రొనాల్డో జట్టు శుభారంభం

ప్రపంచకప్‌లో పోర్చుగల్‌ శుభారంభం చేసింది. గురువారం గ్రూప్‌-హెచ్‌లో ఆసక్తికరంగా జరిగిన మ్యాచ్‌లో 3-2 గోల్స్‌తో ఘనాపై విజయం సాధించింది

Updated : 25 Nov 2022 07:47 IST

దోహా: ప్రపంచకప్‌లో పోర్చుగల్‌ శుభారంభం చేసింది. గురువారం గ్రూప్‌-హెచ్‌లో ఆసక్తికరంగా జరిగిన మ్యాచ్‌లో 3-2 గోల్స్‌తో ఘనాపై విజయం సాధించింది. తొలి అర్ధభాగంలో రెండు జట్లూ గోల్స్‌ కొట్టలేదు. పోర్చుగల్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శించినా.. ఘనా డిఫెన్స్‌ బలంగా నిలబడింది. పోర్చుగల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో రెండు అవకాశాలను వృథా చేశాడు. అయితే రెండు జట్లు దూకుడు ప్రదర్శించడంతో ద్వితీయార్ధం రసవత్తరంగా సాగింది. చకచకా గోల్స్‌ పడ్డాయి. 65వ నిమిషంలో పెనాల్టీని సద్వినియోగం చేసిన రొనాల్డో.. పోర్చుగల్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. అయితే కాసేపటికే ఘనా.. పోర్చుగల్‌కు షాకిచ్చింది. అయూ (73వ) గోల్‌తో ఆ జట్టు స్కోరు సమం చేసింది. కానీ ఘనా సంతోషం ఎంతోసేపు నిలవలేదు. చకచకా రెండు గోల్స్‌ కొట్టిన పోర్చుగల్‌ 3-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 78వ నిమిషంలో ఫెలిక్స్‌, 80వ నిమిషంలో రఫెల్‌ గోల్స్‌ కొట్టారు. కానీ ఘనా ఆశలు కోల్పోలేదు. అంత తేలిగ్గా వదల్లేదు. ఆ జట్టు 89వ నిమిషంలో బుకారి గోల్‌తో పోర్చుగల్‌ ఆధిక్యాన్ని తగ్గించింది. అయిదు ప్రపంచకప్‌ల్లో గోల్‌ కొట్టిన తొలి ఆటగాడిగా  రొనాల్డో రికార్డు సృష్టించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని