Virat-Anushka : ‘‘నాలుగు నిమిషాలు అనుకొని వెళ్తే నాలుగు గంటలపాటు ముచ్చటించాం’’

యువ క్రికెటర్లకు అమూల్యమైన సలహాలు, సూచనలు ఇవ్వడంలో...

Published : 02 Mar 2022 14:05 IST

ఆనాటి సంఘటనను గుర్తు చేసుకున్న టీమ్‌ఇండియా మహిళా క్రికెటర్‌ 

ఇంటర్నెట్ డెస్క్‌ : యువ క్రికెటర్లకు అమూల్యమైన సలహాలు, సూచనలు ఇవ్వడంలో భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ ఎప్పుడూ ముందుంటాడు. కోహ్లీతో ఓ నాలుగు నిమిషాలు ముచ్చటించే అవకాశం వస్తే చాలు అనుకునే యువ క్రీడాకారుల సంఖ్యకు లెక్కేలేదు. అలాంటి అరుదైన ఛాన్స్‌ టీమ్ఇండియా మహిళా క్రికెటర్లు జెమ్మీ రోడ్రిగ్స్, స్మృతీ  మంధానకు దక్కింది. అయితే విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ జోడీతో కొద్దిసేపు మాట్లాడదామని వెళ్లిన ఈ మహిళా క్రికెటర్లు దాదాపు నాలుగు గంటలపాటు ముచ్చటించారు. కోహ్లీ వందో టెస్టు ఆడనున్న నేపథ్యంలో ఆనాటి సంగతులను రోడ్రిగ్స్‌ గుర్తు చేసుకుంది. 

2020లో న్యూజిలాండ్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు టీమ్‌ఇండియా అక్కడ పర్యటించింది. అదే సమయంలో మహిళల ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ పోటీలు జరిగాయి. ఫైనల్‌కు చేరిన మహిళల భారత జట్టు ఆసీస్‌ చేతిలో ఓటమి పాలైంది. అయితే మన ఉమెన్స్‌ టీమ్‌ ప్రదర్శన మాత్రం ఆకట్టుకుంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ బస చేసిన హోటల్‌లోనే భారత మహిళా క్రికెటర్లకు గదులను కేటాయించారు. దీంతో విరాట్‌తో మాట్లాడాలని అనుకున్నామని రోడ్రిగ్స్ తెలిపింది. ‘‘విరాట్ భయ్యా.. బ్యాటింగ్‌కు సంబంధించిన విషయాలను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాం. మేం కూడా మీరుంటున్న హోటల్‌లో ఉన్నాం. మిమ్మల్ని కలవొచ్చా?’’ అని కోహ్లీని రిక్వెస్ట్‌ చేశామని గుర్తు చేసుకున్నారు. ఎంతో సాదరంగా తమను ఆహ్వానించారని, హోటల్‌లోని కేఫ్‌కు అనుష్కతో సహా వచ్చారని రోడ్రిగ్స్‌ వెల్లడించింది. 

ఒత్తిడిని ఎదుర్కోవడం ఎలాగంటే?

ఓ నాలుగైదు నిమిషాలు మాట్లాడదామని వెళ్లి దాదాపు నాలుగు గంటలపాటు కోహ్లీ-అనుష్కతో ముచ్చటించామని రోడ్రిగ్స్‌ తెలిపింది. ‘‘కాసేపు సమయం అడిగాం. అయితే చివరికి నాలుగు గంటలపాటు మాట్లాడేశాం. అందులో అరగంట సమయం బ్యాటింగ్‌కు సంబంధించిన అంశాల గురించి చర్చించాం. ఇక మిగతా సమయమంతా సాధారణ విషయాలే’’ అని పేర్కొంది. అభిమానుల అంచనాలను అందుకోవడానికి పడే ఒత్తిడిని ఏ విధంగా ఎదుర్కొంటారని కోహ్లీ దగ్గర తెలుసుకున్నామంది. ‘‘మైదానంలోకి దిగితే వాటన్నింటినీ పట్టించుకోను. ఆటమీదే దృష్టిసారిస్తా. బ్యాటింగ్‌కు దిగితే స్కోరు బోర్డు వైపు చూస్తా. అంతే కానీ ప్రేక్షకుల అరుపులపై దృష్టిపెట్టను. భారత విజయానికి నేనేం చేయగలనో దానినే ఆలోచిస్తా. మన మీద అంచనాలకు ప్రాముఖ్యత ఇవ్వడం ఆపేసి చూస్తే ఫలితాలు ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి’’ అని విరాట్ వివరించారని రోడ్రిగ్స్‌ తెలిపింది. ప్రస్తుతం టీమ్‌ఇండియా మహిళా జట్టు వన్డే ప్రపంచకప్‌ కోసం కివీస్‌లోనే ఉంది. అయితే రోడ్రిగ్స్‌కు జట్టులో స్థానం దక్కలేదు. మార్చి 6న మొదటి మ్యాచ్‌లో పాక్‌తో భారత్‌ తలపడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని