ఆంధ్ర చేజేతులా..!

మధ్యప్రదేశ్‌తో రంజీ ట్రోఫీ క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌ను శాసించే స్థితిలో ఉన్న ఆంధ్ర కష్టాలు కొనితెచ్చుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 151 పరుగుల ఆధిక్యం సంపాదించిన ఆ జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో 93 పరుగులకే కుప్పకూలి ప్రత్యర్థి జట్టుకు గెలిచే అవకాశాన్ని కల్పించింది.

Published : 03 Feb 2023 03:27 IST

మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో ఓటమి దిశగా

ఇండోర్‌: మధ్యప్రదేశ్‌తో రంజీ ట్రోఫీ క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌ను శాసించే స్థితిలో ఉన్న ఆంధ్ర కష్టాలు కొనితెచ్చుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 151 పరుగుల ఆధిక్యం సంపాదించిన ఆ జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో 93 పరుగులకే కుప్పకూలి ప్రత్యర్థి జట్టుకు గెలిచే అవకాశాన్ని కల్పించింది. 245 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆతిథ్య జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ కోల్పోకుండా 58 పరుగులు సాధించింది. యశ్‌ దూబే (24 బ్యాటింగ్‌), హిమాంషు మంత్రి (31 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ఇంకో 187 పరుగులు చేస్తే మధ్యప్రదేశ్‌దే విజయం. డ్రా చేసుకున్నా సెమీస్‌ చేరుకునే అవకాశం ఉన్న ఆంధ్ర.. ముందంజ వేయాలంటే ఆఖరిరోజు బౌలర్లు అసాధారణ ప్రదర్శన చేయాల్సిందే. ఓవర్‌నైట్‌ స్కోరు 144/4తో గురువారం ఉదయం ఆట కొనసాగించిన మధ్యప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 228 పరుగులకు ఆలౌటైంది. పృథ్వీరాజ్‌ (5/26), శశికాంత్‌ (3/49) రాణించారు. రెండో ఇన్నింగ్స్‌లో ఊహించని రీతిలో తడబడిన ఆంధ్ర 32.3 ఓవర్లలో 93 పరుగులకే కుప్పకూలింది. అవేష్‌ఖాన్‌ (4/24), గౌరవ్‌ యాదవ్‌ (3/10) ఆంధ్ర పతనాన్ని శాసించారు. 76 పరుగులకే ఆంధ్ర 9 వికెట్లు కోల్పోయింది. ఎడమ చేతి మణికట్టులో చీలిక కారణంగా ఫీల్డింగ్‌కు రాని విహారి (15; 16 బంతుల్లో 3×4) తప్పనిసరి పరిస్థితుల్లో 11వ నంబరులో క్రీజులోకి వచ్చాడు. మూడు బౌండరీలూ రాబట్టాడు. 16 బంతులు ఎదుర్కొన్న విహారి.. పృథ్వీరాజ్‌ (2 నాటౌట్‌)తో కలిసి పదో వికెట్‌కు 17 పరుగులు జోడించాడు. చివరికి స్పిన్నర్‌ సారాంష్‌ జైన్‌ (1/11) బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు.

విజయం దిశగా బెంగాల్‌: ఝార్కండ్‌తో రంజీ ట్రోఫీ క్వార్టర్‌ఫైనల్లో బెంగాల్‌ విజయంపై కన్నేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థిని 173కే చుట్టేసిన బెంగాల్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ తక్కువ స్కోరుకే పరిమితం చేసేలా కనిపిస్తోంది. గురువారం, మూడోరోజు ఆట చివరికి ఝార్కండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 162/7తో కష్టాల్లో ఉంది. 155 పరుగుల భారీ లోటుతో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆ జట్టు 92/5తో నిలిచినా ఆర్యమన్‌ (64) ఆదుకున్నాడు.  అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 238/5తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన బెంగాల్‌.. 328 పరుగులకు ఆలౌటైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని