Delhi: దిల్లీ గర్జన.. చిత్తుగా ఓడిన పంజాబ్‌

ఇద్దరు క్రికెటర్లు సహా జట్టు బృందంలోని ఆరుగురికి కరోనా.. మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లంతా హోటల్‌ గదులకే పరిమితం.. సాధన లేదు.. పైగా కరోనా అలజడి! ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ దిల్లీ అదరగొట్టింది. మైదానంలో

Updated : 21 Apr 2022 07:50 IST

విజృంభించిన బౌలర్లు

చెలరేగిన వార్నర్‌, షా

ముంబయి

ఇద్దరు క్రికెటర్లు సహా జట్టు బృందంలోని ఆరుగురికి కరోనా.. మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లంతా హోటల్‌ గదులకే పరిమితం.. సాధన లేదు.. పైగా కరోనా అలజడి! ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ దిల్లీ అదరగొట్టింది. మైదానంలో అడుగుపెట్టిన తర్వాత ఆట తప్ప ఇంకేం గుర్తుకు రావంటూ చెలరేగింది. తగ్గేదేలేదంటూ పంజాబ్‌ను చిత్తుచేసింది. మొదట బౌలర్లు సమష్టిగా రాణించి ప్రత్యర్థిని దెబ్బకొడితే.. అనంతరం ఓపెనర్ల విధ్వంసంతో దిల్లీ అలవోకగా విజయాన్ని అందుకుంది.

81/0

టీ20 చరిత్రలో పవర్‌ప్లేలో దిల్లీకిదే అత్యధిక స్కోరు. 2008లో బెంగళూరుపై నమోదు చేసిన 71/0 రికార్డును ఇప్పుడు తిరగరాసింది.

టీ20 సీజన్‌లో దిల్లీకి  అదిరే విజయం. అన్ని రంగాల్లో ఆధిపత్యం చలాయించి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేసిన ఆ జట్టు బుధవారం 9 వికెట్ల తేడాతో పంజాబ్‌ను చిత్తుచేసింది. ప్రత్యర్థి బౌలర్ల ధాటికి పంజాబ్‌ మొదట 20 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో జితేశ్‌ శర్మ (32; 23 బంతుల్లో 5×4) టాప్‌స్కోరర్‌. అక్షర్‌ పటేల్‌ (2/10), లలిత్‌ యాదవ్‌ (2/11), ఖలీల్‌ అహ్మద్‌ (2/21), కుల్‌దీప్‌ యాదవ్‌ (2/24) సమష్టిగా సత్తాచాటారు. అనంతరం ఛేదనలో దిల్లీ ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి 10.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. వార్నర్‌ (60 నాటౌట్‌; 30 బంతుల్లో 10×4, 1×6) వరుసగా మూడో అర్ధశతకంతో చెలరేగగా.. పృథ్వీ షా (41; 20 బంతుల్లో 7×4, 1×6) విధ్వంసం సృష్టించాడు.

ధనాధన్‌.. దంచుడే: స్వల్ప ఛేదనలో దిల్లీ ఓపెనర్లు వార్నర్‌, పృథ్వీ షా చెలరేగారు. ఐపీఎల్‌ చరిత్రలోనే దిల్లీకి అత్యధిక పవర్‌ప్లే స్కోరు రికార్డు అందిస్తూ దొరికిన బంతిని దొరికినట్లు బాదారు. ప్రత్యర్థి బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా.. ఫీల్డర్లకు పనే లేకుండా.. బంతికి బౌండరీ మార్గాన్ని చూపించారు. ముందుగా పృథ్వీ బాదుడు మొదలెట్టగా.. ఆ తర్వాత వార్నర్‌ జోరందుకున్నాడు. దీంతో మూడు ఓవర్లకే 43/0తో విజయం ఖాయమైంది. వైభవ్‌ (0/31) బౌలింగ్‌లో అప్పర్‌ కట్‌ సిక్స్‌తో పృథ్వీ అలరించాడు. రబాడ (0/35) ఓవర్లో మూడు ఫోర్లతో వార్నర్‌ అదరగొట్టాడు. ఫ్లిక్‌ షాట్లతో బంతిని బౌండరీలు దాటించాడు. బౌలర్లు మారినా వీళ్ల బాదుడు ఆగలేదు. బౌలర్లపై కనీసం దయ లేకుండా విరుచుకుపడ్డారు. బంతి ఎక్కడ వేసినా అది చేరేది బౌండరీకే అన్నట్లు దంచికొట్టారు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికే దిల్లీ స్కోరు.. 81/0. ఆ వెంటనే షా విధ్వంసానికి రాహుల్‌ చాహర్‌ (1/21) ముగింపు పలికినప్పటికీ దిల్లీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. కరోనా సోకిన మిచెల్‌ మార్ష్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్‌ (12 నాటౌట్‌)తో కలిసి వార్నర్‌ మిగతా పని పూర్తి చేశాడు. రబాడ బౌలింగ్‌లో వార్నర్‌ కళ్లుచెదిరే సిక్సర్‌ కొట్టాడు. ఫోర్‌తో 26 బంతుల్లోనే అర్ధశతకం చేరుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్లోనే ఫోర్‌తో వార్నర్‌ లాంఛనం పూర్తి చేశాడు.

వికెట్ల పండగ..: అంతకుముందు పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో దిల్లీ బౌలర్లు వికెట్ల పండగ చేసుకున్నారు. ముఖ్యంగా స్పిన్నర్లు ఆ జట్టును ఉక్కిరిబిక్కిరి చేశారు. కుదరని కూర్పు, బ్యాటర్ల పేలవ షాట్‌ సెలక్షన్‌ కూడా పంజాబ్‌కు నష్టం చేసింది. టాప్‌ఆర్డర్‌ వైఫల్యంతో 54కే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లతో పాటు ప్రమాదకర లివింగ్‌స్టోన్‌ (2), బెయిర్‌ స్టో (9) పెవిలియన్‌కు వరుస కట్టారు. బౌలింగ్‌ మార్పులు కలిసి రావడంతో దిల్లీకి వరుస ఓవర్లలో వికెట్లు దక్కాయి. లలిత్‌ యాదవ్‌ వేసిన ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్లోనే ప్యాడల్‌ స్వీప్‌ ఆడబోయి ధావన్‌ (9) వికెట్‌కీపర్‌ చేతికి చిక్కాడు. ఆ వెంటనే ముస్తాఫిజుర్‌ (1/28) బంతిని వికెట్ల మీదకు ఆడుకుని మయాంక్‌ (24) నిష్క్రమించాడు. ఇక భీకర ఫామ్‌లో ఉన్న లివింగ్‌స్టోన్‌ (2).. అక్షర్‌ బంతిని అంచనా వేయలేక స్టంపౌటయ్యాడు. అలాంటి కష్ట సమయాల్లో జట్టును ఆదుకోవాల్సింది పోయి బెయిర్‌స్టో (9) బంతిని గాల్లోకి లేపి వెనుదిరిగాడు. ఆ దశలో షారుక్‌ (12)తో కలిసి ఇన్నింగ్స్‌ నిర్మించే బాధ్యతను జితేశ్‌ తీసుకున్నట్లు కనిపించాడు. వికెట్లు పడ్డా బౌండరీలతో స్కోరుబోర్డు వేగం తగ్గకుండా చూశాడు. దీంతో 10 ఓవర్లకు ఆ జట్టు 77/4తో నిలిచింది. ఆ జట్టుకు కుదురుకునే అవకాశం ఇవ్వకుండా బౌలర్లు మళ్లీ విజృంభించారు. 7 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు పడగొట్టారు. జితేశ్‌ వికెట్‌తో అక్షర్‌ కోలుకోలేని దెబ్బ కొట్టగా.. ఇక కుల్‌దీప్‌ ఒకే ఓవర్లో రెండు వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని వేగవంతం చేశాడు. భారీ షాట్లతో జట్టుకు కనీసం గౌరవప్రదమైన స్కోరు అందిస్తాడని ఆశలు పెట్టుకున్న షారుక్‌ ఇన్నింగ్స్‌ను ఖలీల్‌ ముగించడంతో పంజాబ్‌ పనైపోయింది. చివర్లో రాహుల్‌ చాహర్‌ (12) సిక్సర్‌తో స్కోరును 100 దాటించాడు. ఇన్నింగ్స్‌లో నమోదైన ఏకైక సిక్సర్‌ అదే. ఇన్నింగ్స్‌ చివరి బంతికి అర్ష్‌దీప్‌ రనౌట్‌తో జట్టు ఆలౌటైంది.

మాస్కులతో..

దిల్లీ బృందంలో కొవిడ్‌ కేసులు బయటపడ్డ నేపథ్యంలో.. బుధవారం మ్యాచ్‌ సందర్భంగా రెండు జట్ల ఆటగాళ్లు, సిబ్బంది జాగ్రత్త వహించారు. ఇరు జట్ల డగౌట్లలో కోచ్‌లు రికీ పాంటింగ్‌ (దిల్లీ), అనిల్‌ కుంబ్లే (పంజాబ్‌)లతో పాటు ఆటగాళ్లు, సహాయ సిబ్బంది మాస్కులు ధరించి కనిపించారు. మ్యాచ్‌ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం కూడా చేసుకోలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని