IND vs NZ: ‘‘అతడిని చూస్తూ ఉండండి.. మున్ముందు మాయ చేస్తాడు’’

ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌ పేరు మార్మోగింది. ఎందుకంటే.. ఈ మెగా లీగ్‌లో అతడు అత్యధిక పరుగులు (635) చేసిన ఆటగాడిగా నిలిచి.. సీఎస్కే నాలుగోసారి ఛాంపియన్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు.

Published : 18 Nov 2021 01:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌ పేరు మార్మోగింది. ఎందుకంటే.. ఈ మెగా లీగ్‌లో అతడు అత్యధిక పరుగులు (635) చేసిన ఆటగాడిగా నిలిచి.. సీఎస్కే నాలుగోసారి ఛాంపియన్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని సెలెక్టర్లు అతడిని న్యూజిలాండ్‌తో జరిగే మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కి ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలోనే రుతురాజ్‌ గైక్వాడ్‌పై ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్‌ గ్రేమ్‌ స్వాన్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో గైక్వాడ్‌ ఆడుతుంటే చూడాలని ఉందన్నాడు. ఐపీఎల్‌లో తాను చూసిన మంచి ఇన్నింగ్స్‌ల్లో గైక్వాడ్ ఆడినవి కొన్ని ఉన్నాయని స్వాన్ పేర్కొన్నాడు. భవిష్యత్తులో రుతురాజ్ మంచి ఆటగాడిగా మారబోతున్నాడని మైక్ హస్సీ కొన్నేళ్ల కిందటే తనతో చెప్పాడని గ్రేమ్ స్వాన్ వెల్లడించాడు.

"చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాళ్లలో రుతురాజ్‌ గైక్వాడ్‌ ప్రత్యేకమైనవాడు. ఐపీఎల్‌లో నేను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌ల్లో అతడు ఆడినవి కొన్ని ఉన్నాయి. అబుదాబిలో గైక్వాడ్‌ సెంచరీ చేయడం సంచలనం. న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు అతడు ఎంపికైనందుకు సంతోషిస్తున్నా. రుతురాజ్ గైక్వాడ్‌ ఒక సంపూర్ణమైన ఆటగాడిగా మారబోతున్నాడని మైక్‌ హస్సీ నాతో కొన్నేళ్ల క్రితం చెప్పాడు. అతడిని చూస్తూ ఉండండి.. మున్ముందు మాయ చేస్తాడు. గైక్వాడ్‌ 10 మార్కులకుగాను 9 మార్కులు సాధించాడు. ఇంకా రాటుదేలుతున్నాడు’’ అని ఇంగ్లాండ్‌ మాజీ స్పిన్నర్‌ వివరించాడు. 

ఇప్పటివరకు తన కెరీర్‌లో నిలకడగా ఫామ్‌లో లేని శ్రేయస్ అయ్యర్.. ఇప్పుడు తానెంటో నిరూపించుకోవాల్సి ఉందని స్వాన్ అన్నాడు. ‘‘శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేస్తుంటే చూడటం అద్భుతంగా ఉంటుంది. కానీ, అతడు నిలకడగా మంచి ప్రదర్శనలు చేయలేదు. కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఉన్నా..  మరికొన్ని బలహీనమైన ప్రదర్శనలూ ఉన్నాయి. నేనైతే శ్రేయస్‌ ఆటకు ఎనిమిది మార్కులు వేస్తా. కానీ, అతడు సులభంగా 10 మార్కులు అందుకోగలడు’ అని గ్రేమ్ స్వాన్ ముగించాడు.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని