Hyderabad Vs Mumbai: బోణీ కొట్టేదెవరో

కొత్త సారథులు.. సరికొత్త ఉత్సాహంతో బరిలో దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ముంబయి ఇండియన్స్‌ జట్లకు ఆరంభ మ్యాచ్‌ల్లో పరాజయాలు తప్పలేదు.

Updated : 27 Mar 2024 13:46 IST

నేడు ఉప్పల్‌లో ముంబయితో సన్‌రైజర్స్‌ ఢీ

ఈనాడు, హైదరాబాద్‌: కొత్త సారథులు.. సరికొత్త ఉత్సాహంతో బరిలో దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ముంబయి ఇండియన్స్‌ జట్లకు ఆరంభ మ్యాచ్‌ల్లో పరాజయాలు తప్పలేదు. ఆ మ్యాచ్‌ల్లో రెండు జట్లూ విజయానికి దగ్గరగా వచ్చినా ఆఖర్లో తడబాటుతో బోణీ కొట్టలేకపోయాయి. మరి బుధవారం ఉప్పల్‌ స్టేడియంలో అమీతుమీ తేల్చుకోనున్న సన్‌రైజర్స్‌, ముంబయిలలో మురిసేదెవరు? గెలుపు బోణీతో పాయింట్ల ఖాతా తెరిచేదెవరు?

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ గెలుపు ముంగిట బోల్తాపడింది. హెన్రిచ్‌ క్లాసెన్‌, షాబాజ్‌ అహ్మద్‌ జట్టును విజయానికి చేరువ చేసినా.. హర్షిత్‌ రాణా అద్భుతమైన బౌలింగ్‌తో కమిన్స్‌ సేన ఆశలపై నీళ్లు చల్లాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ముంబయిదీ అదే పరిస్థితి. చివరి ఓవర్‌ వరకు రేసులో ఉన్న ముంబయి ఆఖరి నాలుగు బంతుల్లో తడబడి మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఇప్పుడీ రెండు జట్లు తొలి గెలుపుపై గురిపెట్టాయి. ఈ సీజన్‌లో సొంతగడ్డపై సన్‌రైజర్స్‌కు ఇదే మొదటి మ్యాచ్‌. భువనేశ్వర్‌, మార్కో యాన్సన్‌, నటరాజన్‌, కమిన్స్‌లతో బలమైన బౌలింగ్‌ కలిగిన సన్‌రైజర్స్‌.. స్థాయికి తగ్గట్లు సత్తాచాటితే ఉప్పల్‌లో బోణీ కొట్టొచ్చు. మిడిలార్డర్‌లో క్లాసెన్‌, షాబాజ్‌ మాదిరే.. టాప్‌ ఆర్డర్‌లో మయాంక్‌ అగర్వాల్‌, అభిషేక్‌శర్మ, రాహుల్‌ త్రిపాఠి, మార్‌క్రమ్‌ దూకుడు పెంచాలి.

భీకరమైన బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన ముంబయికి సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ పరీక్షగా నిలువనుంది. కోల్‌కతాతో మ్యాచ్‌లో రోహిత్‌శర్మ, బ్రెవిస్‌ సత్తాచాటినా మిగతా వాళ్లు విఫలమయ్యారు. ఇషాన్‌ కిషన్‌, నమన్‌ ధీర్‌, తిలక్‌వర్మ, టిమ్‌ డేవిడ్‌, కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య పూర్తిస్థాయి ఫామ్‌లోకి వస్తే సన్‌రైజర్స్‌ బౌలర్లకు కష్టమే. ఇక ఐపీఎల్‌లో  రెండు జట్లు ఇప్పటి వరకు 21 మ్యాచ్‌లాడగా.. తొమ్మిదింట్లో సన్‌రైజర్స్‌, పన్నెండింట్లో ముంబయి పైచేయి సాధించాయి. రెండు జట్ల మధ్య గత అయిదు మ్యాచ్‌ల్లో నాలుగుసార్లు ముంబయి గెలిచింది. ఒక మ్యాచ్‌ సన్‌రైజర్స్‌ నెగ్గింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని