Indore pitch: ఇందౌర్‌ పిచ్‌కు ఐసీసీ పూర్‌ రేటింగ్‌... కారణమిదే!

ICC Rates indore pitch as poor: ఇందౌర్ పిచ్‌కు ICC పూర్‌ రేటింగ్‌ ఇచ్చింది. మూడు డీమెరిట్‌ పాయింట్లు కేటాయించింది. దీనిపై 14 రోజుల్లోగా BCCI అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది.

Published : 04 Mar 2023 01:44 IST

ఇందౌర్‌: టీమ్‌ ఇండియా (Team India)కు ఘోర పరాజయాన్ని ఇచ్చిన ఇందౌర్‌ పిచ్‌ (Indore Pitch)కు ICC పూర్‌ రేటింగ్‌ ఇచ్చింది. భారత్‌ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టెస్టుకు ఉపయోగించిన ఇందౌర్‌లో హోల్కర్‌ స్టేడియంలోని పిచ్‌ రేటింగ్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) పూర్‌గా తేల్చింది. బోర్డర్‌ - గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఇందౌర్‌లో జరిగిన మూడో టెస్టు ఇంకా రెండ్రోజుల ఆట మిగిలి ఉండగానే ముగిసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో భారత్‌ ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలోనే హోల్కర్‌ పిచ్‌కు ఐసీసీ పూర్‌ రేటింగ్‌ కేటాయించింది. అలాగే ఈ మైదానానికి మూడు డీమెరిట్‌ పాయింట్లనూ జారీ చేసింది. ఇది ఐదేళ్ల రోలింగ్‌ పీరియడ్‌ పాటు వర్తిస్తుంది.

మ్యాచ్‌ అనంతరం ఐసీసీ మ్యాచ్‌ రిఫరీ క్రిస్‌ బ్రాడ్‌ ఇరు జట్ల కెప్టెన్లతో అభిప్రాయం తీసుకున్నాక పిచ్‌కు సంబంధించి తన నివేదికను సమర్పించాడు. పిచ్‌ చాలా డ్రైగా ఉందని, ఆటలో బ్యాట్‌కు బాల్‌కు మధ్య ఏ మాత్రం బ్యాలెన్స్‌ కుదరలేదని రిఫరీ తన నివేదికలో పేర్కొన్నాడు. మ్యాచ్‌ ఆది నుంచీ స్పిన్నర్లకే పిచ్‌ అనుకూలంగా ఉందని కూడా తెలిపాడు. బ్రాడ్‌ సమర్పించిన నివేదిక ఆధారంగా పూర్‌ రేటింగ్‌ ఇస్తూ ఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నివేదికను బీసీసీఐకి సైతం పంపించింది. దీనిపై 14 రోజుల్లోగా అప్పీల్‌కు వెళ్లొచ్చు. స్పిన్నర్లకు అనుకూలంగా నిలిచిన పిచ్‌పై తన తొలి ఇన్నింగ్స్‌లో తొలి అర్ధగంటలోనే భారత్‌ ఏడు వికెట్లు కోల్పోయింది. రెండ్రోజుల్లో 30 వికెట్లు టపటపా పడిపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని