సెల్ఫీ అడిగిన వ్యక్తినే పెళ్లాడనున్న స్టార్‌ ప్లేయర్..!

స్పెయిన్‌ టెన్నిస్ స్టార్ గాబ్రైన్‌ ముగురుజ( Garbine Muguruza) తన అభిమానితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. దానికి సంబంధించిన చిత్రాన్ని ఆమె ఇన్‌స్టాలో షేర్ చేశారు. 

Updated : 31 May 2023 18:37 IST

మాడ్రిడ్: స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌(Tennis  Star), మాజీ నంబర్‌వన్‌ గాబ్రైన్‌ ముగురుజ( Garbine Muguruza) వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. తన అభిమాని ఆర్ధర్‌ బోర్జెస్‌(Arthur Borges)తో ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నారు. దానికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

సెల్ఫీతో పరిచయమై.. 

అనూహ్యంగా పరిచయమైన ఆర్ధర్‌ను పెళ్లి చేసుకోబోతున్న ముగురుజా.. తన రెండేళ్ల ప్రేమ గురించి మీడియాతో మాట్లాడారు.  ‘అప్పుడు నేను యూఎస్‌ ఓపెన్ కోసం అమెరికాలో ఉన్నాను. పోటీకి ముందు నేను ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. నా హోటల్‌ సెంట్రల్ పార్క్‌కు దగ్గర్లో ఉంది. కొద్దిసేపు అలా నడిచొద్దామని బయటకువచ్చాను. అలా వెళ్తునప్పుడే ఆర్ధర్‌ కలిశాడు. నా వద్దకు వచ్చి సెల్ఫీ అడిగి, యూఎస్‌ ఓపెన్‌లో బాగా ఆడండని చెప్పాడు. ఆ తర్వాత కొద్దిసేపు అతడు నా మనసులో అలా ఉండిపోయాడు. భలే అందంగా ఉన్నాడే అని అనుకున్నా. 

ఆ తర్వాత మేం చాలాసార్లు కలుసుకునేవాళ్లం. సెంట్రల్ పార్క్‌లో కలిసి నడిచేవాళ్లం. అతడికి టెన్నిస్‌తో ఏ సంబంధం లేదని,  ఫ్యాషన్ రంగంలో పనిచేస్తున్నాడని తెలిసి అతడి పట్ల ఇష్టం మరింత పెరిగింది. తన ప్రేమను వ్యక్తం చేసిన సమయంలో నేను ఏదో ఆలోచిస్తున్నాను. తన ప్రపోజల్ వినగానే నాకు ఏడుపొచ్చేసింది. ఎలా స్పందించాలో అర్థం కాలేదు. ఒకవైపు ఏడుస్తూనే ఎస్‌ అని చెప్పేశా. ఆ క్షణం ఎంతో అందంగా అనిపించింది’అని 2021లో ఆర్ధర్‌తో ఏర్పడిన పరిచయం, ఆ తర్వాత మొదలైన ప్రేమ బంధం గురించి వెల్లడించారు.

29 ఏళ్ల ముగురుజా రెండు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను సొంతం చేసుకున్నారు. 2016లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ను సొంతం చేసుకోగా, ఆ మరుసటి ఏడాదే వింబుల్డన్‌ చాంపియన్‌షిప్‌ను దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆమె టెన్నిస్‌ నుంచి బ్రేక్ తీసుకున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని