Corona: దిల్లీని వదలని కరోనా.. ఇంకో ఆటగాడికి కరోనా

సాఫీగా సాగిపోతున్న టోర్నీని కరోనా కలవర పెడుతోంది. తాజాగా దిల్లీ జట్టులో మరో ఆటగాడు పాజిటివ్‌గా తేలడంతో బుధవారం తీవ్ర అనిశ్చితి మధ్య పంజాబ్‌తో ఆ జట్టు మ్యాచ్‌ జరిగింది. బుధవారం ఉదయం

Updated : 21 Apr 2022 07:03 IST

(Photo: Tim Seifert Instagram)

ముంబయి: సాఫీగా సాగిపోతున్న టోర్నీని కరోనా కలవర పెడుతోంది. తాజాగా దిల్లీ జట్టులో మరో ఆటగాడు పాజిటివ్‌గా తేలడంతో బుధవారం తీవ్ర అనిశ్చితి మధ్య పంజాబ్‌తో ఆ జట్టు మ్యాచ్‌ జరిగింది. బుధవారం ఉదయం నిర్వహించిన యాంటిజెన్‌ పరీక్షలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ టిమ్‌ సీఫర్ట్‌ కరోనా బారిన పడ్డట్లు తేలింది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ తర్వాత ఆ జట్టులో పాజిటివ్‌గా తేలిన రెండో విదేశీ ఆటగాడు అతడు. మొత్తంగా దిల్లీ బృందంలో కరోనా సోకిన వారి సంఖ్య ఆరుకు పెరిగింది. ఆ జట్టు ఫిజియో ప్యాట్రిక్‌ ఫర్హత్‌, మసాజ్‌ థెరపిస్ట్‌ చేతన్‌ కుమార్‌, జట్టు వైద్యుడు అభిజిత్‌ సాల్వి, సోషల్‌ మీడియా కంటెంట్‌ టీమ్‌ సభ్యుడు ఆకాశ్‌ మానె పాజిటివ్‌ వచ్చిన ఇతరులు. సీఫర్ట్‌ ఫలితంతో దిల్లీ-పంజాబ్‌ మ్యాచ్‌ షెడ్యూలు ప్రకారం జరగడంపై అనుమానాలు తలెత్తాయి. మ్యాచ్‌ను మరో రోజుకు మార్చే అంశాన్ని నిర్వాహకులు పరిశీలించినట్లు కూడా వార్తలొచ్చాయి. అయితే దిల్లీ జట్టులో మిగతా సభ్యులందరికీ నెగెటివ్‌ రావడంతో.. షెడ్యూలు ప్రకారమే మ్యాచ్‌ను నిర్వహించాలని చివరికి బీసీసీఐ నిర్ణయించింది. ‘‘మొత్తం దిల్లీ బృందానికి అంతటికీ బుధవారం రెండు రౌండ్ల పాటు కరోనా పరీక్షలు నిర్వహంచారు. పంజాబ్‌తో బుధవారం ఆ జట్టు ఆడాల్సిన మ్యాచ్‌ షెడ్యూలు ప్రకారమే జరుగుతుంది’’ అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. నిబంధనల ప్రకారం ఏ జట్టులో కరోనా కేసులు ఎక్కువగా వచ్చినా మ్యాచ్‌ను కొనసాగించవచ్చు. కానీ ఏడుగురు భారతీయులు సహా 12 మంది ఆటగాళ్లు మ్యాచ్‌కు అందుబాటులో ఉండాలి. కనీస ఆటగాళ్లు అందుబాటులో లేకపోతే మ్యాచ్‌ను రీషెడ్యూలు చేసే వీలుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం కరోనా సోకిన ఆటగాడు కనీసం ఏడు రోజులు ఐసోలేషన్‌లో ఉండాలి. ఆరు, ఏడో రోజుల్లో అతడికి పరీక్షలు నిర్వహిస్తారు. అతడు తిరిగి బయో బబుల్‌లో అడుగుపెట్టాలంటే 24 గంటల విరామంతో నిర్వహించే రెండు ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షల్లో నెగెటివ్‌ రావాలి. సీఫర్ట్‌కు గత సీజన్‌లో కూడా పాజిటివ్‌ వచ్చింది. అప్పుడు అతడు కోల్‌కతాతో ఉన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని