ICC: లాహోర్‌లో ఐసీసీ ఛైర్మన్‌.. ప్రపంచకప్‌లో పాక్‌ ఆడే అంశం ఓ కొలిక్కి వచ్చేనా..?

భారత్ - పాకిస్థాన్‌ (IND vs PAK) మ్యాచ్‌ కోసం ప్రపంచంలోని క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తుంటారు. అయితే, రెండు మెగా టోర్నీల భవిత మాత్రం ఏంటా అని ఆందోళన మొదలైంది. దీంతో ఐసీసీ పెద్దలు రంగంలోకి దిగారు.

Published : 31 May 2023 15:52 IST

ఇంటర్నెట్ డెస్క్: బీసీసీఐ - పీసీబీ (BCCI-PCB) మధ్య ఆసియా కప్‌, వన్డే ప్రపంచకప్‌ పీటముడి ఇంకా కొనసాగుతోంది. తమ దేశంలో జరిగే ఆసియా కప్‌లో ఆడకపోతే.. భారత్‌ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌లో పాక్‌ పాల్గొనేది లేదని పీసీబీ (PCB) ఛైర్మన్‌ నజామ్‌ సేథి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అలా కాకుండా తమ మ్యాచ్‌లను భారత్‌లో (Team India) కాకుండా ఇతర దేశాల్లో నిర్వహిస్తే తప్పకుండా పాల్గొంటామని నజామ్‌ ఓ ప్రతిపాదన చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో రెండు మెగా టోర్నీల పరిస్థితి ఎలా ఉంటుందోనని క్రికెట్ అభిమానుల్లో సందేహం నెలకొంది.  ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఛైర్మన్‌ గ్రెగ్ బార్‌క్లే, సీఈవో జెఫ్‌ అలార్డిక్‌ రంగలోకి దిగారు. ఎలాంటి కండీషన్‌ లేకుండా ప్రపంచకప్‌లో పాల్గొనేలా పాక్‌ను ఒప్పించేందుకు ఇప్పటికే లాహోర్‌కు చేరుకున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. 

భద్రతా కారణాలరీత్యా ప్రభుత్వం అనుమతి ఇవ్వనిపక్షంలో.. తమ మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో నిర్వహించేలా ఐసీసీని అడుగుతామని నజామ్‌ తెలిపారు. ఈ క్రమంలో ఐసీసీ వర్గాలు మాత్రం విభిన్నంగా స్పందించాయి. ‘‘ఐసీసీ, బీసీసీఐ మాత్రం ఇలాంటి ప్రతిపాదలనలను అంగీకరించవు. అయితే, భారత్‌లో పాకిస్థాన్‌ ఆడితే టోర్నీ మొత్తం విజయవంతమవుతుంది. అందుకే, పాక్‌ నుంచి సరైన హామీ తీసుకోవడానికి ఐసీసీ అత్యున్నత కార్యవర్గం నడుం బిగించింది’’ అని పేర్కొన్నాయి. బీసీసీఐ, పీసీబీ మధ్య వారధిగా ఉండేందుకు ఐసీసీ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని