లంకపై కివీస్‌ క్లీన్‌స్వీప్‌

శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌ను ఆతిథ్య న్యూజిలాండ్‌ 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. రెండో టెస్టులో ఆ జట్టు ఇన్నింగ్స్‌ 58 పరుగుల తేడాతో లంకను చిత్తు చేసింది.

Published : 21 Mar 2023 03:19 IST

రెండో టెస్టులో ఇన్నింగ్స్‌ విజయం

వెల్లింగ్టన్‌: శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌ను ఆతిథ్య న్యూజిలాండ్‌ 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. రెండో టెస్టులో ఆ జట్టు ఇన్నింగ్స్‌ 58 పరుగుల తేడాతో లంకను చిత్తు చేసింది. ఫాలోఆన్‌ ఆడుతూ నాలుగో రోజు 113/2తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన లంక.. ప్రతిఘటించినా ఫలితం లేకపోయింది. కీలక సమయంలో వికెట్లు చేజార్చుకున్న ఆ జట్టు 358 పరుగులకే ఆలౌటైంది. ధనంజయ డిసిల్వా  (98; 185 బంతుల్లో 12×4, 1×6) పోరాటం వృథా అయింది. ఓవర్‌నైట్‌ బ్యాటర్లు కుశాల్‌ మెండిస్‌ (50), మాథ్యూస్‌ (2) ఎక్కువసేపు నిలవకపోగా.. దినేశ్‌ చండిమాల్‌ (62)తో కలిసి ధనంజయ కివీస్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. ఒక దశలో 242/4తో లంక మెరుగైన స్థితిలో నిలిచింది. చండిమాల్‌ ఔటైనా.. మధుశంక (39) తోడుగా ధనంజయ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. కానీ ఓవర్‌ తేడాతో మధుశంక, ధనంజయ వెనుదిరగడంతో లంక పని అయిపోయింది. చివరి 4 వికెట్లను లంక 40 పరుగులకే కోల్పోయింది. సౌథీ (3/51), టిక్నర్‌ (3/84), మైకేల్‌ బ్రాస్‌వెల్‌ (2/100) కివీస్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు. న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 580/4 వద్ద డిక్లేర్‌ చేయగా..లంక 164 పరుగులకే కుప్పకూలింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని