Sports Budget: క్రీడల బడ్జెట్‌.. పెరిగింది కాస్తే కానీ.. ఇదే అత్యధికం!

కేంద్రం తన బడ్జెట్‌లో క్రీడలకు గతేడాదితో పోలిస్తే ఈ సారి కేటాయింపులను కాస్త పెంచింది. 

Published : 01 Feb 2023 18:48 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టోక్యో ఒలింపిక్స్‌, కామన్వెల్త్‌ గేమ్స్‌లో అత్యద్భుత ఆటతీరుతో పతకాలను కైవసం చేసుకొన్న భారత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కేంద్రం బడ్జెట్‌లో కేటాయింపులను పెంచింది. గతేడాదితో పోలిస్తే ఈసారి రూ.335 కోట్ల వరకు కేటాయింపులు పెరిగాయి. ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆసియా గేమ్స్, ప్యారిస్ ఒలింపిక్స్‌ నేపథ్యంలో అథ్లెట్ల సన్నద్ధతకు నిధులను పెంచడం విశేషం. గతేడాది రూ. 3,062 కోట్లతో బడ్జెట్‌ రూపొందించగా.. ఈసారి 3,397.32 కోట్లను బడ్జెట్‌ ఇస్తూ ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇప్పటి వరకు క్రీడలకు కేటాయించిన అత్యధిక బడ్జెట్‌ ఇదే కావడం విశేషం. 

అథ్లెట్ల కోసం జాతీయ స్థాయిలో క్యాంపులు, మౌలిక వసతులు, క్రీడా పరికరాలు, కోచ్‌ల నియామకం తదితర వాటిని నిర్వహించే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAP)కు రూ. 785.52 కోట్లు, ఖేలో ఇండియా కోసం రూ. 1045 కోట్లు, జాతీయ స్పోర్ట్స్‌ ఫెడరేషన్ (NSP)కు రూ. 325 కోట్లు, జాతీయ క్రీడల అభివృద్ధి కోసం రూ. 15 కోట్లు, జాతీయ కేంద్ర స్పోర్ట్స్‌ సైన్స్‌, పరిశోధన కోసం రూ. 13 కోట్లు,  జాతీయ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ (NADA) రూ. 21.73 కోట్లు, జాతీయ డ్రగ్ టెస్టింగ్‌ ల్యాబ్‌ (NDTL)కు రూ. 19.5 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు. ఆసియన్ గేమ్స్ 2023, ప్యారిస్‌ ఒలింపిక్స్‌కు సన్నద్ధమయ్యే క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవకాశం కలుగుతుందని కేంద్రం ఆశిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని