Kane Williamson: హైదరాబాద్‌కు అలవోకగా రెండో విజయం

ఈ సీజన్‌ను పేలవంగా ఆరంభించిన హైదరాబాద్‌.. బలంగా పుంజుకుంటోంది. గత మ్యాచ్‌లో గెలుపు రుచి చూసిన ఆ జట్టు సోమవారం మరింతగా చెలరేగింది. హ్యాట్రిక్‌ విజయాలతో జోరుమీదున్న గుజరాత్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి తనను తక్కువ అంచనా వేసిన అందరినీ ఆశ్చర్యపరిచింది. మొదట బౌలర్లు సమష్టిగా సత్తా చాటి గుజరాత్‌ను ఓ మోస్తరు స్కోరుకు కట్టడి చేస్తే..

Updated : 12 Apr 2022 06:42 IST

మెరిసిన ఓపెనర్లు, బౌలర్లు

గుజరాత్‌కు తొలి ఓటమి

ఈ సీజన్‌ను పేలవంగా ఆరంభించిన హైదరాబాద్‌.. బలంగా పుంజుకుంటోంది. గత మ్యాచ్‌లో గెలుపు రుచి చూసిన ఆ జట్టు సోమవారం మరింతగా చెలరేగింది. హ్యాట్రిక్‌ విజయాలతో జోరుమీదున్న గుజరాత్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి తనను తక్కువ అంచనా వేసిన అందరినీ ఆశ్చర్యపరిచింది. మొదట బౌలర్లు సమష్టిగా సత్తా చాటి గుజరాత్‌ను ఓ మోస్తరు స్కోరుకు కట్టడి చేస్తే.. తర్వాత ఓపెనర్లు విలియమ్సన్‌, అభిషేక్‌ శర్మలతో పాటు పూరన్‌ చెలరేగి ఆడి హైదరాబాద్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు.

ముంబయి

హైదరాబాద్‌ గాడిన పడినట్లే కనిపిస్తోంది. ఈ సీజన్లో ఆ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం గుజరాత్‌పై అలవోకగా నెగ్గింది. మొదట గుజరాత్‌ 7 వికెట్లకు 162 పరుగులు చేసింది. హార్దిక్‌ పాండ్య (50 నాటౌట్‌; 42 బంతుల్లో 4×4, 1×6), అభినవ్‌ మనోహర్‌ (35; 21 బంతుల్లో 5×4, 1×6) రాణించారు. హైదరాబాద్‌ బౌలర్లలో నటరాజన్‌ (2/34), భువనేశ్వర్‌ (2/37) సత్తా చాటారు. అనంతరం ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ విలియమ్సన్‌ (57; 46 బంతుల్లో 2×4, 4×6), అభిషేక్‌ శర్మ (42; 32 బంతుల్లో 6×4), పూరన్‌ (34 నాటౌట్‌; 18 బంతుల్లో 2×4, 2×6) చెలరేగడంతో లక్ష్యాన్ని హైదరాబాద్‌ 5 బంతులు మిగిలుండగానే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

అలా మొదలై..:  హైదరాబాద్‌ ఛేదన మొదలైన తీరు చూస్తే.. ఆ జట్టు గెలుస్తుందని ఎవరూ అనుకుని ఉండరు. 4 ఓవర్లకు కేవలం 11 పరుగులే చేసిందా జట్టు. వికెట్‌ కోల్పోనప్పటికీ.. ఓపెనర్ల తడబాటు, గుజరాత్‌ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌ చూస్తే  హైదరాబాద్‌కు కష్టమే అనిపించింది. కానీ షమి వేసిన తర్వాతి ఓవర్లో విలియమ్సన్‌ వరుసగా 4, 6 బాదడంతో స్కోరు బోర్డులో కదలిక వచ్చింది. ఫెర్గూసన్‌ వేసిన ఆరో ఓవర్లో అభిషేక్‌ 5 బంతుల్లో 4 ఫోర్లు కొట్టడంతో ఒత్తిడి పూర్తిగా ఎగిరిపోయింది. తర్వాత గుజరాత్‌ బౌలర్లకు పెద్దగా అవకాశమే రాలేదు. రషీద్‌ బౌలింగ్‌లో (9వ ఓవర్‌) అభిషేక్‌ తొలి వికెట్‌ రూపంలో ఔటయ్యేసరికి స్కోరు 64. మధ్యలో కాస్త నెమ్మదించిన విలియమ్సన్‌.. సాధించాల్సిన రన్‌రేట్‌ పెరుగుతుండటంతో ఒక్కసారిగా షాట్లతో విరుచుకుపడ్డాడు. హార్దిక్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. జోరుమీదున్న రాహుల్‌ త్రిపాఠి (17) తెవాతియా బౌలింగ్‌లో సిక్సర్‌ బాదే క్రమంలో కాలు పట్టేసి రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగినా.. కేన్‌ జోరు కొనసాగించడంతో హైదరాబాద్‌ లక్ష్యం దిశగా పరుగులు పెట్టింది. అతను ఔటయ్యాక పూరన్‌ ఒక్కసారిగా చెలరేగిపోయాడు. అతను భారీ షాట్లతో విరుచుకుపడి గుజరాత్‌ను పోటీలో లేకుండా చేశాడు. నాల్కండే వేసిన చివరి ఓవర్‌ తొలి బంతికి సిక్సర్‌ బాదిన పూరన్‌ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

పడి లేచిన గుజరాత్‌: టాస్‌ గెలవడం.. బౌలింగ్‌ ఎంచుకోవడం.. ఈ టోర్నీలో దాదాపు ప్రతి మ్యాచ్‌లో ప్రతి జట్టూ చేస్తున్నదిదే. సోమవారం విలియమ్సన్‌ కూడా అదే చేశాడు. అతడి నిర్ణయం సరైందేనని రుజువు చేస్తూ బౌలర్లు చక్కటి ప్రదర్శనతో గుజరాత్‌ను కష్టాల్లోకి నెట్టారు. 108/4.. మొదట 14 ఓవర్లకు గుజరాత్‌ స్కోరిది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న గిల్‌ (7)ను ఇన్నింగ్స్‌ మూడో ఓవర్లోనే భువనేశ్వర్‌ పెవిలియన్‌ చేర్చి గుజరాత్‌ను గట్టి దెబ్బ కొట్టాడు. త్రిపాఠి అద్భుత క్యాచ్‌కు గిల్‌ వెనుదిరిగాడు. సాయి సుదర్శన్‌ (11), వేడ్‌ (19), మిల్లర్‌ (12).. ఈ ముగ్గురూ క్రీజులో కుదురుకుంటున్న దశలో ఔటైపోవడంతో బలమైన భాగస్వామ్యమే నమోదు కాలేదు. సుదర్శన్‌ను నటరాజన్‌ పెవిలియన్‌ చేరిస్తే.. వేడ్‌ను ప్రస్తుత మెగా టోర్నీలో అత్యంత వేగవంతమైన బౌలర్‌ అయిన ఉమ్రాన్‌ మాలిక్‌ (1/39) ఓ ఫాస్ట్‌ డెలివరీతో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. మిల్లర్‌ను జాన్సన్‌ ఔట్‌ చేశాడు. హార్దిక్‌ ఆరంభం నుంచి ఓ ఎండ్‌లో చక్కగా ఆడుతున్నా అతడికి సహకరించేవారు కరవయ్యారు. అయితే చివరి ఓవర్లలో మాత్రం హైదరాబాద్‌ పట్టు కోల్పోయింది. బౌలర్లు లయ తప్పారు. ఫీల్డింగ్‌ పేలవంగా తయారైంది. రెండు జీవన దానాలను సద్వినియోగం చేసుకున్న అభినవ్‌ మనోహర్‌ భారీ షాట్లతో విలువైన పరుగులు సాధించాడు. హార్దిక్‌ కూడా అంతే దూకుడుగా ఆడి ఉంటే గుజరాత్‌ ఇంకా ఎక్కువ స్కోరే చేసేది. చివర్లో అతను జోరు తగ్గించాడు. వికెట్లు కూడా పడటంతో గుజరాత్‌ ప్రత్యర్థికి ఓ మోస్తరు లక్ష్యాన్నే నిర్దేశించింది.


ఔరా.. త్రిపాఠి

గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్‌ గిల్‌ను భువనేశ్వర్‌ ఔట్‌ చేశాడు. అయితే ఈ వికెట్‌ ఘనత పూర్తిగా రాహుల్‌ త్రిపాఠికే చెందుతుంది. తాను ఆడిన షాట్‌ విషయంలో గిల్‌ను కూడా తప్పుబట్టడానికేమీ లేదు. అతను కవర్స్‌ వైపు ఖాళీ చూసే షాట్‌ ఆడగా.. సిల్లీ మిడాఫ్‌లో ఉన్న త్రిపాఠి ఎడమ వైపు దూకుతూ ఒంటి చేత్తో అద్భుత రీతిలో క్యాచ్‌ అందుకున్నాడు. ఈ సీజన్లో ఇది అత్యుత్తమ క్యాచ్‌ల్లో ఒకటనడంలో సందేహం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని