Womens T20 League: మహిళల టీ20 లీగ్‌.. రాష్ట్రాల సంఘాలకు గంగూలీ కీలక సమాచారం!

భారత్‌ టీ20 లీగ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆదరణ ఉందో తెలుసు కదా... అలాగే మహిళలకూ ప్రత్యేకంగా టీ20 లీగ్‌ను నిర్వహించాలని మాజీలు సహా ప్రస్తుత క్రికెటర్ల నుంచి...

Published : 22 Sep 2022 15:31 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్‌ టీ20 లీగ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆదరణ ఉందో తెలుసు కదా.. అలాగే మహిళలకూ ప్రత్యేకంగా టీ20 లీగ్‌ను నిర్వహించాలని మాజీలు సహా ప్రస్తుత క్రికెటర్ల నుంచి విజ్ఞప్తులు భారీగా వచ్చాయి. టీ20 ఛాలెంజ్‌ పేరిట కొన్ని మ్యాచ్‌లను నిర్వహిస్తున్నప్పటికీ.. తమకూ ఇటువంటి లీగ్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో భారత క్రికెట్‌ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ రాష్ట్రాల క్రికెట్‌ సంఘాలకు గురువారం కీలక సమాచారం తెలియజేశాడు. వచ్చే ఏడాది నుంచి మహిళల భారత టీ20 లీగ్‌ నిర్వహించే అవకాశం ఉందని గంగూలీ పేర్కొన్నాడు.

పురుషుల భారత టీ20 లీగ్‌కు సంబంధించి కూడా గంగూలీ కీలక ప్రకటన చేశాడు. కరోనాకు ముందు నిర్వహించినట్లు ‘సొంత మైదానం-బయట మైదానం’ తరహాలో వచ్చే సీజన్‌ను నిర్వహిస్తామని గంగూలీ పేర్కొన్నాడు. గత సీజన్‌ను కేవలం నాలుగు మైదానాలకే పరిమితం చేసిన విషయం తెలిసిందే. ‘‘ప్రస్తుతం బీసీసీఐ మహిళల టీ20 లీగ్‌పైనా కసరత్తు చేస్తోంది. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఈ టోర్నీ వచ్చే ఏడాది నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నాం. అలాగే పురుషుల టీ20 లీగ్‌ కూడా గతంలో జట్టుకు సొంత మైదానాల్లో ఆడే అవకాశం ఉండేది. అయితే, కరోనా కారణంగా గత సీజన్‌లో కుదరలేదు. అందుకే వచ్చే సీజన్‌కు ఆ విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం’’ అని గంగూలీ రాష్ట్రాలకు తెలిపినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని