Ruturaj Gaikwad: ఐర్లాండ్‌తో తొలి పోరులో రుతురాజ్ ఎందుకు ఆడలేదంటే?

ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ తుది జట్టులో ఉన్నా ఓపెనర్‌గా రాకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది...

Published : 28 Jun 2022 02:06 IST

డబ్లిన్‌: ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ తుది జట్టులో ఉన్నా ఓపెనర్‌గా రాకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అతడి స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన దీపక్‌ హుడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. 47 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఓపెనింగ్‌ కూడా చేయగలనని నిరూపించుకున్నాడు. అయితే, రుతురాజ్‌ను ఎందుకు ఓపెనర్‌గా పంపలేదనే విషయం ఎవరికీ అర్థంకాలేదు. మ్యాచ్‌ అనంతరం ఈ విషయంపై స్పందించిన కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య.. రుతురాజ్‌ కాళ్ల కండరాల్లో ఇబ్బంది పడుతుండటంతో ఓపెనింగ్‌కు పంపలేదని స్పష్టం చేశాడు.

‘రుతురాజ్‌ కాలి కండరాల్లో నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. అతడిని ఓపెనింగ్‌ చేయించి రిస్క్‌ తీసుకునే అవకాశం మాకు ఉంది. కానీ, అది నాకు ఇష్టంలేదు. ఆటగాడి బాగోగులే నాకు అన్నిటికన్నా ముఖ్యం. దీంతో అతడు ఆడకున్నా.. మ్యాచ్‌లో ఏం జరిగినా మేం రాణిస్తామనే నమ్మకం ఉంది. ఆ విషయంలో పెద్దగా ఆలోచించాల్సిన పనిలేకపోయింది. దీంతో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రతి ఒక్కరూ ఒక్కో స్థానం పైకి వచ్చారు’ అని హార్దిక్‌ వివరించాడు.

అనంతరం యువ పేసర్‌, అరంగేట్రం ఆటగాడు ఉమ్రాన్‌ మాలిక్‌పై స్పందించిన అతడు.. ఏ ఆటగాడైనా టీమ్‌ఇండియాకు ఆడటమే గొప్ప విశేషమని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో ఉమ్రాన్‌ మంచి ప్రదర్శన చేశాడా లేదా అనేది ముఖ్యం కాదని, టీమ్‌ఇండియా తరఫున ఆడటమే అన్నిటికన్నా ముఖ్యమని చెప్పాడు. అతడు అరంగేట్రం చేయడంతో తాను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పాడు. ఇక ఈ మ్యాచ్‌లో కేవలం ఒకే ఓవర్‌ బౌలింగ్‌ వేసిన ఉమ్రాన్‌.. 14 పరుగులిచ్చాడు. ఆటలో ఇవన్నీ సహజమే అని, మ్యాచ్‌లు ఆడేకొద్దీ అతడే మెరుగవుతాడని హార్దిక్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఏ ఆటగాడికైనా అరంగేట్రం ఒకేసారి జరుగుతుందని, ఉమ్రాన్‌ దాన్ని ఆస్వాదించాలని సూచించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని