
Team India: టీమ్ఇండియా దక్షిణాఫ్రికా పర్యటన.. ఫిట్నెస్ నిరూపించుకుంటేనే హార్దిక్‌కు చోటు.!
ఇంటర్నెట్ డెస్క్: గత కొన్ని నెలలుగా వెన్నునొప్పితో బాధపడుతున్న టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య.. ఫిట్నెస్ నిరూపించుకుంటేనే దక్షిణాఫ్రికా పర్యటనలో అతడికి చోటు కల్పించనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఫిట్నెస్ నిరూపించుకునే దానిపైనే హార్దిక్ ఎంపిక ఆధారపడి ఉందని బీసీసీఐ అధికారులు పేర్కొన్నారు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్‌కు చోటు దక్కినా.. ప్రభావం చూపలేకపోయాడు. దీంతో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో కూడా చోటు కోల్పోయిన విషయం తెలిసిందే.
‘హార్దిక్ కోలుకునేందుకు తగినంత విశ్రాంతి అవసరం. దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఇంకా చాలా సమయం ఉంది. ఆలోపు అతడు కోలుకుని.. ఫిట్నెస్ నిరూపించుకుంటే దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపిక చేస్తాం. అతడు త్వరలో ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీలో ఆడనున్నాడు. ఆ ట్రోఫీలో ఆడటం కన్నా.. అతడు ఫిట్‌గా ఉండటం మాకు చాలా ముఖ్యం. అయినా ఆడాలనుకుంటే అది అతడిష్టం’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. 3 టెస్టులు, 3 వన్డేలు, నాలుగు టీ20 మ్యాచుల నిమిత్తం.. టీమ్ఇండియా డిసెంబర్ 17 నుంచి దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది.
టీమ్ఇండియా గత కొద్ది రోజులుగా ఫాస్ట్ బౌలింగ్ చేయగలిగే నాణ్యమైన ఆల్ రౌండర్ కోసం వెతుకుతున్న విషయం తెలిసిందే. జట్టులో మెరుగైన ఆల్‌రౌండర్ లేకపోవడం పలుమార్లు జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా యువ ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌ని జట్టు యాజమాన్యం ప్రొత్సహిస్తోంది. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అయ్యర్‌కి ఓ అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే.
► Read latest Sports News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.