నెట్స్‌లోనూ ఆమెది అదే జోరు: మిథాలి

నెట్స్‌లో బౌలింగ్‌ చేసేటప్పుడు కూడా జులన్‌ గోస్వామిని ఎదుర్కోవడం కష్టమయ్యేదని బరిలో దిగితే ఆమె అంకితభావం అలా ఉండేదని భారత మాజీ స్టార్‌ మిథాలిరాజ్‌ చెప్పింది. ‘‘జులన్‌, నేనూ ఒకే వయసు వాళ్లం.

Published : 25 Sep 2022 03:20 IST

దిల్లీ: నెట్స్‌లో బౌలింగ్‌ చేసేటప్పుడు కూడా జులన్‌ గోస్వామిని ఎదుర్కోవడం కష్టమయ్యేదని బరిలో దిగితే ఆమె అంకితభావం అలా ఉండేదని భారత మాజీ స్టార్‌ మిథాలిరాజ్‌ చెప్పింది. ‘‘జులన్‌, నేనూ ఒకే వయసు వాళ్లం. ఒకరికొకరు స్వేచ్ఛగా మాట్లాడుకోవడానికి, అభిప్రాయాలు పంచుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఏ క్షణంలోనైనా ఆమెతో మాట్లాడే అవకాశం ఉండేది. ఇక మైదానంలో దిగితే జులన్‌ హుషారే వేరు. పేసర్‌ కావడం వల్లనేమో చాలా దూకుడుగా ఉండేది. నెట్స్‌లో బౌలింగ్‌ చేసేటప్పుడు కూడా అదే జోరు ప్రదర్శించేది. చాలాసార్లు ఆమె బౌలింగ్‌లో ఇబ్బందిపడేదాన్ని. ఎందుకు ఇంత వేగంగా బౌలింగ్‌ చేస్తున్నావ్‌.. నేను మీ జట్టు సభ్యురాలిని అని సరదాగా గుర్తు చేసేదాన్ని. దేశవాళీ క్రికెట్లో పరస్పరం ఎదురుపడినప్పుడు కూడా జులన్‌ ఇలాగే దూకుడుగా బౌలింగ్‌ చేసేది. రైల్వేస్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ బెంగాల్‌పై ఆడినప్పుడు ఒకసారి వరుస పెట్టి బౌన్సర్లు వేసింది. నేను ఆ సమయంలో హెల్మెట్‌ పెట్టుకోలేదు. హెల్మెట్‌ పెట్టుకో అని కూడా సలహా ఇచ్చింది. స్వింగ్‌ బౌలింగ్‌తో పాటు కటర్స్‌ ఆమె బలం. మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు జులన్‌ ఒక్క చెత్త బంతి కూడా వేసేది కాదు. బ్యాటర్‌గానూ నాతో కలిసి ఎన్నో విలువైన ఇన్నింగ్స్‌లు ఆడింది’’ అని మిథాలి గుర్తు చేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని