CWG 2022: మన నిఖత్‌ బంగారం

కామన్వెల్త్‌ క్రీడల్లో కుస్తీ యోధుల అద్భుత ప్రదర్శన తర్వాత బాక్సింగ్‌ వీరులు ప్రతాపం చూపించారు. ఒకే రోజు మూడు స్వర్ణాలతో అదరగొట్టారు. ప్రపంచ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్‌.. జోరు కొనసాగిస్తూ బర్మింగ్‌హామ్‌లోనూ స్వర్ణం చేజిక్కించుకుంది. మరో అగ్రశ్రేణి భారత బాక్సర్‌ అమిత్‌ ఫంగాల్‌, యువ క్రీడాకారిణి నీతూ గంగాస్‌ల పంచ్‌లకు సైతం పసిడి దక్కింది.

Updated : 08 Aug 2022 03:58 IST

కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం

అమిత్‌, నీతులకూ పసిడి పతకాలు

కామన్వెల్త్‌ క్రీడల్లో కుస్తీ యోధుల అద్భుత ప్రదర్శన తర్వాత బాక్సింగ్‌ వీరులు ప్రతాపం చూపించారు. ఒకే రోజు మూడు స్వర్ణాలతో అదరగొట్టారు. ప్రపంచ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్‌.. జోరు కొనసాగిస్తూ బర్మింగ్‌హామ్‌లోనూ స్వర్ణం చేజిక్కించుకుంది. మరో అగ్రశ్రేణి భారత బాక్సర్‌ అమిత్‌ ఫంగాల్‌, యువ క్రీడాకారిణి నీతూ గంగాస్‌ల పంచ్‌లకు సైతం పసిడి దక్కింది. ట్రిపుల్‌ జంప్‌లో స్వర్ణ, రజత పతకాలు రెండూ భారత అథ్లెట్లు ఎల్దోస్‌ పాల్‌, అబ్దుల్లాలకే  చేజిక్కాయి. ఈ క్రీడల్లో భారత్‌ పతకాల అర్ధసెంచరీని అందుకుంది. పోటీలకు సోమవారమే ఆఖరి రోజు.

బర్మింగ్‌హామ్‌

దేశంలో ప్రస్తుతం అత్యుత్తమ మహిళా బాక్సర్‌ తానే అని తెలంగాణ అమ్మాయి నిఖత్‌ జరీన్‌ మరోసారి చాటి చెప్పింది. మేరీకోమ్‌ పోటీ పడే విభాగంలో ఆడుతూ రెండు నెలల కిందటే ప్రపంచ ఛాంపియన్‌ అయిన నిఖత్‌.. ప్రపంచ వేదికపై మళ్లీ మెరిసింది. కామన్వెల్త్‌ క్రీడల 50 కేజీల విభాగంలో ఆమె స్వర్ణం కొల్లగొట్టింది. ఆదివారం ఏకపక్షంగా సాగిన ఫైనల్‌ బౌట్‌లో నిఖత్‌ 5-0తో కార్లీ మెక్‌నాల్‌ (నార్తర్న్‌ ఐర్లాండ్‌)ను చిత్తు చేసింది. బౌట్‌ ఆద్యంతం నిఖత్‌దే ఆధిపత్యం. సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ ఆమె.. కార్లీపై అదను చూసి పంచ్‌లు కురిపించగా, ఒక వ్యూహం లేకుండా ప్రత్యర్థి దాడి చేసేందుకు ప్రయత్నించి విఫలమైంది. ప్రశాంతంగా పంచ్‌లు విసురుతూ పాయింట్లు సాధించిన నిఖత్‌ను న్యాయ నిర్ణేతలు ఏకగ్రీవ విజేతగా ప్రకటించారు. ఇక గత పర్యాయం ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకున్న అమిత్‌ ఈసారి పసిడిని వదిలిపెట్టలేదు. 51 కేజీల విభాగం ఫైనల్లో 26 ఏళ్ల అమిత్‌ 5-0 తేడాతో ఇంగ్లాండ్‌ బాక్సర్‌ కియారన్‌ మెక్‌డొనాల్డ్‌ను చిత్తు చేశాడు. దూకుడుకు మారుపేరైన అమిత్‌.. ఫైనల్లో విరామం లేకుండా పంచ్‌ల వర్షం కురిపించడంతో ప్రత్యర్థి ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఇక కామన్వెల్త్‌ క్రీడల్లో తొలిసారి పోటీ పడ్డ నీతు 48 కేజీల విభాగంలో స్వర్ణం గెలిచి అబ్బురపరిచింది. ఆమె 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ కాంస్య విజేత డెమీ జేడ్‌ (ఇంగ్లాండ్‌)ను 5-0తో మట్టికరిపించింది.

సాగర్‌కు రజతం: అర్ధరాత్రి దాటాక బాక్సింగ్‌లో భారత్‌కు మరో రజతం దక్కింది. 92+ కేజీల విభాగంలో సాగర్‌ అహ్లావత్‌ 0-5 తేడాతో డెలిషియస్‌ ఓరీ చేతిలో ఓడాడు.

ఎల్దోస్‌ రికార్డు స్వర్ణం: కామన్వెల్త్‌ క్రీడల అథ్లెటిక్స్‌లో ఈసారి భారత క్రీడాకారులు అంచనాలను మించి రాణించారు. ఇప్పటికే ఈ పోటీల్లో భారత్‌కు 5 పతకాలు దక్కగా.. ఆదివారం మరో మూడు పతకాలు సొంతమయ్యాయి. అందులో ఓ స్వర్ణం కూడా ఉండడం విశేషం. కామన్వెల్త్‌ క్రీడల ట్రిపుల్‌ జంప్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారత క్రీడాకారుడిగా ఎల్దోస్‌ పాల్‌ రికార్డు నెలకొల్పాడు. అతను తన మూడో ప్రయత్నంలో 17.03 మీటర్లు దూకి అగ్రస్థానంలో నిలిచాడు. మరో భారత అథ్లెట్‌ అబ్దుల్లా అబుబాకర్‌ 17.02 మీటర్ల ప్రదర్శనతో రజతం సొంతం చేసుకున్నాడు. పెరిన్‌చీఫ్‌ (బెర్ముడా-16.92 మీ) మూడో స్థానంలో నిలిచాడు. మరో భారత అథ్లెట్‌ ప్రవీణ్‌ చిత్రవేల్‌ 16.89 మీ.తో నాలుగో స్థానంలో నిలిచాడు. తన అత్యుత్తమ ప్రదర్శన (17.18 మీ)ను అతను అందుకుని ఉంటే మూడు పతకాలు భారత్‌కే సొంతమయ్యేవి. కామన్వెల్త్‌ క్రీడల ట్రిపుల్‌ జంప్‌లో ఇద్దరు భారత క్రీడాకారులు ఒకేసారి పతకాలు గెలవడం ఇదే తొలిసారి. మొత్తంగా ఈసారి అథ్లెటిక్స్‌లో భారత్‌కు 8 పతకాలు (1 స్వర్ణం, 4 రజతాలు, 3 కాంస్యాలు) దక్కాయి. 2010లో స్వదేశంలో జరిగిన క్రీడల్ని మినహాయిస్తే.. విదేశాల్లో జరిగిన కామన్వెల్త్‌ క్రీడల అథ్లెటిక్స్‌లో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. మరోవైపు మహిళల జావెలిన్‌ త్రోలో పతకం నెగ్గిన తొలి భారత క్రీడాకారిణిగా జావెలిన్‌ త్రోయర్‌ అన్ను రాణి రికార్డులకెక్కింది. ఆమె 60 మీటర్ల దూరం ఈటెను విసిరి కాంస్యం దక్కించుకుంది. తన పేరిట ఉన్న జాతీయ రికార్డు (63.82 మీ) కంటే తక్కువ ప్రదర్శనతోనే ఆమె పతకం సాధించింది. ఆస్ట్రేలియాకు చెందిన ప్రపంచ ఛాంపియన్‌ లీ బార్బర్‌ (6.443 మీ), లిటిల్‌ (64.27) వరుసగా స్వర్ణం, రజతం నెగ్గారు.

సందీప్‌కు రేస్‌వాక్‌ కాంస్యం: 10 వేల మీటర్ల రేస్‌వాక్‌లో సందీప్‌ కుమార్‌ కాంస్యం గెలిచాడు. ఫైనల్లో సందీప్‌ 38 నిమిషాల 49.21 సెకన్లలో లక్ష్యాన్ని చేరి మూడో స్థానంలో నిలిచాడు.

భవీనాకు స్వర్ణం.. సోనాల్‌కు కాంస్యం: పారా టేబుల్‌ టెన్నిస్‌లో భవీనా పటేల్‌ స్వర్ణంతో మెరిసింది. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ఆమె 3-0తో క్రిస్టియానా (నైజీరియా)ను ఓడించింది. మరో భారత ప్యాడ్లర్‌ సోనాల్‌బెన్‌ పటేల్‌ కాంస్యం గెలుచుకుంది. కాంస్య పోరులో సోనాల్‌బెన్‌ 3-0తో సూ బెయిలీ (ఇంగ్లాండ్‌)పై గెలిచింది.

పల్లికల్‌ జోడీకి కాంస్యం: స్క్వాష్‌లో దీపిక పల్లికల్‌-సౌరభ్‌ ఘోషల్‌ కాంస్య పతకం గెలిచారు. కాంస్య పతక పోరులో దీపిక జంట 11-8, 11-4తో లొబాన్‌-పీలీ (ఆస్ట్రేలియా)ను ఓడించారు.


కామన్వెల్త్‌లో ఈనాడు

బ్యాడ్మింటన్‌: సింధు × మిచెలీ లీ, మహిళల సింగిల్స్‌ ఫైనల్‌ (మ.1.20 నుంచి), లక్ష్యసేన్‌ × జె యంగ్‌, పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ (మ.2.10 నుంచి), సాత్విక్‌-చిరాగ్‌, పురుషుల డబుల్స్‌ ఫైనల్‌ (మ.3.50 నుంచి)

టేబుల్‌టెన్నిస్‌: శరత్‌కమల్‌, పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ (మ.3.30 నుంచి)

హాకీ: భారత్‌ × ఆస్ట్రేలియా (సా.5 నుంచి)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని