
CSK: ‘నా భార్య సీఎస్కే జెర్సీ వేసుకోనివ్వడం లేదు’
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్లో ఎన్ని జట్లు ఉన్నా.. ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మ్యాచ్ ఎవరితోనైనా, ఎక్కడైనా సరే అభిమానుల కోలాహలం భారీస్థాయిలో ఉంటుంది. సీఎస్కే పోటీ పడిన ప్రతి మ్యాచ్ అభిమానులకు ఎంతో ఆనందాన్ని అందించింది. నిన్న (ఆదివారం) కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ ఎంత రసవత్తరంగా సాగిందో చూశాం. అంతకుముందు ఆర్సీబీ, సీఎస్కే జట్ల మధ్య జరిగిన మ్యాచూ పోటాపోటీగా సాగింది. అందులోనూ సీఎస్కే విజయఢంకా మోగించింది. అయితే ఆర్సీబీతో మ్యాచ్‌లో తమాషా సంఘటన చోటు చేసుకుంది.
సీఎస్కేకు వీరాభిమాని అయిన ఓ ప్రేక్షకుడు ఆర్సీబీ జెర్సీ వేసుకుని పట్టుకున్న ప్లకార్డు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. ‘మా ఆవిడ నన్ను సీఎస్కే జెర్సీ వేసుకునేందుకు ఒప్పుకోవడం లేదు’ అంటూ మ్యాచ్ సందర్భంగా తన బాధను ప్లకార్డు రూపంలో ప్రదర్శించాడు. ఈ చిత్రం ఒక్కసారిగా వైరల్‌గా మారింది. పిక్చర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం అధికారిక ట్విటర్లో పోస్టు చేసింది. సీఎస్కే పెట్టిన పోస్టుకు 18వేల లైకులు రాగా.. రెండు వేల మంది రీట్వీట్ చేశారు. ‘ప్రతి సీజన్లో జెర్సీ మార్చాల్సిన అవసరం లేని జట్టు ఏదైనా ఉందంటే అది సీఎస్కే మాత్రమేనని.. మీ సతీమణికి చెప్పు’ అంటూ సరదాగా ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘సీఎస్కే గుండెల్లో ఉంటుంది.. జెర్సీలో ఉండదు’ అంటూ మరో నెటిజన్ స్పందించాడు.