Sania Mirza: మరో సానియా రాకపోవడం వైఫల్యమే

దేశ క్రీడా రంగంలో వ్యవస్థాగత మార్పులు వస్తేనే మరో సానియాను చూడగలమని భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా అభిప్రాయపడింది.

Updated : 05 Mar 2023 10:44 IST

సానియా మీర్జా ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ నేడు

ఈనాడు, హైదరాబాద్‌: దేశ క్రీడా రంగంలో వ్యవస్థాగత మార్పులు వస్తేనే మరో సానియాను చూడగలమని భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా అభిప్రాయపడింది. ఇప్పటికే టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన ఆమె.. చివరిగా ఆదివారం ఎల్బీ స్టేడియంలో రోహన్‌ బోపన్న, ఇవాన్‌ డోడిగ్‌, బెతానీ మాటెక్‌, కారా బ్లాక్‌, మారియన్‌ బార్టోలితో కలిసి ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఈ నేపథ్యంలో శనివారం మొయినాబాద్‌లోని సానియా మీర్జా టెన్నిస్‌ అకాడమీలో బెతానీతో కలిసి ఆమె విలేకర్లతో మాట్లాడింది.

‘‘మరో సానియా రావడమంటే సవాలే. ఇప్పటికే నా లాంటి మరో క్రీడాకారిణి రావాల్సింది. దేశంలో ముందుగా విధానం మారాలి. అమ్మాయిలను ఆటల్లో ప్రోత్సహించాలి. భారత అగ్రశ్రేణి టెన్నిస్‌ ప్లేయర్లంతా సవాళ్లను దాటుకుని వచ్చినవాళ్లే. ఇప్పుడు పరిస్థితులు కాస్త మెరుగువుతున్నాయి. అమెరికాలో గొప్ప విధానముంది. నేను మార్పు కోరుకుంటున్నా. ఆ మార్పులో భాగమవాలనుకుంటున్నా. భవిష్యత్‌లో క్రీడా పాలనలోకి రావొచ్చేమో. దేశంలో బ్యాడ్మింటన్‌కు ఆదరణ పెరిగిందంటే అందుకు అవసరమైన సౌకర్యాలు, శిక్షణ ఉండడమే కారణం. 20 ఏళ్ల తర్వాత కూడా మరో సానియా రాలేదంటే మాత్రం అది వైఫల్యమే.

దేశంలో క్రికెటర్లు ఎక్కువగా ఉండడంతో ఐపీఎల్‌ లాంటి లీగ్‌ ఇన్నేళ్లుగా కొనసాగుతోంది. కానీ టెన్నిస్‌కు అలాంటి పరిస్థితి లేదు. నా కెరీర్‌లో ఒలింపిక్‌ పతకం లేకపోవడం లోటే. వింబుల్డన్‌ జూనియర్‌ టైటిల్‌ గెలిచిన తర్వాత నాకు లభించిన స్వాగతం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆటకు వీడ్కోలు పలకడానికి చాలా కారణాలున్నాయి. గాయాలు బాధించాయి. శరీరం సహకరించకపోవడంతో ఇక చాలనిపించింది. తనయుడు ఇజాన్‌ను చూసుకోవాలి. క్రీడా ప్రేమికుడైన అతనికి బ్యాడ్మింటన్‌ ఇష్టం. భవిష్యత్‌ ప్రణాళికల గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు.

ఇప్పుడు మహిళల ప్రిమియర్‌ లీగ్‌లో ఆర్సీబీ మెంటార్‌గా కొత్త పాత్ర పోషిస్తున్నా. నాకు క్రికెట్‌తో సంబంధమేంటనే విమర్శలు వినిపించొచ్చు. కానీ గత 20 ఏళ్లుగా చేసినట్లే ఇప్పుడు కూడా ఇలాంటి వాటిని పట్టించుకోను. డబ్ల్యూపీఎల్‌తో దేశంలో మహిళా క్రీడా రంగానికి మేలే. కోచ్‌గా మారతానో లేదో చెప్పలేను. నా టెన్నిస్‌ అకాడమీల్లో ఎక్కువ సమయం గడుపుతా. ఎక్కడైతే ఆట మొదలెట్టానో అక్కడే ముగించబోతుండడం గొప్పగా ఉంది. ఆదివారం నాకు ప్రత్యేకమైంది. ఎల్బీ స్టేడియంలో చివరిగా ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ ఆడబోతున్నా. భావోద్వేగాలకు ఈ మ్యాచ్‌ వేదిక కానుంది’’ అని సానియా చెప్పింది. ఎన్నో ఒడుదొడుకులు దాటి విజేతగా నిలిచిన సానియా ఆడబోయే చివరి మ్యాచ్‌ తనకూ భావోద్వేగాన్ని కలిగిస్తోందని, బెదురులేని వ్యక్తిత్వం ఆమె సొంతమని బెతానీ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని