IPL 2022: ఈసారి కప్పు సాధించే సత్తా మాకుంది: హెట్‌మైయిర్‌

ఈసారి కప్పు సాధించే సత్తా రాజస్థాన్‌ రాయల్స్‌కు ఉందని ఆ జట్టులో కొత్తగా చేరిన బిగ్‌ హిట్టర్‌ షిమ్రన్‌ హెట్‌మైయిర్‌ ధీమా వ్యక్తం చేశాడు. ఇంతకముందు బెంగళూరు, దిల్లీ ఫ్రాంఛైజీల జట్లతో...

Updated : 20 Mar 2022 13:45 IST

(Photo: Rajasthan Royals Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈసారి కప్పు సాధించే సత్తా రాజస్థాన్‌ రాయల్స్‌కు ఉందని ఆ జట్టులో కొత్తగా చేరిన బిగ్‌ హిట్టర్‌ హెట్‌మైయిర్‌ ధీమా వ్యక్తం చేశాడు. ఇంతకు ముందు బెంగళూరు, దిల్లీ ఫ్రాంఛైజీల జట్లతో ఆడిన అతడు ఈసారి మెగా వేలంలో రాజస్థాన్‌కు మారిపోయాడు.

‘రాజస్థాన్‌ జట్టులో ఆడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ ఫ్రాంఛైజీ గురించి నా మిత్రుడు ఎవిన్‌ చాలా మంచి విషయాలు చెప్పాడు. ఐపీఎల్‌లో నేను తొలిసారి బెంగళూరు తరఫున ఆడాను. అదెంతో సవాలుతో కూడుకున్నదిగా అనిపించింది. అప్పుడు ఆ జట్టులో నేను ఒక్కడినే వెస్టిండీస్‌ నుంచి వచ్చాను. దీంతో అక్కడ సర్దుకుపోయేందుకు కాస్త ఇబ్బందిపడ్డా. అయితే, మొత్తంగా ఐపీఎల్ వల్ల చాలా మంచి విషయాలు నేర్చుకునే అవకాశం దక్కింది. ముఖ్యంగా ఎలా ఆడాలి, ఆటతీరు ఎలా మెరుగుపరుచుకోవాలన్న విషయాలు తెలుసుకున్నా’ అని హెట్‌మైయిర్‌ పేర్కొన్నాడు.

ఇక ఈ ఏడాది కొత్త ఆటగాళ్లతో నిండిన రాజస్థాన్‌ జట్టుపై స్పందించిన అతడు కుమార సంగక్కర నేతృత్వంలో రాణించడానికి సిద్ధంగా ఉన్నామన్నాడు. ‘సంగక్కర లాంటి దిగ్గజ ఆటగాడి పర్యవేక్షణలో ఆడటం గొప్ప విషయం. అతడితో మాట్లాడి నా ఆటలో అవసరమైన మార్పులు చేసుకుంటా. దీంతో కేవలం పరిమిత ఓవర్లలోనే కాకుండా సుదీర్ఘ ఫార్మాట్‌ క్రికెట్‌లోనూ రాణించాలనుకుంటున్నా. ఇక ఇప్పుడున్న రాజస్థాన్‌ జట్టుతో నేను సంతోషంగా ఉన్నా. మాకున్న ఆటగాళ్లతో ఈ ఏడాది తిరిగి కప్పు సాధిస్తామనే నమ్మకం ఉంది’ అని హెట్‌మైయిర్‌ పేర్కొన్నాడు. కాగా, రాజస్థాన్‌ ఐపీఎల్ ఆరంభ సీజన్‌లోనే విజేతగా నిలిచింది. తర్వాత మరోసారి టైటిల్‌ గెలవలేకపోయింది. ఈ నేపథ్యంలోనే హెట్‌మైయిర్‌ ఈసారి కప్పు కొడతామనే ధీమాతో ఉన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని