సన్‌రైజర్స్‌ తడాఖా

వారం కిందట ఉప్పల్‌ స్టేడియం పరుగుల వర్షంలో తడిసి ముద్దయిపోయింది. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోరును నమోదు చేసింది సన్‌రైజర్స్‌ ఆ మ్యాచ్‌లో. ఈసారి బలమైన బ్యాటింగ్‌ ఉన్న చెన్నై సూపర్‌కింగ్స్‌తో మ్యాచ్‌ కాబట్టి మరోసారి పరుగుల పంట ఖాయమనుకున్నారంతా.

Updated : 06 Apr 2024 06:52 IST

 సత్తా చాటిన బౌలర్లు
 మెరిసిన మార్‌క్రమ్‌, అభిషేక్‌
 చెన్నైపై అలవోక విజయం

వారం కిందట ఉప్పల్‌ స్టేడియం పరుగుల వర్షంలో తడిసి ముద్దయిపోయింది. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోరును నమోదు చేసింది సన్‌రైజర్స్‌ ఆ మ్యాచ్‌లో. ఈసారి బలమైన బ్యాటింగ్‌ ఉన్న చెన్నై సూపర్‌కింగ్స్‌తో మ్యాచ్‌ కాబట్టి మరోసారి పరుగుల పంట ఖాయమనుకున్నారంతా. కానీ శుక్రవారం ఉప్పల్‌లో సిక్సర్ల మోత మోగలేదు. ఈసారి బంతి పదును చూపించిన ఆతిథ్య జట్టు.. చెన్నైకి చెక్‌ పెట్టింది. బ్యాటింగ్‌లో ఆశించిన స్థాయిలో మెరుపులు లేకపోవడం నిరాశ కలిగించినా.. సన్‌రైజర్స్‌ ఆట మాత్రం అభిమానులను ఆకట్టుకుంది.

ఈనాడు, హైదరాబాద్‌

సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ సత్తాచాటింది. హైదరాబాద్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ మెరిసింది. శుక్రవారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 6 వికెట్ల తేడాతో చెన్నైని ఓడించింది. మొదటి నుంచి చివరి బంతి వరకు సంపూర్ణ ఆధిపత్యం కనబరిచిన సన్‌రైజర్స్‌ ఈ సీజన్‌లో రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. సన్‌రైజర్స్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 165 పరుగులు సాధించింది. శివమ్‌ దూబె (45; 24 బంతుల్లో 2×4, 4×6) మాత్రమే ఆకట్టుకున్నాడు. అనంతరం ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అభిషేక్‌ శర్మ (37; 12 బంతుల్లో 3×4, 4×6) మెరుపు ఆరంభంతో మరో 11 బంతులు మిగిలివుండగానే సన్‌రైజర్స్‌ లక్ష్యాన్ని ఛేదించింది. 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 166 పరుగులు సాధించింది. మార్‌క్రమ్‌ (50; 36 బంతుల్లో 4×4, 1×6) అర్ధసెంచరీతో రాణించగా.. ఈ సీజన్‌లో మొదటి మ్యాచ్‌ ఆడుతున్న తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్‌రెడ్డి (14 నాటౌట్‌; 8 బంతుల్లో 1×4, 1×6) సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు.

అభిషేక్‌ తేల్చేశాడు..: చెన్నై ఇన్నింగ్స్‌ ఎంత కష్టంగా సాగిందో సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ అంత దూకుడుగా పరుగెత్తింది. తొలి ఓవర్‌ నుంచే సన్‌రైజర్స్‌ టాప్‌ గేర్‌లో దూసుకెళ్లింది. దీపక్‌ చాహర్‌ వేసిన ఇన్నింగ్స్‌ మొదటి ఓవర్‌ రెండో బంతికి ఫస్ట్‌ స్లిప్‌లో ట్రావిస్‌ హెడ్‌ (31; 24 బంతుల్లో 3×4, 1×6) క్యాచ్‌ను మొయిన్‌ అలీ జారవిడవడంతోనే మ్యాచ్‌ చెన్నైకి ఇబ్బందులు తప్పలేదు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న అభిషేక్‌ శర్మ.. మ్యాచ్‌ ఫలితాన్ని ముందే తేల్చేశాడు. ముకేశ్‌ చౌదరి రెండో ఓవర్లో మూడు సిక్సర్లు, ఒక బౌండరీతో 27 పరుగులు రాబట్టి చెన్నైని ఆత్మరక్షణలోకి నెట్టాడు. చాహర్‌ ఓవర్లోనూ సిక్సర్‌, బౌండరీతో చెలరేగాడు. ఆ తర్వాతి బంతికే అభిషేక్‌ ఔటైనా అప్పటికే జరగాల్సిన నష్టం చేసేశాడు. అభిషేక్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఊపును కొనసాగించిన హెడ్‌, మార్‌క్రమ్‌ బౌండరీలతో అలరించారు. దీంతో పవర్‌ ప్లే ముగిసేలోపే సన్‌రైజర్స్‌ సగం లక్ష్యానికి చేరువైంది. 6 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 78 పరుగులు సాధించింది. 8.5 ఓవర్లలోనే 100 పరుగుల మైలురాయిని చేరుకుంది. హెడ్‌ నిష్క్రమణ తర్వాత సన్‌రైజర్స్‌ దూకుడు కాస్త తగ్గింది. కానీ హెడ్‌, మార్‌క్రమ్‌ రెండో వికెట్‌కు 60 పరుగులు జోడించడంతో సురక్షిత స్థానానికి చేరుకున్న సన్‌రైజర్స్‌పై అదేమంత ప్రభావం చూపలేదు. విజయానికి చేరువలో షాబాజ్‌, మార్‌క్రమ్‌ ఔటైనా.. క్లాసెన్‌, నితీశ్‌కుమార్‌ లాంఛనాన్ని పూర్తి చేశారు.

చెన్నై కష్టంగా..: టాస్‌ గెలిచి సన్‌రైజర్స్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా.. చెన్నై బ్యాటర్ల నుంచి మెరుపులు ఆశించిన అభిమానులకు నిరాశ తప్పలేదు. ఎడమచేతి వాటం స్పిన్నర్‌ అభిషేక్‌ శర్మ వేసిన తొలి ఓవర్లోనే ఓపెనర్లు రచిన్‌ రవీంద్ర (12; 9 బంతుల్లో 2×4), కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (26; 21 బంతుల్లో 3×4, 1×6) కష్టాలు కనిపించాయి. పిచ్‌ నెమ్మదిగా ఉండటం.. బంతి బ్యాటు మీదకి రాకపోవడంతో మొదటి ఓవర్లో 7 పరుగులే వచ్చాయి. అప్పుడప్పుడు మెరుపులు తప్పితే మ్యాచ్‌ ఆద్యంతం అలాగే సాగింది. సన్‌రైజర్స్‌ నుంచి ఏడుగురు బౌలర్లు అస్త్రాలు ఎక్కుపెట్టడంతో చెన్నై బ్యాటర్లు గుక్కతిప్పుకోలేకపోయారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఒత్తిడి పెంచడంతో రచిన్‌ రవీంద్ర భారీ షాట్‌కు ప్రయత్నించి నిష్క్రమించాడు. పవర్‌ ప్లేలో చెన్నై ప్రదర్శన (48/1) సాధారణంగా కనిపించింది. ఆ తర్వాత కూడా గైక్వాడ్‌, ఆజింక్య రహానె (35; 30 బంతుల్లో 2×4, 1×6) ఇన్నింగ్స్‌లో జోరు పెంచడంలో విఫలమయ్యారు. బంతి మిడిల్‌ కాకపోవడంతో భారీ షాట్లు ఆడలేకపోయారు. ఒత్తిడి పెరిగిపోవడంతో గైక్వాడ్‌ కూడా భారీ షాట్‌ ఆడబోయి వెనుదిరిగాడు. ఈ సమయంలో క్రీజులోకొచ్చిన శివమ్‌ దూబె మైదానంలో, చెన్నై శిబిరంలో జోష్‌ తీసుకొచ్చాడు. బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించాడు. దూబె.. భువనేశ్వర్‌ బౌలింగ్‌లో ఔటవగా.. అప్పటికి స్కోరు 13.4 ఓవర్లలో 119/3. దూబె తర్వాత చెన్నై ఇన్నింగ్స్‌ చప్పగా సాగింది. వన్డే మ్యాచ్‌ తరహాలో ఆడిన రహానె.. చివరికి ఉనద్కత్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆపై రవీంద్ర జడేజా (31 నాటౌట్‌; 23 బంతుల్లో 4×4) కొంచెం దూకుడుగా ఆడగా మిచెల్‌ (13; 11 బంతుల్లో 1×4) తీవ్రంగా తడబడ్డాడు. ఆఖరి అయిదు ఓవర్లలో చెన్నై 38 పరుగులు మాత్రమే చేసింది.

చెన్నై ఇన్నింగ్స్‌: రచిన్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) భువనేశ్వర్‌ 12; రుతురాజ్‌ (సి) సమద్‌ (బి) షాబాజ్‌ 26; రహానె (సి) మార్కండే (బి) ఉనద్కత్‌ 35; దూబె (సి) భువనేశ్వర్‌ (బి) కమిన్స్‌ 45; జడేజా నాటౌట్‌ 31; డరైల్‌ మిచెల్‌ (సి) సమద్‌ (బి) నటరాజన్‌ 13; ధోని నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 165; వికెట్ల పతనం: 1-25, 2-54, 3-119, 4-127, 5-160; బౌలింగ్‌: అభిషేక్‌శర్మ 1-0-7-0; భువనేశ్వర్‌ 4-0-28-1; నటరాజన్‌ 4-0-39-1; కమిన్స్‌ 4-0-29-1; మయాంక్‌ మార్కండే 2-0-21-0; షాబాజ్‌ అహ్మద్‌ 1-0-11-1; ఉనద్కత్‌ 4-0-29-1

హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: హెడ్‌ (సి) రచిన్‌ (బి) తీక్షణ 31; అభిషేక్‌ శర్మ (సి) జడేజా (బి) దీపక్‌ చాహర్‌ 37; మార్‌క్రమ్‌ ఎల్బీ (బి) అలీ 50; షాబాజ్‌ అహ్మద్‌ ఎల్బీ (బి) అలీ 18; క్లాసెన్‌ నాటౌట్‌ 10; నితీష్‌ కుమార్‌ రెడ్డి నాటౌట్‌ 14; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (18.1 ఓవర్లలో 4 వికెట్లకు) 166; వికెట్ల పతనం: 1-46, 2-106, 3-132, 4-141; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 3.1-0-32-1; ముకేశ్‌ చౌదరి 1-0-27-0; తీక్షణ 4-0-27-1; తుషార్‌ 2-0-20-0; జడేజా 4-0-30-0; మొయిన్‌ అలీ 3-0-23-2; రచిన్‌ 1-0-3-0

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని