్రపంచకప్‌ చరిత్రలో చెత్త రికార్డును మూటగట్టుకుంది. 

Updated : 16 Oct 2023 10:40 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ (England)పై పసికూన అఫ్గానిస్థాన్‌ (Afghanistan) సంచలన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో చెలరేగి ఇంగ్లాండ్‌ను 69 పరుగుల తేడాతో ఓడించింది. వన్డేల్లో ఇంగ్లాండ్‌పై అఫ్గాన్‌కిదే తొలి విజయం. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్‌ 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌.. అఫ్గాన్‌ స్పిన్నర్ల ధాటికి 40.3 ఓవర్లలో 215 పరుగులకు కుప్పకూలింది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ ప్రపంచకప్‌లో ఓ చెత్త రికార్డును నమోదు చేసింది.  వన్డే ప్రపంచకప్‌లో.. టెస్టులు ఆడే 11 దేశాలతో ఓటమిపాలైన తొలి జట్టుగా ఇంగ్లిష్‌ జట్టు అనవసరపు రికార్డును మూటగట్టుకుంది.

ప్రపంచకప్‌లో ఆసీస్‌ చేతిలో మొదటి ఓటమిని చవిచూసింది ఇంగ్లాండ్. 1975లో జరిగిన మొదటి ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా.. ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. 1979లో జరిగిన రెండో వరల్డ్ కప్‌లో ఫైనల్‌లో వెస్టిండీస్‌ చేతిలో ఓటమిపాలైంది. తర్వాత 1983లో భారత్‌, న్యూజిలాండ్‌.. ఇంగ్లాండ్‌ను మట్టికరిపించాయి. 1987లో పాకిస్థాన్‌ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్న ఇంగ్లిష్‌ జట్టు.. 1992లో ఎవరూ ఊహించని విధంగా చిన్న జట్టు అయిన జింబాబ్వే చేతిలో కంగుతింది. 1996 ఎడిషన్‌లో శ్రీలంక, సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్‌ను ఓడించాయి. చిన్న జట్లు అయిన బంగ్లాదేశ్‌, ఐర్లాండ్‌లు 2011లో ఇంగ్లాండ్‌పై సంచలన విజయం సాధించాయి. తాజాగా జరుగుతున్న 2023 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఇంగ్లిష్ జట్టుకు పసికూన అఫ్గాన్‌ గట్టి షాక్‌ ఇచ్చింది. 

తాజా ఓటమి ప్రభావం ఇంగ్లాండ్ సెమీస్ అవకాశాలపై పడే అవకాశం ఉంది. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లాండ్.. ఒకే మ్యాచ్‌లో (బంగ్లాదేశ్‌పై) విజయం సాధించింది. టోర్నీ ఆరంభపోరులో కివీస్‌ చేతిలో, తాజాగా అఫ్గాన్‌ చేతిలో ఓటమిపాలైంది. ఆ జట్టు మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో కనీసం ఐదు మ్యాచ్‌ల్లో నెగ్గితేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని