రెండు నెలలు ఎందుకంటే..

విరాట్‌ కోహ్లి ఇటీవల రెండు నెలల క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. భార్య అనుష్క తమ రెండో బిడ్డకు జన్మనిచ్చిన నేపథ్యంలో కుటుంబంతో అతడు విలువైన సమయం గడిపాడు.

Published : 27 Mar 2024 01:54 IST

దిల్లీ: విరాట్‌ కోహ్లి ఇటీవల రెండు నెలల క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. భార్య అనుష్క తమ రెండో బిడ్డకు జన్మనిచ్చిన నేపథ్యంలో కుటుంబంతో అతడు విలువైన సమయం గడిపాడు. ఇంగ్లాండ్‌తో అయిదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ మొత్తానికి దూరంగా ఉండాలన్న అతడి నిర్ణయంపై అభిమానుల్లో చర్చ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్‌తో మళ్లీ మైదానంలోకి వచ్చిన కోహ్లి.. రెండు నెలలు తాను ఆటకు దూరంగా ఉండడంపై స్పందించాడు. కుటుంబంతో గడపడం గొప్ప అనుభూతి అని అన్నాడు. ‘‘మేం దేశంలో లేం. జనం మమ్మల్ని గుర్తుపట్టలేని ప్రదేశంలో ఉన్నాం. కుటుంబమంతా కలిసి ఉన్నాం. రెండు నెలల పాటు సాధారణంగా ఉన్నాం. నాకు, నా కుటుంబానికి అదొక కల లాంటి అనుభవం. ఇద్దరు పిల్లలు ఉంటే పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. కుటుంబంతో కలిసి గడిపేందుకు అవకాశమిచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు. వీధుల్లో ఓ సాధారణ వ్యక్తిలా తిరగడం, ఎవరూ గుర్తుపట్టకపోవడం ఓ గొప్ప అనుభవం’’ అని కోహ్లి చెప్పాడు.

మరోవైపు అంతర్జాతీయ టీ20ల్లో తాను కొనసాగడంపై కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సోమవారం పంజాబ్‌తో మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో బెంగళూరును గెలిపించిన అనంతరం కోహ్లి మాట్లాడుతూ.. ‘‘ఈ మధ్య నా పేరును ప్రపంచవ్యాప్తంగా టీ20 క్రికెట్‌కు ప్రచారం కల్పించడానికి బాగా వాడుతున్నారు. నేనింకా పోటీలోనే ఉన్నాననుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు. 2022 టీ20 ప్రపంచకప్‌ తర్వాత విరాట్‌ భారత్‌ తరఫున ఈ ఫార్మాట్లో ఆడలేదు. ఈ ఏడాది జూన్‌లో జరిగే పొట్టి ప్రపంచకప్‌నకు కోహ్లిని ఎంపిక చేస్తారా లేదా అనే విషయంలో పెద్ద చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కోహ్లి ఇలా వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని