అజరెంకా.. పదేళ్ల తర్వాత

2013లో చివరిగా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచింది విక్టోరియా అజరెంకా. మళ్లీ ఆ తర్వాత ఎన్నడూ క్వార్టర్‌ఫైనల్‌ కూడా దాటలేదు ఈ బెలారస్‌ స్టార్‌.

Published : 25 Jan 2023 01:45 IST

సెమీఫైనల్లోకి ప్రవేశం
రిబకినా, సిట్సిపాస్‌ ముందంజ
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌

2013లో చివరిగా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచింది విక్టోరియా అజరెంకా. మళ్లీ ఆ తర్వాత ఎన్నడూ క్వార్టర్‌ఫైనల్‌ కూడా దాటలేదు ఈ బెలారస్‌ స్టార్‌. కానీ 33 ఏళ్ల వయసులో మునుపటి జోరును ప్రదర్శిస్తూ, పదేళ్ల విరామం తర్వాత రాడ్‌లేవర్‌ ఎరీనాలో సెమీస్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్స్‌లో మూడో సీడ్‌ జెస్సికాకు అజరెంకా షాకిచ్చింది. రిబకినా, కచనోవ్‌ కూడా తుది నాలుగులో చోటు దక్కించుకున్నారు.

విక్టోరియా అజరెంకా అదరగొట్టింది. అచ్చొచ్చిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సుదీర్ఘ విరామం తర్వాత సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో 24వ సీడ్‌ అజరెంకా 6-4, 6-1తో జెస్సికా పెగులా (అమెరికా)ను ఓడించింది. తొలి సెట్లో ఆరంభం నుంచే విక్టోరియా విజృంభించింది. బలమైన సర్వీస్‌లు, విన్నర్లతో తొలి గేమ్‌లోనే జెస్సికా సర్వీస్‌ బ్రేక్‌ చేసి ఆపై 3-0తో ఆధిక్యంలో నిలిచింది. కానీ పెగులా నెమ్మదిగా పుంజుకుంది. తొమ్మిదో గేమ్‌లో బ్రేక్‌ సాధించి 4-5తో ప్రత్యర్థిని సమీపించింది. కానీ ఆమెకు ఆనందం కాసేపే! తర్వాతి గేమ్‌లోనే జెస్సికా సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన అజరెంకా సెట్‌ గెలిచింది. రెండో సెట్లో అజరెంకా ధాటికి జెస్సికా పూర్తిగా తేలిపోయింది. బలహీనమైన రిటర్న్‌లు, అనవసర తప్పిదాలతో మ్యాచ్‌ను అప్పగించింది. రెండో సెట్లో ఒకే ఒక్క గేమ్‌ ప్రత్యర్థికి చేజార్చుకున్న అజరెంకా సులభంగా సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో 17 విన్నర్లు కొట్టిన విక్టోరియా.. అయిదుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసింది. మరో క్వార్టర్స్‌లో రిబకినా (కజకిస్థాన్‌) 6-2, 6-4తో    ఒస్టాపెంకో (లాత్వియా)ను ఓడించింది.

సిట్సిపాస్‌ ముందుకు: గ్రీస్‌ కుర్రాడు స్టెఫానోస్‌ సిట్సిపాస్‌ పురుషుల సింగిల్స్‌లో సెమీఫైనల్‌ చేరాడు. క్వార్టర్స్‌లో ఈ మూడో సీడ్‌ 6-3, 7-6 (7-2), 6-4తో లెహెకా (చెక్‌)ను ఓడించాడు. ఒక్క రెండో సెట్లో మాత్రమే లెహెకా నుంచి సిట్సిపాస్‌కు గట్టిపోటీ ఎదురైంది. తొలి సెట్‌ను పెద్దగా కష్టపడకుండానే దక్కించుకున్న సిట్సిపాస్‌కు రెండో సెట్లో లెహెకా పరీక్ష పెట్టాడు. సెట్‌ను టైబ్రేకర్‌కు తీసుకెళ్లాడు. టైబ్రేకర్‌లో మెరుపు సర్వీసులతో అదరగొట్టిన సిట్సిపాస్‌ సెట్‌ను గెలిచి ఆధిక్యాన్ని రెట్టింపు చేసుకున్నాడు. మూడో సెట్లో లెహెకా పోరాడినా తగ్గకుండా ఆడిన సిట్సిపాస్‌ సెట్‌ను, మ్యాచ్‌ను దక్కించుకున్నాడు. 18వ సీడ్‌ కచనోవ్‌ (రష్యా) కూడా సెమీస్‌ చేరాడు. క్వార్టర్స్‌లో అతడు 7-6 (7-5), 6-3, 3-0తో  ఆధిక్యంలో ఉన్న సమయంలో ప్రత్యర్థి సెబాస్టియన్‌ కొర్డా (అమెరికా) గాయంతో వైదొలిగాడు. మణికట్టు గాయంతో ఇబ్బంది పడిన కొర్డా.. అలాగే పోరాడాడు. కానీ మూడో సెట్లో గాయం తీవ్రత పెరగడంతో ఆట కొనసాగించలేకపోయాడు.

సెమీస్‌లో సానియా జోడీ: కెరీర్‌లో ఆఖరి గ్రాండ్‌స్లామ్‌ ఆడుతున్న భారత స్టార్‌ సానియామీర్జా టైటిల్‌ దిశగా మరో అడుగువేసింది. రోహన్‌ బోపన్నతో కలిసి ఆమె మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్స్‌లో ప్రత్యర్థి జోడీ ఒస్టాపెంకో (లాత్వియా)-వెగా హెర్నాండెజ్‌ (స్పెయిన్‌) వాకోవర్‌ ఇవ్వడంతో బరిలో దిగకుండానే సానియా ద్వయం సెమీస్‌లో అడుగుపెట్టింది. ఫైనల్లో స్థానం కోసం మూడోసీడ్‌ జంట క్రాజెక్‌ (అమెరికా)-సుపాస్కి (బ్రిటన్‌)తో సానియా-బోపన్న జోడీ తలపడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని