Virat Kohli: ఇది వరల్డ్‌ కప్‌ సంవత్సరం.. అద్భుత ప్రదర్శన ఇవ్వడం శుభసూచికం: విరాట్

ఇదే ప్రపంచకప్‌  (ODI World Cup) ఏడాది. ప్రతి మ్యాచ్‌ ఫలితం ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడం ఖాయం. వ్యక్తిగత ప్రదర్శనతో అదరగొడితే.. మెగా టోర్నీలోనూ రాణించే అవకాశాలు మెండుగా ఉంటాయి. ప్రస్తుతం టీమ్‌ఇండియా (Team India) టాప్‌ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) కూడా సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు.

Updated : 16 Jan 2023 11:54 IST

ఇంటర్నెట్ డెస్క్: తొలుత బ్యాటర్లు.. తర్వాత బౌలర్లు చెలరేగడంతో వన్డే చరిత్రలోనే భారీ తేడాతో విజయం సాధించిన జట్టుగా టీమ్‌ఇండియా అవతరించింది. శ్రీలంకతో మూడో వన్డేలో 317 పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించింది. స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ (166*: 110  బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్స్‌లు)తోపాటు యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్ (116: 97 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో అదరగొట్టారు. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసేసింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌తోపాటు ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డులను సొంతం చేసుకొన్నాడు. ఈ సిరీస్‌లో కోహ్లీ రెండు శతకాలు బాదడం విశేషం. ఈ ఏడాదిలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌నకు ముందు ఆటగాళ్లు మంచి ప్రదర్శన ఇవ్వడం బాగుందని విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు.

‘‘మహమ్మద్‌ షమీ, సిరాజ్‌ అద్భుతంగా బౌలింగ్‌ వేశారు. కొత్త బంతితో ప్రత్యర్థిని కట్టడి చేయడంలో సఫలీకృతులయ్యారు. మరీ ముఖ్యంగా సిరాజ్‌ పవర్‌ప్లే ఓవర్లలో వికెట్లను తీస్తున్నాడు. ప్రత్యర్థి బ్యాటర్లు ఆచితూచి ఆడేలా చేయడంలో సిరాజ్‌ సక్సెస్‌ అయ్యాడు. ప్రపంచకప్‌ నేపథ్యంలో ఇలాంటి ప్రదర్శన జట్టుకు నైతికంగా బలాన్నిస్తుంది. ఇదో శుభసూచికంగా  అనుకోవచ్చు’’ అని విరాట్ కోహ్లీ తెలిపాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 487 మ్యాచ్‌లకుగాను 20 మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్‌లను కోహ్లీ అందుకొన్నాడు. దీంతో సచిన్‌తో (664 మ్యాచుల్లో 20) సమంగా నిలిచాడు. దీనిపై కోహ్లీ స్పందిస్తూ.. ‘‘ఇలాంటి రికార్డుల గురించి పెద్దగా ఆలోచించలేదు. నా నుంచి వచ్చిన ప్రదర్శనల వల్లే ఇన్ని ప్లేయర్‌ ఆఫ్ ది సిరీస్‌లు వచ్చాయి.’’ అని చెప్పాడు.

మూడో వన్డేలో శ్రీలంక టాప్ ఆర్డర్‌లోని ముగ్గురు ఆటగాళ్లను సిరాజ్‌ పెవిలియన్‌కు చేర్చాడు. తన పది ఓవర్ల కోటాలో కేవలం 32 పరుగులు మాత్రమే ఇచ్చిన సిరాజ్‌ నాలుగు వికెట్లను పడగొట్టాడు. మూడు వన్డేల సిరీస్‌లో నామమాత్రమైన చివరి మ్యాచ్‌లో టాస్‌ నెగ్గిన రోహిత్ బ్యాటింగ్‌ ఎంచుకొన్నాడు. విరాట్, గిల్‌ శతకాలు సాధించడంతో 50 ఓవర్లలో భారత్‌ ఐదు వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో 73 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో నువనిదు ఫెర్నాండో (19)దే అత్యధిక స్కోరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని