INDvsSL: ఒకటి, రెండు ఆటలతో కెరీర్‌ ఆగదు

ఒకటి, రెండు ఆటలతో కెరీర్‌ ముగిసిపోదని టీమ్‌ఇండియా మణికట్టు స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ అన్నాడు. అయితే, చాలా కాలం అవకాశాలు రాకపోతే మన మీద మనకే సందేహాలు నెలకొంటాయని కూడా చెప్పాడు...

Updated : 19 Jul 2021 16:32 IST

కొలంబో: ఒకటి, రెండు ఆటలతో కెరీర్‌ ముగిసిపోదని టీమ్‌ఇండియా మణికట్టు స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ అన్నాడు. అయితే, చాలా కాలం అవకాశాలు రాకపోతే మన మీద మనకే సందేహాలు నెలకొంటాయని కూడా చెప్పాడు. ఈ ఏడాది మార్చిలో పుణెలో ఇంగ్లాండ్‌తో ఆడిన ఓ మ్యాచ్‌లో ఈ మణికట్టు స్పిన్నర్‌ 84 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. దాంతో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతడికి అవకాశాలు రావనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఆదివారం శ్రీలంకతో ఆడిన మ్యాచ్‌లో కుల్‌దీప్‌ 2/48 ప్రదర్శన చేసి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా మీడియాతో మాట్లాడిన అతడు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘ఇంగ్లాండ్‌తో ఆ మ్యాచ్‌ తర్వాత నేనెప్పుడూ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నా కెరీర్‌ ముగిసిపోయిందని అనుకోలేదు. కొన్ని సందర్భాల్లో ఎవరైనా పరుగులిస్తారు. అలాగే ఇదివరకు నేను నాలుగు, ఐదు వికెట్ల ప్రదర్శనలు కూడా చేశాను. ప్రజలు వాటిపైనా మాట్లాడితే ఇంకా బాగుండేది. ఒకటి, రెండు మ్యాచ్‌లు మన కెరీర్‌ను ముగించలేవు. ఈ ఆట ఆడి దీనిపై మంచి అవగాహన ఉన్నవాళ్లకు ఎవరికైనా ఈ నిజం తెలిసే ఉంటుందని నేను నమ్ముతున్నా. ఇంగ్లాండ్‌ సిరీస్‌లో పుణె పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో స్పిన్నర్లకు సహకరించలేదు. వికెట్లు సహకరించనప్పుడు ఎవరికైనా అలాగే జరుగుతుంది’ అని కుల్‌దీప్‌ పేర్కొన్నాడు.

‘మరోవైపు బయోబుడగలో ఉండటం చాలా కష్టం. మరీ ముఖ్యంగా అవకాశాలు రానప్పుడు మనమీద మనకే నమ్మకం ఉండదు. అదింకా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు చాలా మంది మనకు సహాయం చేయాలని చూస్తారు. మనతో మాట్లాడాలనుకుంటారు. అలా ఎక్కువ మందితో మాట్లాడితే అనవసరంగా కొత్త సందేహాలు కలుగుతాయి. ఈ మ్యాచ్‌కు ముందు నేనెంతో ఒత్తిడికి గురయ్యాను. మంచి ప్రదర్శన చేయాలని అనుకున్నప్పుడు ఇది సహజంగానే జరుగుతుంది. అయితే, అందరికన్నా ముందు రాహుల్‌ ద్రవిడ్‌ సర్‌ నాకు అండగా నిలిచారు. తన మాటలతో స్ఫూర్తి నింపారు. అన్నిటికన్నా ముఖ్యంగా నా ఆటను ఆస్వాదించమని చెప్పారు. అదిప్పుడు సత్ఫలితం ఇచ్చింది. దాంతో చాలా సంతోషంగా ఉన్నాను’ అని కుల్‌దీప్‌ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని