తమవాడే ఓడించాడు

తమ దేశంలో పుట్టినవాడే ప్రత్యర్థిగా మారి ఓటమికి కారణమైతే ఆ జట్టుకు ఎలా ఉంటుంది? స్విట్జర్లాండ్‌పై పోరాడి తలొంచిన కామెరూన్‌ది ఇదే పరిస్థితి.

Published : 25 Nov 2022 02:22 IST

కామెరూన్‌పై స్విస్‌ గెలుపు

అల్‌ వాక్రా (ఖతార్‌): తమ దేశంలో పుట్టినవాడే ప్రత్యర్థిగా మారి ఓటమికి కారణమైతే ఆ జట్టుకు ఎలా ఉంటుంది? స్విట్జర్లాండ్‌పై పోరాడి తలొంచిన కామెరూన్‌ది ఇదే పరిస్థితి. కామెరూన్‌లో జన్మించి తమ దేశానికి ఆడుతున్న బ్రీల్‌ ఎంబొలో చేసిన ఏకైక గోల్‌తో ఫిఫా ప్రపంచకప్‌లో స్విట్జర్లాండ్‌ బోణీ కొట్టింది. గురువారం గ్రూప్‌-జి పోరులో ఆ జట్టు 1-0తో కామెరూన్‌పై నెగ్గింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలి అర్ధభాగంలో ఆఫ్రికా జట్టుదే పైచేయి. ఎక్కువ శాతం బంతిని అధీనంలో ఉంచుకుంటూ మెరుపు దాడులతో ఈ జట్టు ప్రత్యర్థిని కలవరపెట్టింది. కానీ ఫినిషింగ్‌ లోపించడంతో స్కోరు చేయలేకపోయింది. పదో నిమిషంలో బ్రెయాన్‌ కొట్టిన శక్తివంతమైన షాట్‌ని కష్టపడి అడ్డుకున్న స్విస్‌ గోల్‌కీపర్‌ యాన్‌.. కాసేపటికే మాక్సిమ్‌ మెరుపు కిక్‌ని కూడా ఆపేశాడు. ద్వితీయార్థంలో స్విట్జర్లాండ్‌ పుంజుకుంది. పటిష్టమైన డిఫెన్స్‌తో ప్రత్యర్థిని కాచుకుంటూనే ఎటాకింగ్‌కు దిగింది. ఈ దాడులకు స్విస్‌ త్వరగానే ఫలితం సాధించింది. 48వ నిమిషంలో కార్నర్‌ నుంచి హెర్డాన్‌ పాస్‌ను అందుకున్న ఎంబొలో.. ఆలస్యం చేయకుండా బంతిని నెట్‌లోకి పంపేశాడు. గోల్‌ కొట్టినా సంబరాలు చేసుకోకుండా అతడు రెండు చేతులు పైకెత్తి కామెరూన్‌ అభిమానులను చూస్తూ ‘క్షమించండి’ అన్నట్లుగా సంకేతం ఇచ్చాడు. ఈ గోల్‌తో కామెరూన్‌ ఢీలా పడింది. డిఫెన్స్‌ బలహీనంగా మారడంతో పదే పదే ప్రత్యర్థి గోల్‌ ప్రాంతంలోకి చొచ్చుకొచ్చిన స్విస్‌ ఆటగాళ్లు పలు గోల్‌ అవకాశాలను సృష్టించుకున్నారు. కానీ బంతిని నెట్‌లోకి మాత్రం పంపలేకపోయారు. ఆధిపత్యాన్ని కొనసాగించిన స్విస్‌.. విజయాన్ని సొంతం చేసుకుంది. 2002 తర్వాత ప్రపంచకప్‌లో కామెరూన్‌ ఒక్క మ్యాచూ గెలవలేకపోయిౖంది. గత 5 కప్పుల నుంచి తొలి మ్యాచ్‌లో గెలుస్తున్న సంప్రదాయాన్ని స్విట్జర్లాండ్‌ కొనసాగించింది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని