IND vs AUS: కంగారూను కొట్టేస్తారా!

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ ముగిసింది. ఐపీఎల్‌ నెలాఖర్లో మొదలు కాబోతోంది. ఈ మధ్యలో భారత్‌, ఆస్ట్రేలియా మధ్య వన్డే పోరు. పెద్దగా ప్రచారానికి నోచుకోని ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ శుక్రవారమే మొదలవుతోంది.

Updated : 17 Mar 2023 09:17 IST

ఆసీస్‌తో భారత్‌ తొలి వన్డే నేడు
మధ్యాహ్నం 1.30 నుంచి

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ ముగిసింది. ఐపీఎల్‌ నెలాఖర్లో మొదలు కాబోతోంది. ఈ మధ్యలో భారత్‌, ఆస్ట్రేలియా మధ్య వన్డే పోరు. పెద్దగా ప్రచారానికి నోచుకోని ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ శుక్రవారమే మొదలవుతోంది. వాంఖడేలో తొలి వన్డే. ఇప్పుడు దృష్టంతా టీమ్‌ ఇండియా వన్డే ప్రపంచకప్‌ సన్నాహాలపైనే. కిందటిసారి (2011) భారత్‌ ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చినప్పుడు ధోని నేతృత్వంలోని జట్టు కప్పు గెలిచిన నేపథ్యంలో ఈసారి ఆశలు, అంచనాలు ఎక్కువే ఉన్నాయి. స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య నాయకత్వ పటిమకు కూడా తొలి వన్డే.. పరీక్షగా నిలవనుంది. కుటుంబ కారణాలతో రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మొదటి మ్యాచ్‌కు దూరమైన నేపథ్యంలో జట్టుకు హార్దిక్‌ సారథ్యం వహిస్తున్నాడు. సిరీస్‌కు అతడు వైస్‌ కెప్టెన్‌ కూడా. వన్డే లయను అందుకోవడం భారత్‌, ఆస్ట్రేలియా జట్లు రెండింటికీ సవాలే. అయితే ఈ సిరీస్‌ ప్రపంచకప్‌ సూపర్‌ లీగ్‌లో భాగం కాదు.

జోరు కొనసాగిస్తారా..: వన్డే ఫార్మాట్లో ఈ ఏడాదిని గొప్పగా ఆరంభించిన టీమ్‌ ఇండియా అదే జోరు కొనసాగించాలనుకుంటోంది. రెండు సిరీస్‌ల్లోనూ న్యూజిలాండ్‌, శ్రీలంకలతో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ భారత్‌ గెలిచింది. ముఖ్యంగా శుభ్‌మన్‌ ఫామ్‌ జట్టుకు కలిసొచ్చే అంశం. ఆరు వన్డేల్లో అతడు 113.40 సగటుతో ఏకంగా 567 పరుగులు చేశాడు. రోహిత్‌ గైర్హాజరీలో అభిమానులను అతడు మరింతగా ఆకర్షించనున్నాడు. పైగా అహ్మదాబాద్‌ టెస్టులో శతకంతో జోరుమీదున్నాడు. కింగ్‌ కోహ్లి కూడా పరిమిత ఓవర్ల క్రికెట్లో పేలవ దశ నుంచి బయటపడ్డాడు. ఆ ఆరు మ్యాచ్‌లో 67.60 సగటుతో 338 పరుగులు చేశాడు. ఫామ్‌లో ఉన్న అతడు మరింత పరుగులు సాధించి విజయాల్లో కీలక పాత్ర పోషిస్తాడని జట్టు ఆశిస్తోంది. ఆసీస్‌ స్పిన్నర్‌ అడమ్‌ జంపాతో కోహ్లి పోరు ఆసక్తి రేపుతోంది. విరాట్‌కు అతడు గతంలో మెరుగ్గానే బౌలింగ్‌ చేశాడు. గిల్‌తో కలిసి ఇషాన్‌ ఇన్నింగ్స్‌ ఆరంభిస్తాడు. కివీస్‌తో వన్డే సిరీస్‌లో విఫలమైన అతడు పుంజుకోవాల్సివుంది. రాహుల్‌ వికెట్‌కీపింగ్‌ చేసే అవకాశముంది. సూర్యకుమార్‌, హార్దిక్‌, జడేజాలు కూడా ఉన్న భారత బ్యాటింగ్‌ లైనప్‌ బాగానే కనిపిస్తోంది. అయితే సూర్యకు ఈ సిరీస్‌ పరీక్షే. టీ20ల్లో చెలరేగి ఆడే అతడు.. ఎందుకో వన్డేల్లో అలాంటి ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఇప్పటివరకు వన్డేల్లో 18 ఇన్నింగ్స్‌ల్లో అతడి సగటు 28.86 మాత్రమే. రెండు అర్ధశతకాలు మాత్రమే ఉన్నాయి. ఈ సిరీస్‌లోనైనా అతడు రాణిస్తాడేమో చూడాలి. గాయాలతో శ్రేయస్‌, బుమ్రా దూరమవడం మాత్రం భారత్‌కు ప్రతికూలాంశమే. బుమ్రా గైర్హాజరీలో భారత పేస్‌ దళానికి సిరాజ్‌ నాయకత్వం వహించనున్నాడు. పునరాగమన ఆల్‌రౌండర్‌ జడేజాతో కలిసి శార్దూల్‌ జట్టుకు సమతూకాన్నిస్తున్నాడు. జడేజాతో కలిసి అక్షర్‌ పటేల్‌ లేదా సుందర్‌ స్పిన్‌ బాధ్యతలు పంచుకునే అవకాశముంది. సిరాజ్‌, శార్దూల్‌తో కలిసి షమి పేస్‌ భారాన్ని మోయొచ్చు.

ఆస్ట్రేలియా ఉత్సాహంగా..: నిరుడు నవంబరు తర్వాత ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ ఆడడం ఇప్పుడే. అయితే టెస్టు సిరీస్‌లో పుంజుకున్న తీరుతో ఆ జట్టు ఉత్సాహంగా ఉంది. పైగా 2016 నుంచి భారత్‌లో ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ గెలిచిన ఏకైక పర్యటక జట్టు తమదే కావడం ఆసీస్‌ విశ్వాసాన్ని పెంచేదే. కెప్టెన్‌ కమిన్స్‌ దూరమైనా సిరీస్‌లో పైచేయి సాధించడానికి అవసరమైన బలం ఆసీస్‌కు ఉంది. ఆ జట్టుకు స్మిత్‌ నాయకత్వం వహించనున్నాడు. కమిన్స్‌తో పాటు హేజిల్‌వుడ్‌, జేరిచర్డ్‌సన్‌ అందుబాటులో లేకపోయినా స్టార్క్‌, గ్రీన్‌ల రూపంలో ఆసీస్‌కు నాణ్యమైన పేసర్లే ఉన్నారు. వారికి తోడుగా ఎలిస్‌ ఉన్నాడు. స్పిన్‌ విభాగంలో జంపాకు తోడుగా మ్యాక్స్‌వెల్‌ ఉన్నాడు. వార్నర్‌, హెడ్‌, స్మిత్‌, లబుషేన్‌, స్టాయినిస్‌, మ్యాక్స్‌వెల్‌లతో కూడిన ఆసీస్‌ లైనప్‌ భారత బౌలర్లకు గట్టి సవాలే విసరగలదు.


డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడను: హార్దిక్‌

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఆడే ఉద్దేశం తనకు లేదని ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య అన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడే అంశాన్ని పరిశీలిస్తున్నారా అన్న ప్రశ్నకు అతడు స్పష్టంగా బదులిచ్చాడు. బాగా సన్నద్ధమై, కష్ట పడి చోటు సంపాదించే టెస్టుల్లో పునరాగమనం చేస్తానని అన్నాడు. ఇప్పటికిప్పుడు వేరొకరి స్థానం తీసుకోవడం అనైతికమవుతుందని హార్దిక్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘ఇప్పుడే టెస్టు జట్టులోకి రాను. నేను నైతికంగా వ్యవహరిస్తా. టీమ్‌ఇండియా ఫైనల్‌ చేరడంలో నేను పది శాతం కూడా కష్టపడలేదు. ఒక్క శాతం నా శ్రమ ఉండదు. అలాంటప్పుడు నేను వేరొకరి స్థానాన్ని తీసుకోవడం అనైతికమవుతుంది. నేను టెస్టు క్రికెట్‌ ఆడాలనుకుంటే కష్టపడి జట్టులో స్థానం సంపాదిస్తా. అప్పటివరకు నేను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు గానీ, భవిష్యత్తు టెస్టు సిరీస్‌లకు గానీ అందుబాటులో ఉండను’’ అని హార్దిక్‌ అన్నాడు. అతడు చివరిసారి 2018లో టెస్టు మ్యాచ్‌  (సౌథాంప్టన్‌లో ఇంగ్లాండ్‌పై) ఆడాడు.

శ్రేయస్‌ లేకపోవడం లోటే: శ్రేయస్‌ అయ్యర్‌ వెన్ను గాయం తిరగబెడుతుండడం భారత జట్టుకు ఆందోళన కలిగించే విషయమేనని హార్దిక్‌ అన్నాడు. ‘‘అయ్యర్‌ పునరాగమనం ఎప్పుడో తెలియదు. అతడు త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం. ఏడాది కింద నేను ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నా. వెన్ను నొప్పి పెద్ద సమస్యే’’ అని చెప్పాడు. ‘‘శ్రేయస్‌ దూరం కావడం లోటే. జట్టుపై తప్పక ప్రభావం ఉంటుంది. కానీ అతడు ఎక్కువకాలం దూరమైతే ఆ లోటును తీర్చడానికి పరిష్కారాలు వెతకాల్సిన అవసరముంది’’ అని హార్దిక్‌ అన్నాడు.


పిచ్‌

సాధారణంగా వాంఖడే పిచ్‌లో పెద్దగా జీవం ఉండదు. మ్యాచ్‌ సాగుతున్నకొద్దీ బ్యాటింగ్‌కు మరింత సహకరిస్తుంది. చివరగా ఇక్కడ 2020లో జరిగిన మ్యాచ్‌లో 256 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం 38 ఓవర్లలో ఛేదించింది.

తుది జట్లు (అంచనా).. భారత్‌: శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌, కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, రాహుల్‌, హార్దిక్‌ పాండ్య, జడేజా, అక్షర్‌/సుందర్‌, శార్దూల్‌, సిరాజ్‌, షమి

ఆస్ట్రేలియా: వార్నర్‌, ట్రావిస్‌  హెడ్‌, స్మిత్‌, లబుషేన్‌, స్టాయినిస్‌, మ్యాక్స్‌వెల్‌, కేరీ, కామెరాన్‌ గ్రీన్‌, స్టార్క్‌, అడమ్‌ జంపా, నాథన్‌ ఎలిస్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని