kidambi srikanth: వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో కిదాంబి ఓటమి.. రజతంతో సరి

బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ తుది పోరులో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్...

Updated : 19 Dec 2021 22:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ తుది పోరులో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌ పోరాడి ఓడాడు. ఫైనల్‌లో సింగపూర్‌ ఆటగాడు కీన్‌యూ 21-15, 22-20 తేడాతో శ్రీకాంత్‌పై విజయం సాధించాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టిద్దామని భావించిన కిదాంబి రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

ఫైనల్‌ మ్యాచ్‌ తొలి సెట్‌ నుంచి విజయం కోసం ఇద్దరు ఆటగాళ్లు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే మొదటి సెట్‌ను కీన్‌యూ 21-15తో సొంతం చేసుకున్నాడు. ఓటమికి డీలా పడకుండా రెండో సెట్‌లో కిదాంబి అద్భుతంగా పోరాడాడు. ఒక దశలో ఇద్దరి స్కోరు 20-20కి చేరుకోవడంతో ఉత్కంఠ పెరిగింది. అయితే కిదాంబి శ్రీకాంత్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా కీన్‌యూ వరుసగా రెండు పాయింట్లు సాధించి 22-20 తేడాతో గెలుపొందాడు. స్వర్ణ పతకం చేజిక్కించుకున్నాడు.

డబ్ల్యూబీసీలో ఫైనల్‌కు చేరిన మూడో భారత షట్లర్‌గా శ్రీకాంత్‌ నిలిచాడు. గతంలో సైనా నెహ్వాల్ (2015), పీవీ సింధు (2017, 2018, 2019) ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. పీవీ సింధు 2019లో స్వర్ణం సాధించగా.. మిగతా రెండు సార్లు రజతాలను తన ఖాతాలో వేసుకుంది. అలానే సైనా కూడా రజతంతో సరిపెట్టుకుంది. మరోవైపు ఈ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు పతకాలు వచ్చాయి. కిదాంబి శ్రీకాంత్‌కు రజతం, సెమీస్‌లో ఓడిపోయిన లక్ష్య సేన్‌కు కాంస్య పతకాలు దక్కాయి.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని