CSK vs SRH: సన్‌రైజర్స్‌ మార్కు ఆట.. చివరికి చెన్నైదే విజయం

పరుగుల వరద పారే ఐపీఎల్‌లో ఒకప్పుడు నత్తనడక బ్యాటింగ్‌కు పెట్టింది పేరు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌! కష్టపడి 130-150 మధ్య స్కోర్లు చేయడం.. ఆ లక్ష్యాల ఛేదనకు కూడా ప్రత్యర్థి జట్లు చెమటోడ్చేలా చేయడం.. సన్‌రైజర్స్‌ మ్యాచ్‌ల్లో చాలాసార్లు చూశాం! తర్వాత ఆట మారినా.. అప్పుడప్పుడూ పాత శైలిని బయటికి తీస్తుంటుందా జట్టు. శుక్రవారం కూడా అలాగే జరిగింది.

Updated : 22 Apr 2023 07:17 IST

బ్యాటింగ్‌లో హైదరాబాద్‌ ఘోర వైఫల్యం
134/7కు పరిమితం
అయినా బంతితో పోరాటం

పరుగుల వరద పారే ఐపీఎల్‌లో ఒకప్పుడు నత్తనడక బ్యాటింగ్‌కు పెట్టింది పేరు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌! కష్టపడి 130-150 మధ్య స్కోర్లు చేయడం.. ఆ లక్ష్యాల ఛేదనకు కూడా ప్రత్యర్థి జట్లు చెమటోడ్చేలా చేయడం.. సన్‌రైజర్స్‌ మ్యాచ్‌ల్లో చాలాసార్లు చూశాం! తర్వాత ఆట మారినా.. అప్పుడప్పుడూ పాత శైలిని బయటికి తీస్తుంటుందా జట్టు. శుక్రవారం కూడా అలాగే జరిగింది. చెపాక్‌ స్టేడియంలో కష్టపడి 134 పరుగులు చేసిన సన్‌రైజర్స్‌.. అనంతరం బంతితో పోరాడి చిన్న లక్ష్యాన్ని ఛేదించేందుకు చెన్నై 19వ ఓవర్‌ వరకు ఎదురు చూసేలా చేసింది. బ్యాటర్లు కొంచెం మెరుగ్గా ఆడి స్కోరును 150 దాటించి ఉంటే సీఎస్కేకు కష్టమయ్యేదేమో!

చెన్నై

ఐపీఎల్‌-16ను ఓటమితో ఆరంభించినప్పటికీ.. తర్వాత చెన్నై దూసుకెళ్తోంది. చివరి 5 మ్యాచ్‌ల్లో ఆ జట్టు నాలుగో విజయం సాధించింది. శుక్రవారం సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో చెన్నై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. డెవాన్‌ కాన్వే (77 నాటౌట్‌; 57 బంతుల్లో 12×4, 1×6) సత్తా చాటడంతో 135 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 18.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్పిన్నర్‌ మయాంక్‌ మార్కండే (2/23) చక్కటి బౌలింగ్‌తో చెన్నైని ఇబ్బంది పెట్టాడు. అంతకుముందు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జడేజా (3/22)తో పాటు పతిరన (1/22), ఆకాశ్‌ సింగ్‌ (1/17) రాణించడంతో హైదరాబాద్‌ 134/7కు పరిమితమైంది. 34 పరుగులు చేసిన అభిషేక్‌ శర్మనే టాప్‌స్కోరర్‌. ఆరు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌కిది నాలుగో ఓటమి.

అలవోకగా కొట్టేస్తుందనుకుంటే..: ఛేదనలో చెన్నైకి దక్కిన ఆరంభం చూస్తే.. ఆట 15 ఓవర్ల వరకైనా సాగుతుందా అనిపించింది. ఆరంభం నుంచి ధాటిగా ఆడిన కాన్వే.. జాన్సన్‌ వేసిన ఆరో ఓవర్లో వరుసగా 4, 4, 6, 4, 4తో చెలరేగిపోయాడు. పెద్దగా కష్టపడకుండానే అతను బంతిని పదే పదే బౌండరీ దాటించాడు. రుతురాజ్‌ (35) కూడా నిలకడగా ఆడగా.. వికెట్‌ కోల్పోకుండా 6 ఓవర్లకు 60, 10 ఓవర్లకు 86 పరుగులు చేసిన చెన్నై సునాయాసంగా గెలిచేలా కనిపించింది. కానీ ఉమ్రాన్‌ మాలిక్‌ 11వ ఓవర్లో ఒక్క పరుగే ఇవ్వడం.. ఫాలో త్రూలో అతడి చేయి తాకి రుతురాజ్‌ రనౌటైపోవడంతో చెన్నై ఒత్తిడిలో పడింది. తర్వాతి 2 ఓవర్లలో దాగర్‌, సుందర్‌ తలో 4 పరుగులే ఇచ్చారు. 7 ఓవర్లలో 40 పరుగులు చేయాల్సి రాగా.. రహానె (9), రాయుడు (9) ఒకరి తర్వాత ఒకరు వెనుదిరగడంతో మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. సన్‌రైజర్స్‌ అద్భుతాలేమైనా చేస్తుందా అనిపించింది. కానీ కాన్వే తిరిగి వేగం అందుకుని చకచకా బౌండరీలు బాది మ్యాచ్‌ను ముగించాడు.

11 ఓవర్లలో 6 వికెట్లు, 64 పరుగులు: మొదట టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ 134 పరుగులు చేయడానికి పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ఇన్నింగ్స్‌ రెండో అర్ధంలో ఆ జట్టు తీవ్రంగా తడబడింది. ఈ సీజన్‌ తొలి రెండు మ్యాచ్‌ల ప్రదర్శనను పునరావృతం చేస్తూ.. టీ20ని కాస్తా వన్డేలా మార్చేశారు ఆ జట్టు బ్యాటర్లు. నిజానికి సన్‌రైజర్స్‌కు పర్వాలేదనిపించే ఆరంభం లభించింది. వేగంగా ఆడలేకపోతున్న మయాంక్‌ను మిడిలార్డర్‌కు మార్చి, అక్కడ ఆడుతున్న అభిషేక్‌ శర్మ (34; 26 బంతుల్లో 3×4, 1×6)ను ఓపెనింగ్‌లోకి పంపగా.. అతను ఆకట్టుకున్నాడు. అభిషేక్‌.. బ్రూక్‌ (18)తో తొలి వికెట్‌కు 35, త్రిపాఠి (21)తో రెండో వికెట్‌కు 36 పరుగులు జోడించడంతో 9 ఓవర్లకు 70/1తో సన్‌రైజర్స్‌ మెరుగ్గానే కనిపించింది. కానీ తర్వాతి 11 ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి కేవలం 64 పరుగులే చేయగలిగింది. చెన్నై బౌలర్లు పరుగులూ ఇవ్వలేదు. అలాగే వికెట్లూ నిలవనివ్వలేదు. ఆ జట్టులో నలుగురు బౌలర్లు 7 లోపు ఎకానమీని నమోదు చేశారు. మధ్య ఓవర్లలో జడేజా ధాటికి సన్‌రైజర్స్‌ కుదేలైంది. అతడి బౌలింగ్‌లో షాట్లకు ప్రయత్నించి అభిషేక్‌, త్రిపాఠి క్యాచౌట్‌ కాగా.. మయాంక్‌ (2) స్టంపౌటయ్యాడు. మధ్యలో కెప్టెన్‌ మార్‌క్రమ్‌ (12)ను తీక్షణ పెవిలియన్‌ చేర్చాడు. క్లాసెన్‌ (17), జాన్సన్‌ (17 నాటౌట్‌), సుందర్‌ (9) కాస్త పోరాడటంతో సన్‌రైజర్స్‌ ఆ మాత్రం స్కోరైనా చేసింది.


అహ్మదాబాద్‌లో ఫైనల్‌

దిల్లీ: ఐపీఎల్‌-16 ప్లేఆఫ్స్‌ వేదికలు ఖరారయ్యాయి. ఇంతకుముందు లీగ్‌ దశ షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించిన బీసీసీఐ శుక్రవారం మిగతా నాలుగు మ్యాచ్‌ల వివరాలను వెల్లడించింది. అహ్మదాబాద్‌లో మే 28న ఫైనల్‌ జరగనుంది. మే 26న క్వాలిఫయర్‌-2కు కూడా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సీజన్‌ ఆరంభ మ్యాచ్‌కూ ఈ మైదానమే వేదిక. గత సీజన్లో తుది పోరును కూడా ఇక్కడే నిర్వహించారు. మరోవైపు మే 23, 24 తేదీల్లో జరిగే క్వాలిఫయర్‌-1, ఎలిమినేటర్‌ మ్యాచ్‌లకు చెన్నై వేదిక కానుంది. మే 21న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు-గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌తో లీగ్‌ దశ ముగియనుంది.


ధోని రికార్డు

41 ఏళ్ల వయసులోనూ మహేంద్ర సింగ్‌ ధోని క్రికెట్లో రికార్డులు తిరగరాస్తూనే ఉన్నాడు. ఈ సీఎస్కే కెప్టెన్‌ తాజాగా టీ20 క్రికెట్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్‌కీపర్‌గా చరిత్ర సృష్టించాడు. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో మార్‌క్రమ్‌ క్యాచ్‌ అందుకున్న అతను.. మొత్తం 208 క్యాచ్‌లతో అగ్రస్థానాన్ని అందుకున్నాడు. డికాక్‌ (207), దినేశ్‌ కార్తీక్‌ (205) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.


అవే మెరుపులు

వయసు పెరిగినా తన వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యాల్లో ఏ మార్పూ లేదని మహేంద్రసింగ్‌ ధోని మరోసారి రుజువు చేశాడు. త్వరలో 42 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న మహి.. శుక్రవారం సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో చూపించిన చురుకుదనానికి ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. జడేజా బౌలింగ్‌లో మయాంక్‌ అగర్వాల్‌ ముందుకొచ్చి షాట్‌ ఆడబోగా.. బంతి అతడి బ్యాట్‌కు చిక్కలేదు. రెప్పపాటులో బంతిని అందుకుని మెరుపు వేగంతో స్టంపింగ్‌ చేశాడు ధోని. మయాంక్‌ తిరిగి క్రీజును చేరుకునే ప్రయత్నం కూడా చేయకుండా వెనుదిరిగాడు. మార్‌క్రమ్‌ బ్యాట్‌ అంచుకు తాకి వచ్చిన క్యాచ్‌ను స్టంప్స్‌కు చాలా దగ్గరగా అందుకోవడంలో, అలాగే చివరి బంతికి సుందర్‌ను రనౌట్‌ చేయడంలోనూ ధోని తన మార్కు చూపించాడు.

సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌: బ్రూక్‌ (సి) రుతురాజ్‌ (బి) ఆకాశ్‌ 18; అభిషేక్‌ (సి) రహానె (బి) జడేజా 34; త్రిపాఠి (సి) ఆకాశ్‌ (బి) జడేజా 21; మార్‌క్రమ్‌ (సి) ధోని (బి) తీక్షణ 12; క్లాసెన్‌ (సి) రుతురాజ్‌ (బి) పతిరన 17; మయాంక్‌ అగర్వాల్‌ (స్టంప్డ్‌) ధోని (బి) జడేజా 2; మార్కో జాన్సన్‌ నాటౌట్‌ 17; సుందర్‌ రనౌట్‌ 9; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 134; వికెట్ల పతనం: 1-35, 2-71, 3-84, 4-90, 5-95, 6-116, 7-134; బౌలింగ్‌: ఆకాశ్‌ సింగ్‌ 3-0-17-1; తుషార్‌ దేశ్‌పాండే 3-0-26-0; తీక్షణ 4-0-27-1; మొయిన్‌ అలీ 2-0-18-0; జడేజా 4-0-22-3; పతిరన 4-0-22-1

చెన్నై ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ రనౌట్‌ 35; కాన్వే నాటౌట్‌ 77; రహానె (సి) మార్‌క్రమ్‌ (బి) మార్కండే 9; రాయుడు (బి) మార్కండే 9; మొయిన్‌ అలీ నాటౌట్‌ 6; ఎక్స్‌ట్రాలు 2 మొత్తం: (18.4 ఓవర్లలో 3 వికెట్లకు) 138; వికెట్ల పతనం: 1-87, 2-110, 3-122; బౌలింగ్‌: భువనేశ్వర్‌ కుమార్‌ 2-0-10-0; మార్కో జాన్సన్‌ 3-0-37-0; మార్‌క్రమ్‌ 1-0-11-0; వాషింగ్టన్‌ సుందర్‌ 2.4-0-16-0; మయాంక్‌ మార్కండే 4-0-23-2; ఉమ్రాన్‌ మాలిక్‌ 3-0-18-0; మయాంక్‌ దాగర్‌ 3-0-21-0

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని