PBKS vs MI: ఆ సిక్స్‌ల వెనుక మర్మమిదే: ఇషాన్‌ కిషన్‌

పంజాబ్‌పై వీరవిహారం చేసిన యువ బ్యాటర్ ఇషాన్‌ కిషన్‌పై (Ishan Kishan) సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. భారీ లక్ష్యం ఉన్నా.. కెప్టెన్ రోహిత్ త్వరగానే ఔటైనప్పటికీ ఏమాత్రం బెరుకులేకుండా భారీ షాట్లను కొట్టాడు. ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Published : 04 May 2023 19:40 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2023 సీజన్‌లో (IPL 2023) ముంబయి ఇండియన్స్‌  పాయింట్ల పట్టికలో దూసుకొస్తోంది. ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంటూ ముందుకు సాగుతోంది. తాజాగా పంజాబ్‌ కింగ్స్‌ను చిత్తు చేసి ఆరో స్థానంలో కొనసాగుతోంది. పంజాబ్‌ నిర్దేశించిన 215 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబయి ఓపెనర్ ఇషాన్‌ కిషన్ చెలరేగిపోయాడు. కేవలం 41 బంతుల్లోనే 75 పరుగులు చేసి ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించాడు. నాలుగు సిక్స్‌లు, ఏడు ఫోర్ల సాయంతో అదరగొట్టాడు. సూర్యకుమార్‌ యాదవ్‌తో కలిసి మూడో వికెట్‌కు 116 పరుగులు జోడించాడు.  ఈ క్రమంలో తన భారీ సిక్స్‌లు వెనుక  రహస్యమేంటో ఇషాన్‌ కిషన్‌ వెల్లడించాడు. పవర్ హిట్టింగ్‌ చేయాలంటే ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాలనే నియమాలను గతంలో పట్టించుకోలేదని, సీనియర్ల నుంచి అనేక విషయాలను నేర్చుకున్నట్లు తెలిపాడు. 

‘‘ఫిట్‌నెస్‌ సాధించడానికి మనకు చాలా మంది సీనియర్లు రోల్‌ మోడల్స్‌ ఉన్నారు. వారిని చూసి కఠిన శిక్షణతో కృషి చేశా. మ్యాచ్‌లు ఉన్నా.. లేకపోయినా శ్రమించడాన్ని మాత్రం విరమించలేదు. అలాగే మనం ఇంట్లో ఏం తింటున్నామనేది కూడా చాలా కీలకం. అందుకు మా అమ్మకు ధన్యవాదాలు చెబుతున్నా. ఇక పంజాబ్‌తో మ్యాచ్‌ జరిగిన మొహాలీ వేదిక బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. చివరి వరకు క్రీజ్‌లో ఉంటే ఛేదన కష్టమేం కాదని తెలుసు. భారీ లక్ష్యం ఉన్నప్పుడు తొలి ఓవర్‌ నుంచి ఉన్న ఊపును చివరి బంతి వరకు కొనసాగించాలి’’ అని ఇషాన్‌ చెప్పాడు. ముంబయి జట్టులో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఇషాన్‌ కిషన్‌ ముందున్నాడు. ఇప్పటి వరకు 9 మ్యాచులకుగాను 286 పరుగులు సాధించాడు. ముంబయి ఇండియన్స్ తన తదుపరి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో చెపాక్‌ వేదికగా మే 6న తలపడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని