WPL: భయపెట్టిన జార్జియా.. ఎట్టకేలకు గుజరాత్‌ బోణీ

మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 19 పరుగుల తేడాతో గెలుపొందింది.

Updated : 06 Mar 2024 22:58 IST

దిల్లీ: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL) రెండో సీజన్‌లో ఎట్టకేలకు గుజరాత్‌ జెయింట్స్‌ (Gujarat Gaints) ఓటముల పరంపర నుంచి బయటపడింది. తన ఐదో మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB)ను 19 పరుగుల తేడాతో ఓడించి తొలి విజయాన్ని నమోదు చేసింది. 200 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. ఆ జట్టు ఓటమి దిశగా సాగుతున్న తరుణంలో జార్జియా వేర్‌హమ్‌ (48: 22 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అనూహ్యంగా చెలరేగడంతో గుజరాత్‌ శిబిరం ఒకింత ఆందోళనకు గురైంది. అయితే 19 ఓవర్‌ చివరి బంతికి జార్జియా రనౌట్‌ కావడంతో గుజరాత్‌ ఊపిరిపీల్చుకుంది. రిచా ఘోష్‌ (30), స్మృతి మంధాన (24), ఎలిస్‌ పెర్రీ (24), సోఫీ డివైన్‌ (23) విలువైన పరుగులు చేశారు. గుజరాత్‌ బౌలర్లలో ఆష్లే గార్డెనర్‌ రెండు వికెట్లు తీసింది. 

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్లు లారా వోల్వార్డ్ట్ (76; 45 బంతుల్లో 13 ఫోర్లు), బెత్‌ మూనీ (85*; 51 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌) బౌండరీలతో విరుచుకుపడ్డారు. ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచే వోల్వార్డ్ట్, బెత్‌ మూనీ ఎడాపెడా బౌండరీల వర్షం కురిపించారు. దీంతో ఐదు ఓవర్లకే స్కోరు 54/0కి చేరింది. తర్వాత కూడా వీరి దూకుడు కొనసాగింది. పెర్రీ బౌలింగ్‌లో వోల్వార్డ్ట్ వరుసగా మూడు ఫోర్లు బాది అర్ధ శతకం (32 బంతుల్లో) పూర్తి చేసుకుంది. మూనీ సైతం 32 బంతుల్లోనే 50 పరుగుల మార్కును అందుకుంది. ఆర్సీబీ బౌలర్లలో సోఫియా, జార్జియా వేర్‌హమ్‌ చెరో వికెట్ పడగొట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని